పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించి అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరిందట. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఒప్పందం ప్రకారం నాబార్డ్ నిధులు, పోలవరం ప్రాజెక్టుకి అందనున్నాయి. ఆ నిధులకు సంబంధించి చెల్లింపులు పూర్తిగా కేంద్రమే చూసుకుంటుంది. చెల్లింపులు అంటే అప్పు తీర్చడం అన్నమాట. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గనుక, కేంద్రమే ఆ ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాలి. ఇది విభజన చట్టం చెబుతున్నమాట.
అయితే, కేంద్రం నిర్మించే ప్రాజెక్ట్‌కి చాలా కాలం పడుతుంది గనుక, తానయితే 'అనుభవంతో' అతి తక్కువ కాలంలో పూర్తి చేయగలను గనుక, ఆ ప్రాజెక్ట్‌ని రాష్ట్ర బాధ్యతగా, కేంద్రం నిధులు ఇచ్చేలా ఒప్పించి నిర్మించేస్తున్నట్లు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అనేక సందర్భాల్లో ఊదరగొట్టేశారు. విభజన చట్టం ప్రకారమైతే అది జాతీయ ప్రాజెక్టు గనుక, విభజన చట్టాన్ని సవరించకుండా, ఆంధ్రప్రదేశ్‌కి పోలవరం బాధ్యతలు ఎలా అప్పగిస్తారు.? అన్న విషయమై పలు అనుమానాలున్నాయనుకోండి.. అది వేరే విషయం.
అక్టోబర్ 15న తొలి విడత నిధులు నాబార్డ్ నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం విడుదలవుతాయని తెలుస్తోంది. ఇకనేం, తెలుగు తమ్ముళ్ళు తొందరపడొచ్చు.. అందినకాడికి దోచెయ్యొచ్చు. ఎందుకంటే, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తయ్యేనో ఎవడికెరుక.. ఈలోగా ఇసుక మేటలతో, మట్టిపెళ్ళలతో కాఫర్ డామ్ కట్టేసి, అదే పోలవరం ప్రాజెక్ట్ తొలి దశ.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించెయ్యనున్నారు మరి.
మొత్తంగా 32 వేల కోట్ల రూపాయలపైన ఖర్చవుతుందన్నది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన తాజా అంచనా. ఇందులో కేంద్రం ఎంత మొత్తం ఇస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. విభజన చట్టం ప్రకారం అయితే 90 శాతం కేంద్రం ఇవ్వాలి.. 10 శాతం ఆంధ్రప్రదేశ్ భరించాలి. చంద్రబాబు చెబుతున్న ప్యాకేజీ - కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్న ప్రత్యేక సాయం ప్రకారం ఆ మొత్తం కేంద్రమే ఇస్తుంది. కానీ, ఇది నిజమేనా.? ఏమో, ఎవడికెరుక.!
ఒక్కటి మాత్రం నిజం. పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలుగు తమ్ముళ్ళు నిలువునా దోచేస్తారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. రెండున్నరేళ్ళపాటు ప్రాజెక్టు పనుల్ని పడకేయించి, మిగిలిన రెండేళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేయడమంటే, అది సాధ్యమేనా.? దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి కానున్న పోలవరం.. రెండేళ్ళలో కాదుకదా, ఐదేళ్ళలో పూర్తవుతుందన్నా నమ్మే పరిస్థితున్నాయా.?