అతి చిన్న సమాజసేవకురాలు

కొందరు పిల్లలు అంతే.. అవకాశాలు వుంటాయి. వాటిని అంది పుచ్చుకోవడమూ వుంటుంది. కలశ నాయుడు అనే చిన్నారి ఇలాగే తన తల్లి తండ్రులు అందించిన తోడ్పాటుతో కలశ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించి, పలువురికి సాయపడుతూ ముందుకు సాగడమే కాకుండా, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకుంది. 2013లో పుట్టిన కలశనాయుడు కు చిన్నప్పటి నుంచి తన వస్తువులు ఎవరైనా అడిగితే ఇచ్చేయడం అన్నది అలవాటుగా వుండేది. నిజానికి పేరెంట్స్ ఇలాంటి అలవాటును కట్టడి చేస్తారు. కానీ కలశ తల్లితండ్రులు ఆమె అభిరుచి గమనించి, సమాజసేవ దిశగా నడించారు.

ఆమె కోసమే కలశ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసారు. అక్షర కలశం అనే కార్యక్రమం పేరుతో ఎంతో మంది చదువుకు ఆమె ద్వారా సాయం అందించారు. అలాగే విభిన్న రంగాల్లోని ప్రతిభ కలిగిన మహిళలను గుర్తించి మార్వెలెస్ ఉమెన్ అనే పేరుతో సన్మానించారు. గ్రీన్ రన్ పేరుతో పర్యావరణం మీద అవగాహన కార్యక్రమాలు ఇదే ఫౌండేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ఎన్నో దేశాల నుంచి అవార్డులు, రివార్డులు కలశ నాయుడును వరించాయి.

ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు లభించిన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అందించిన గౌరవ డాక్టరేట్ మరొక ఎత్తు. కలశ చేసిన సేవలను గుర్తించి లండన్ పార్లమెంట్ భవనంలో ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా గుర్తింపు అందించారు. బ్రిటిష్ పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఇండియన్ హై కమిషనర్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంతా కలశ గురించి ప్రశంసిస్తూ మాట్లాడడం విశేషం.

ఈ సందర్భంగా కలశ నాయుడు గురించి అక్కడి పార్లమెంట్ లో రెండు నిమిషాల నిడివి గలిగిన అడియో, విజవల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బ్రిటన్ ప్రధాని స్వయంగా హాజరు కాకపోయినా, కలశనాయుడును సన్మానించుకోవడం ఓ సదవకాశం అని ప్రశంసించారు. కలశనాయుడు విశాఖ జిల్లాకు చెందిన మన తెలుగు అమ్మాయి.

Readmore!

Show comments