బల నిరూపణకా? ప్రత్యేక హోదా సాధనకా?

రాజకీయాల్లో అధికారపక్షం ప్రతిపక్షాలను దెబ్బ తీయడానికి వ్యూహాలు పన్నుతుంటుంది. అధికార పక్షాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తుంటాయి. ఇది నిరంతరం సాగే క్రీడ. ఈ క్రీడలో పైకి ప్రజా ప్రయోజనాలు ఉన్నట్లు కనబడినా అసలు ప్రయోజనం రాజకీయమే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇక రాదని అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పినట్లు అది ముగిసిపోయిన అధ్యాయమే. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనంది. రాష్ట్ర ప్రభుత్వం సరేనంది. ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వనంది. ప్రత్యేక ఆర్థిక సాయం మాత్రమే చేస్తానంది. రాష్ట్ర ప్రభుత్వం సరే...కానివ్వమని చెప్పింది. 

ఇలా రెండు ప్రభుత్వాలు ఒక్కటైపోయినప్పుడు ఎన్ని పార్టీలు, ఎంతగా పోరాటం చేసినా ప్రత్యేక హోదా రాదు. ఏపీలోని పార్టీలకు ఈ విషయం తెలుసు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీకి ఇంకా బాగా తెలుసు. హోదా కోసం పార్లమెంటులో పోరాడాలని, బడ్జెటు సమావేశాల్లోగా హోదా ఇవ్వకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. రాజీనామాలకు వచ్చే ఏడాది మే 15వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు. పార్లమెంటు బడ్జెటు సమావేశాలు ఇంకా ప్రారంభం కాలేదు. వైసీపీ ఎంపీలు ఇంకా పోరాడలేదు.  

వీరు పోరాడితే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. అయినప్పటికీ మే 15న రాజీనామాలు చేయాలని  ఇప్పుడే ఎందుకు నిర్ణయించారు? ఎందుకంటే...ఎంత పోరాటం చేసినా ప్రత్యేక హోదా రాదని తెలుసు కాబట్టి. మే 15 ఎందుకు నిర్ణయించారు? ఆ తేదీతో మోదీ పాలన మూడేళ్లు పూర్తవుతుంది. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేసినా హోదా రాదు. వారు రాజీనామాలు చేసినా రాదు. ఈ విషయం జగన్‌కు తెలుసు. మరెందుకు రాజీనామాలు? బల నిరూపణ కోసం. ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న (రాజీనామాలూ పోరాటంలో భాగమే) వైకాపాను ఆదరిస్తారా? దాన్ని వదులుకున్న టీడీపీని ఆదరిస్తారా? సార్వత్రిక ఎన్నికల ముందు ఈ విషయం తెలుసుకోవాలని జగన్‌ నిర్ణయించుకున్నారు. 

ఈ విషయంలో తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఏమిటా స్ఫూర్తి? తెలంగాణ ఉద్యమ నాయకుడైన కేసీఆర్‌ మొదట తాను రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచిన తరువాత పలుమార్లు టీఆర్‌ఎస్‌ ఎంపీలను, ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు జరిపించారు. దీంట్లో గెలుపోటముల విషయం ఎలాగున్నా ఉప ఎన్నికలను బల నిరూపణకు, ప్రజాదరణకు కొలబద్దగా నిర్ణయించుకున్నారు. జగన్‌ కూడా ఇదే దార్లో వెళుతున్నారు. ప్రత్యేక హోదాను వదులుకొని ప్రత్యేక సాయాన్ని అంగీకరించిన టీడీపీ సర్కారును, సీఎం చంద్రబాబును అప్రతిష్ట పాల్జేయడానికే ఉప ఎన్నికలు జరిపించాలని జగన్‌ డిసైడయ్యారు.

ప్రతిపక్షాల్లో ఎంపీలున్నది ఈ ఒక్క పార్టీకే. కాబట్టి మిగతా విపక్షాలన్నీ వైకాపాకే మద్దతు ఇవ్వాల్సివుంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో జగన్‌ ఇప్పటికే అనేక సదస్సులు, సభలు, సమావేశాలు పెట్టి ప్రజల బుర్రల్లోకి ఎక్కించారు. తన మీడియా ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రత్యేక హోదా అనే ఒకే ఒక్క అజెండా ద్వారానే ఉప ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. ఇక చంద్రబాబు ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, అది దండగమారిదని ప్రజల బుర్రల్లోకి ఎక్కించాల్సివుంటుంది. 

నిజానికి ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే...ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ, వెంకయ్య నాయుడు, ఇతర బీజేపీ నేతలు అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత ఊదరగొట్టారు. బాబు కూడా ప్రత్యేక హోదా ఇస్తే ఎంత ప్రయోజనకరమో ప్రచారం చేశారు. ప్రాథమికంగా ఇది ప్రజల మైండ్‌లోకి వెళ్లిపోయింది.  ఆ తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని చెప్పడమే కాకుండా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కూడా ఈ నాయకులే నూరిపోశారు. కాని వారు ముందుగా చేసిన ప్రచారమే ప్రజల మనసుల్లో నాటుకుంది. అలాగే మోదీ, వెంకయ్య, బాబు కలసికట్టుగా మోసం చేశారనే భావన కూడా ఉంది. 

ఈ నేపథ్యంలో జగన్‌ పోరాటం ప్రజలపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. అది ఎంత మేరకుందో నిరూపణ కావాలంటే ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్‌ భావించినట్లుగా ఉంది. ఈ ఉప ఎన్నికలు జరిగేలోగానే మున్సిపల్‌ ఎన్నికల్లోనే జనం అభిప్రాయం తెలిసే అవకాశముంది. ఆ ఎన్నికల ఫలితాలు జగన్‌కు అనుకూలంగా ఉంటే ఉప ఎన్నికలకు వెళ్లడం గ్యారంటీ. కాబట్టి అధికార ప్రతిపక్షాలకు మొదటి పరీక్ష మున్సిపల్‌ ఎన్నికలే అవుతాయి. రెండో పరీక్ష ఉప ఎన్నికలు. మొదటి పరీక్షలో వైకాపా పాసైతే, రెండో పరీక్షలోనూ నెగ్గినట్లే. 

Show comments