చంద్రబాబు రేటింగ్‌లో వెనకబడిన తమ్ముళ్లు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతీ మూడు నెలలకూ ఒకసారి తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తూ వారికి రేటింగ్‌ ఇస్తున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎవరు హాజరవుతున్నారు, జనంలో ఎవరున్నారు, పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు వంటి డేటాతో జగన్‌ ఈ రేటింగ్స్‌ ఇస్తున్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే తీరున తమ పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్న తమ్ముళ్లు ఎందరు, చురుకుగా ఎవరున్నారు, ఎవరు ఆసక్తిగా లేరు అన్న దాని మీద సర్వే చేయించి రేటింగ్స్‌ ఇస్తున్నారు. 

ఆ విధంగా చూస్తే గోదావరి జిల్లాల తమ్ముళ్లకే మంచి రేటింగ్‌ దక్కినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్రా జిల్లాల తమ్ముళ్లు అంతగా చురుకైన పాత్రను పోషించలేదని అంటున్నారు. 

చంద్రబాబు కూడా దీని మీద ఉత్తరాంధ్రా ప్రాంతీయ సదస్సును త్వరలో నిర్వహించి పార్టీలో పనితీరును మెరుగుపరచుకోవాలని తమ్ముళ్లకు గట్టిగా సూచనలు చేయనున్నారని తెలుస్తోంది. అలా పార్టీ కోసం కష్టపడిన వారికే వచ్చే ఎన్నికలలో టిక్కెట్లు ఇస్తామని కూడా ఆయన స్పష్టం చేయబోతున్నారుట. 

ఇక పార్టీ కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపని పట్టించుకోని తమ్ముళ్ల జాబితాలో సీనియర్లు, మాజీ మంత్రులు కూడా కొందరు ఉన్నారని అంటున్నారు. మరి వారిని ఏ విధంగా బాబు ఆదేశించి ముందుకు తీసుకెళ్తారన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది.

Show comments