రెబల్ రోజా: అమరావతిలో 'పప్పు' తాళింపు.!

ఏంటో, రోజక్క పఫ్పుగోల.! 'పప్పు' అంటూ లోకేష్‌ని విమర్శించడం సంగతేమోగానీ, 'పప్పు'కి రోజానే బ్రాండ్‌ అంబాసిడర్‌లా మారిపోయేలా వుంది పరిస్థితి చూస్తోంటే. నంద్యాల ఉప ఎన్నికల వేళ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మరోమారు టీడీపీపై చెలరేగిపోయారు తీవ్రమైన విమర్శలతో. పనిలో పనిగా, చినబాబు నారా లోకేష్‌పైనా దుమ్మెత్తి పోసేశారు. 

'అమరావతిలో పప్పు తాళింపు మానేసి.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి..' అంటూ చంద్రబాబు సర్కార్‌కి సవాల్‌ విసిరారు రోజా. 'ముద్దపప్పు, టమాటా పప్పు, దోసకాయ పప్పు..' ఇలా ఓ రేంజ్‌లో సాగింది రోజా విమర్శల ప్రసహనం. 'ఇప్పటిదాకా టీడీపీలో ఒకరే పప్పు అనుకున్నాం.. ఇంకో పప్పు తయారైంది.. ఆ కొత్త పప్పు ఎవరో కాదు, అఖిల ప్రియ..' ఇదీ రోజా వరస. 

అన్నట్టు, మంత్రి అఖిలప్రియ కట్టూబొట్టు వ్యవహారశైలిపైనా రోజా విమర్శలు చేసేశారు. సంప్రదాయాల గురించి మాట్లాడతావా.? పద్ధతిగా చీర కట్టుకోవాల్సింది పోయి, చుడీదార్లు వేసుకుని తిరగడమేనా సంప్రదాయం.? అంటూ రోజా ప్రశ్నించేశారండోయ్‌ అఖిల ప్రియని. ఇది మాత్రం నిజంగానే పెద్ద కామెడీ. సినిమాల్లో రోజా వస్త్రధారణ గురించి కొత్తగా చెప్పేదేముంది.? టీవీ షోల్లో రోజా ధరిస్తున్న వస్త్రధారణ మాటేమిటి.? 

ఓ మహిళగా ఇంకో మహిళ వస్త్రధారణపై ఎవరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సమర్థనీయం కాదు. అసలంటూ ఈ రోజుల్లో, అసభ్యకరంగా వస్త్రధారణ చేసుకున్నా ఎవరూ విమర్శించలేని పరిస్థితం. 'అందం ఆత్మవిశ్వాసం..' అంటూ కొత్త అర్థం చెబుతున్న రోజులివి. సో, ఈ విషయంలో రోజా కాస్త ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడి వుండాల్సింది. 

మొత్తమ్మీద రోజా అంటేనే ఫైర్‌ బ్రాండ్‌. పార్టీ ఫిరాయింపులపైనా, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వం తీరుపైనా విరుచుకుపడిపోయారు రోజా. ఇంతకీ, 'పప్పు తాళింపు' వ్యవహారానికి సంబంధించి రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు టీడీపీ ముందడుగు వేస్తుందా.? సోషల్‌ మీడియాలో లోకేష్‌ని 'పప్పు' అన్నందుకే కదా, నెటిజన్లపై కేసులు, అరెస్టుల వ్యవహారం నడుస్తోన్నది.!

Show comments