జగన్‌ జైలుకు పోతాడా? పోడా?

జైలుకు పోతాడా? పోడా? అనే ప్రశ్న ఎవరి గురించి? ఆయన గురించి అంత ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది ఏముంది? రౌడీయా? గూండానా? సంఘవిద్రోహ శక్తులకు నాయకుడా? ఆయన ఇవేవీ కాదు. కాని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి. పేరు వైఎస్‌ జగన్‌. వైఎస్సార్‌సీపీ అధినేత. అక్రమాస్తులు, అక్రమ పెట్టుబడుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్‌ జగన్‌ జైలుకు వెళతాడా? వెళ్లడా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చాలాకాలంగా బెయిల్‌పై ఉంటున్న జగన్‌ బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘించారని, కాబట్టి ఆయన బెయిల్‌ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపాలని సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై 28న తీర్పు రాబోతోంది. ఈ విషయంలో వైకాపాతోపాటు టీడీపీలోనూ ఉత్కంఠభరితంగా ఉంది. 

జగన్‌ జైలుకు వెళ్లాలని టీడీపీ నాయకులు ముక్కోటి దేవుళ్లకు మొక్కుకుంటూ ఉండగా, ఆయన జైలుకు వెళ్లరని వైకాపా నాయకులు ధీమాగా ఉన్నారు. ఈ కేసు నిలిచేదికాదని జగన్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంతకూ జగన్‌ చేసిన నేరమేమిటి? వాస్తవానికి ఏమీలేదు. కొంతకాలం క్రితం ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డిని  సాక్షి టెలివిజన్‌ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు  ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఆ ఇంటర్వ్యూలో జగన్‌ గురించి పాజిటివ్‌గా మాట్లాడారు.  జగన్‌ ఏనాడూ సచివాలయానికి వచ్చి తనను కలుసుకోలేదని, ఫలానావారికి ఫేవర్‌ చేయాలని కోరలేదని, పనులు చేసిపెట్టమని అడగలేదని చెప్పారు. జగన్‌పై కేసు నిలిచేది కాదని తాను ఆనాడే చెప్పానని కూడా అన్నారు. ఇదంతా సీబీఐకి మహా ద్రోహంలా కనిపించింది.     ఎందుకు? ఇంటర్వ్యూ జగన్‌కు టీవీ ఛానెల్‌ సాక్షిలో ప్రసారమైంది కాబట్టి. బెయిల్‌పై ఉన్న జగన్‌ సాక్షులను ప్రభావితం చేసేవిధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బెయిల్‌ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్‌ వేశారు. 

జగన్‌కు రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో ఎలాంటి సంబంధం లేదని వైకాపా నాయకులు చెబుతున్నారు. ఈ కేసులో జగన్‌ సిబీఐ పిటిషన్‌ను డిస్మిస్‌ చేయాలని కోరడమే కాకుండా, తాను కుటుంబ సభ్యులతో న్యూజిలాండ్‌ వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. ఇప్పుడీ కేసులో తీర్పు ఏమొస్తుందోనని ఉత్కంఠభరితంగా ఉంది. సీబీఐ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తే దర్యాప్తు సంస్థ హైకోర్టుకు వెళుతుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఒకవేళ జగన్‌ జైలుకు వెళితే టీడీపీ నాయకులు ఊపిరి పీల్చుకుంటారు. తమకు అడ్డు తొలగిందని ఫీలవుతారు. జగన్‌ జైలుకు వెళ్లాల్సివస్తే వైకాపా పరిస్థితి ఏమిటనేది అభిమానుల ముందున్న ప్రశ్న. 

దీనిపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలొస్తున్నాయి. ఈమధ్య ఓ కథనం వచ్చింది. దాని ప్రకారం జగన్‌ జైలుకు వెళితే ఆయన భార్య వైఎస్‌ భారతి పార్టీ బాధ్యత తీసుకుంటారట...! దీనికి ఆధారమేమిటో తెలియదు. తల్లి వైఎస్‌ విజయమ్మ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమె బయటకు వచ్చే పరిస్థితి లేదట...! సోదరి షర్మిల అనాసక్తంగా ఉన్నారట...! అందుకే భారతి ముందుకు రావచ్చని ఊహాగానాలు చేస్తున్నారు. కేసయిన కొత్తలో జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు సోదరి షర్మిల పార్టీ బాధ్యతలు భుజాన వేసుకొని పార్టీ ఉనికిని కాపాడిన తీరు ప్రశంసనీయమని చెప్పకతప్పదు. అప్పట్లో ఆమె చేసిన పాదయాత్ర ఓ రికార్డు. ఓ మహిళ తన కుటుంబాన్ని పక్కకు పెట్టి, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిరగడం చాలా గొప్ప సంగతి. జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలనే పిటిషన్‌పై ఎలాంటి తీర్పు వస్తుందోగాని పరిస్థితి ఉత్కంఠగా ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం.

జగన్‌ జైలుకు వెళ్లడం జరిగితే ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారతాయి. దీన్ని ప్రతీకార రాజకీయాలుగా వైకాపా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే వైకాపా మీద ఎన్నో ప్రతీకార చర్యలు సాగుతున్నాయి. వైకాపా సానుభూతి పరుడు అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న రవి కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం ఇందుకు నిదర్శనం. ఈ ఘటనతో సోషల్‌ మీడియా ప్రాధాన్యం, పాత్ర, నియంత్రణ తదితర విషయాలపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. 

Show comments