చంద్రబాబు ద్రోహాన్ని చాటి చెప్పిన మోడీ!

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు’ అని గగ్గోలు పెడుతున్న వారు కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని అనాధ రాష్ట్రం చేశారని ముసలి కన్నీరు కార్చే వారికి గుణపాఠం మోడీ మాట! ఆయన రాజమండ్రి ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనిస్తే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహమే ప్రధానంగా కనిపిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికార వికేంద్రీకరణ జరగాలనే లక్ష్యంతో.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో.. మూడు రాజధానులు కాన్సెప్ట్ తెరమీదకి తీసుకువచ్చారు. అలాగని అమరావతికి ఆయన చేసిన నష్టం ఏమీ లేదు. శాసన రాజధానిగా అది ఎటూ ఉండనే ఉంటుంది.  జగన్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాధాన్యం తగ్గి ఉండవచ్చు. కోర్టు కేసులు కారణంగా పనులు స్తంభించి ఉండవచ్చు.

కానీ చంద్రబాబు హయాంలో అమరావతికి ఏం ఒరిగింది? కేంద్రం ఇవ్వదలచిన నిధులను కూడా తీసుకోలేని అసమర్ధతతో చంద్రబాబు నాయుడు అమరావతి నగరానికి తీరని ద్రోహం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు పేరును ప్రస్తావించకుండా ఇండైరెక్టుగా బయటపెట్టారు.

చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో అమరావతి నగరానికి శంకుస్థాపన జరిగినప్పుడు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు.. ఆ సందర్భంగా ఆయన ఒక చెంబుడు గంగాజలం, పిడికెడు పవిత్రమైన మట్టి మాత్రం తెచ్చి మన మొహాన కొట్టి వెళ్లిపోయారని అందరూ అనేక విమర్శలు చేశారు. ఆర్థిక వనరుల రూపంలో అమరావతి కోసం ఆయన వేదిక మీద నుంచి ఎలాంటి హామీ ప్రకటించనే లేదు. అయితే అప్పటి రహస్యాన్ని ఇవాళ రాజమండ్రి సభలో నరేంద్ర మోడీ బయటపెట్టారు. అమరావతి రాజధాని కోసం కేంద్రం 15 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలనుకున్నదని కానీ కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేకపోయిందని మోడీ చెప్పారు.

Readmore!

రాజధాని శంకుస్థాపన చంద్రబాబు హయాంలో జరగగా, కేంద్రం ఇవ్వదలుచుకున్న నిధులు పొందలేని అసమర్ధ ప్రభుత్వం ఎవరిది అని అనుకోవాలి? కచ్చితంగా అది చంద్రబాబు నాయుడు వైఫల్యమే అని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు పొత్తుల్లో ఆయనతో కలిసి పోటీ చేస్తున్నారు కనుక.. చంద్రబాబు నాయుడు పేరును ప్రధాని మోడీ ప్రస్తావించకపోవచ్చు గాని, కేంద్రం ఇవ్వదలచిన నిధులను కూడా తీసుకునే సమర్ధత లేని చంద్రబాబు ప్రభుత్వం కారణంగానే అమరావతికి ఎక్కువ నష్టం జరిగిందని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు.

Show comments