చంద్రబాబు నాయుడికి నీడలా పవన్‌కల్యాణ్ వుంటారు. బాబు చెప్పినట్టు నడుచుకుంటారని పవన్‌పై టీడీపీ శ్రేణులు ప్రశంసలు కురిపిస్తుంటారు. సినిమాల్లో దర్శకులు చెప్పినట్టైనా పవన్ వింటారో, లేదో తెలియదు. కానీ చంద్రబాబు చెప్పిన మాట తూ.చా తప్పకుండా పవన్ పాటిస్తారనే విమర్శ వుంది.
తాను వృత్తిరీత్యా నటుడినే తప్ప, జీవితంలో నటించడం తెలియదని పవన్‌కల్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. అయితే పక్కనే నటుడిని పెట్టుకుని, ఆయనకు మించిపోయేలా చంద్రబాబు నటిస్తున్నారు. బాబు రాజకీయ జీవితమంతా నటనే అంటే అతిశయోక్తి కాదు. రాజకీయ స్వార్థంతో చంద్రబాబు అనేక యూటర్న్లు తీసుకున్న ఘనత దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నటన మామూలుగా లేదు. కర్నూలు జిల్లాలో ప్రచారం చేస్తున్న చంద్రబాబు తన మార్క్ నటనా రాజకీయానికి తెరలేపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రతుల్ని ఆయన కాల్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజలు తమ హక్కు కోల్పోతారని భయపెట్టారు. సీఎం జగన్ భూములు లాక్కుంటారని చంద్రబాబు అన్నారు.
2019, జూలైలో ల్యాండ్ టైటిల్ చట్టంపై అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ చట్టం చాలా గొప్పదని ఆయన ప్రశంసించారు. ఈ చట్టానికి టీడీపీ మద్దతు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ల్యాండ్ టైటిల్ చట్టానికి అసెంబ్లీలో మద్దతు ఇచ్చి, ఇప్పుడు దానిపై తీవ్రమైన ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లింది.
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతలా దిగజారిన నాయకుడిని ఎవరూ చూసి వుండరని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బుల్లితెర, వెండితెరపై నటించే వాళ్లను చూశాం కానీ, రాజకీయ తెరపై నిత్యం నటించే ఏకైక నాయకుడు చంద్రబాబే అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. నటనలో పవన్‌ను మించిపోయావని చంద్రబాబుపై సెటైర్స్ విసురుతున్నారు.