వేరే మీడియా వర్గాలు అమరావతి జోలికి గనుక వెళితే.. అది అభివృద్ధికి అడ్డుపడటం అంటారు. అమరావతిలో అవినీతి కంపు గురించి రాస్తే.. ఇక్కడ ఆస్తులన్నీ కొంతమందే ఆక్రమించేస్తున్నారు.. వందల ఎకరాలు కూడబెట్టుకునేశారు, బినామీల రాజ్యం.. అని అంటే, అదంతా బాబుగారి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రక్రియ అని అంటారు. నిజా నిజాలు తేల్చడం కాదు.. కేసులు పెడతాం, అరెస్టులు చేస్తామని హెచ్చరిస్తారు!
అంతేకాదు.. అమరాతి ప్రాంతానికి పొంచి ఉన్న వరద ముప్పు గురించి రాసినా, అమరావతి నిర్మాణంతో మూడు పంటలు పండే భూములు నాశనం అవుతున్నాయని అందోళన వ్యక్తం చేసినా.. అసలు ఇక్కడ నగర నిర్మాణం పర్యావరణానికి ఏ మాత్రం మేలు చేసేది కాదని చెప్పినా.. ఏ మాత్రం శాస్త్రీయ అధ్యయనం లేకుండా ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపడుతున్నారని వ్యాఖ్యానించినా.. రాజధాని కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? అని ప్రశ్నించినా.. రాజధాని అంశంతో పెనవేసుకుని వందల వేల వివాదాల్లో దేని గురించి ప్రస్తావించినా సరే.. వాళ్లంతా అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. బాబుగారు బుల్లెట్ లో దూసుకుపోతుంటే.. పంచర్లు వేస్తున్నారు! అంటూ ఒక ముద్రేస్తారు!
మరి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో విశృంఖలమైన కులోన్మాదం అంటూ.. తెలుగుదేశానికి అనుకూల మీడియాలో ప్రత్యేక కథనం వచ్చింది. పతాక శీర్షికకు ఎక్కించి అక్కడి పరిస్థితి గురించి తెలియజెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విద్యనభ్యసించిన రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతపు స్టూడెంట్లకు కూడా అక్కడి కుల పిచ్చి గురించి తెలిసే ఉంటుంది. ప్రత్యేకించి వర్సిటీల్లో, కాలేజీల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అవగాహన ఉండే ఉంటుంది. ఈ విషయాన్నే తెలుగుదేశం గజిట్ ఒక దాంట్లో రాశారు!
వేరే వాళ్లు రాసి ఉంటే.. అదంతా విశ్వనగరం నిర్మాణానికి అడ్డుపడటమే.. అని ఒక్కమాటే తేల్చేసే వాళ్లు బాబుగారి భక్తులు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో మితిమీరిన కులోన్మాదం ఒక సామాజిక దురాచారంగా మారింది. తగ్గడం మాట అటుంచి.. ఈ తరంలో మరీ పెరుగుతోందని ‘అమరావతి’ ఇమేజ్ బూస్టప్ చేసే పనిలో ఉన్న వాళ్లే చెబుతున్నారు.
మరి విశ్వనగరానికి ఈ తరహా కుల పిచ్చి తగునా? ఇంత కులోన్మాదం ఉన్న చోట కాస్మోపాలిటన్ సిటీ నిర్మితం అవుతుందా? అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అంశాలే. అయినా.. విడ్డూరం కాకపోతే, అసలు భౌగోళిక పరిస్థితుల రీత్యా చూస్తే.. రాజధానిని ఆ ప్రాంతంలో నిర్మించడమే తప్పు.. ఇదంతా జరుగుతున్నదే ఒక ‘కులోన్మాదం’ మేరకే.. అనే మాటా రెండేళ్ల నుంచి ప్రచారం ఉంది. మరి అలాంటి చోట ఆవరించిన కులోన్మాదం గురించి మళ్లీ మాట్లాడటమా! అది కూడా ఒక కులం వాళ్లు తీవ్రంగా ఓన్ చేసుకున్న పార్టీకి కాపుగాసే అదే కులం వాళ్ల పత్రికలో.. సీ-బ్యాచ్ అంటూ వార్తలా!