వైఎస్ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, పులివెందుల నుంచి జగన్ మీద పోటీ చేసి, నారా లోకేష్ విజయం సాధిస్తారట. జగన్‌ని ఓడించే సత్తా లోకేష్‌కి వుందంటూ టీడీపీ నేతలు మీసం మెలేసేస్తున్నారు.. తొడకొట్టేస్తున్నారు. ఇంతకీ, నిజంగానే లోకేష్‌కి అంత సత్తా వుందా.? అంత సత్తా వుంటే, ఎమ్మెల్యేగా గెలిచి, ఎలాంటి విమర్శలకూ ఆస్కారం లేకుండా నారా లోకేష్ మంత్రి అయి వుండేవారు. కానీ, లోకేష్ సమర్థత మీద చంద్రబాబుకి పూర్తిస్థాయి అవగాహన వుంది. ఎమ్మెల్యేగా ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గెలవలేడనే నిర్ణయానికి వచ్చాకనే, ఎమ్మెల్సీగా చాన్సిచ్చి, మంత్రిని చేసుకున్నారు చంద్రబాబు.
సపోజ్.. ఫర్ సపోజ్.. లోకేష్‌కి నిజంగానే ఎమ్మెల్యేగా గెలిచే సత్తా వుందనుకుందాం. ఇంకెందుకు, ఆలస్యం.! రెడీగా నంద్యాల ఉప ఎన్నిక వుంది. అక్కడే లోకేష్ పోటీ చేసేసి, ఎమ్మెల్యేగా గెలిచేయొచ్చు. వైఎస్ జగన్ వరకూ ఎందుకు, వైఎస్సార్సీపీ తరఫున ఎవరో ఒకరు బరిలో నిలబడ్తారు, ఆ ఎన్నికల్లో లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచేసి.. వైఎస్సార్సీపీ మీద గెలిచేశానని చెప్పుకోవచ్చు. నిజానికి, నంద్యాల ఉప ఎన్నికల్లో లోకేష్ పోటీ చేస్తే, 'ఎడ్జ్' చాలా ఎక్కువ. కానీ, అంత సాహసం ఆయన చేయగలడా.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిపాలైన మాట వాస్తవం. కానీ, అక్కడ ఎన్నికలెలా జరిగాయ్.? అన్నదీ ముఖ్యమే కదా. స్థానిక ప్రజా ప్రతినిథుల్ని ప్రలోభపెట్టి, భయపెట్టి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేసి మరీ, ప్రతిపక్షంపై విజయం సాధించింది అధికార పక్షం. ఇవేవీ లేకుండా, నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొని వుంటే, కడప ఎమ్మెల్సీ ఫలితం అధికార పార్టీకి చెంపపెట్టులా మిగిలి వుండేదే. ఎమ్మెల్సీ ఎన్నికలకీ, ఎమ్మెల్యే ఎన్నికలకీ తేడా తెలియనోళ్ళు ఎన్నికల గురించీ, గెలుపోటముల గురించీ మాట్లాడేయడాన్ని ఏమనుకోవాలి.?