'పచ్చ' కామెర్లకి పరాకాష్ట

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఆందోళనలు చేసినా, తన మీద కేసుల కోసమే ఆయన ఢిల్లీకి వెళుతున్నట్టు లెక్క.. 

పార్టీ పిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళుతున్నా, ఆ ముసుగులో జగన్‌ చేసేది తన మీద కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకునేందుకే.. 

అదే, చంద్రబాబు ఢిల్లీకి వెళితే మాత్రం.. ఆంధ్రప్రదేశ్‌ని ఉద్ధరించేయడానికి. ప్రత్యేక హోదా అంశాన్ని తుంగలో తొక్కేసినా.. కేంద్రం ఏం చెప్పినా, చంద్రబాబు 'జీ హుజూర్‌' అంటున్నా.. కేంద్రం వద్ద చంద్రబాబుకి బోల్డంత 'ఫాలోయింగ్‌' వుందని లెక్కేసుకోవాలి.. 

'పచ్చ'కామెర్లున్నోడికి లోకమంతా పచ్చగానే కన్పిస్తుందన్నట్టుగా తయారైంది టీడీపీ పరిస్థితి. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రం కాలు పట్టుకోవాల్సి వస్తే అదేమీ పెద్ద విషయం కాదు. అలా వైఎస్‌ జగన్‌, కేంద్రానికి సాగిలాపడ్డ మరుసటి క్షణమే, బీజేపీ - టీడీపీ బంధం తెగిపోతుంది. జగన్‌ మీద కేసులు అటకెక్కిపోతాయ్‌.. చంద్రబాబు మీద కేసులు తీవ్రతరమవుతాయి. అది జరగడంలేదంటే, దానర్థమేంటి.? జగన్‌ - కేంద్రం వద్ద సాగిలా పడ్డంలేదనే కదా.!  Readmore!

ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళ్ళడం, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పలు అంశాలపై చర్చించడం అంటే, అదేదో మహా తప్పిదంగా భావించడం దేశంలో బహుశా తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమయ్యిందేమో. చంద్రబాబూ ప్రతిపక్షనేతగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనా ఢిల్లీకి వెళ్ళారు. కాంగ్రెస్‌ని అనుక్షణం వ్యతిరేకిస్తామని చెప్పుకునే చంద్రబాబు, అదే కాంగ్రెస్‌ ప్రభుత్వంతో లాలూచీ పడ్డారు. 'చీకటి సమావేశాల' గురించి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం, సాక్షాత్తూ పార్లమెంటులోనే ప్రస్తావించారు. అది ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన నేపథ్యంలో జరిగిన ఘనకార్యం. 

ఢిల్లీలో ఎలా కేంద్రంతో లాలూచీ పడాలో చంద్రబాబుకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. 'ఓటుకు నోటు కేసు' కోసం, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టుపెట్టేసిన ఘనుడు చంద్రబాబు. తన రాజకీయ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తుని ఆయన కాలగర్భంలో కలిపేశారన్నది జగమెరిగిన సత్యం. ప్రత్యేక హోదా కావాల్సిందేనని అడిగిన నోటితోనే చంద్రబాబు, ప్రత్యేక హోదా అవసరం లేదని బీజేపీ పాట పాడుతున్నారంటే, దేనికోసం.?

అదే, వైఎస్‌ జగన్‌ విషయానికొస్తే ప్రత్యేక హోదా కోసం ఇంకా పోరాడతామంటున్నారు. వస్తుందా.? రాదా.? అన్నది వేరే విషయం. పార్లమెంటు ద్వారా సంక్రమించిన హక్కుని సాధించుకోవడంలో వైఎస్‌ జగన్‌ ప్రయత్నమైతే చేస్తున్నారు. బీజేపీతో కేసుల విషయంలో లాలూచీ పడితే, ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్‌ జగన్‌ ఇంకా ఎందుకు పట్టుకుని వేలాడతారట.! 

పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి 'చట్ట సవరణను' టీడీపీ కోరుతోంది. చట్ట సవరణ కోరేముందు, ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకూడదన్న కనీస ఇంగితం టీడీపీలో కొరవడింది. అందుకే, వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళుతున్నారు. అక్కడ కేంద్రం, వైఎస్‌ జగన్‌ డిమాండ్లను పట్టించుకోవడం, పట్టించుకోకపోవడం అనేది మళ్ళీ వేరే చర్చ. 

ఒక్కటి మాత్రం నిజం. రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీ వున్నా, కేంద్రంతో సన్నిహిత సంబంధాలున్నా.. చంద్రబాబులో అభద్రతాభావం అయితే ఇంకా తొలగిపోలేదు. జగన్‌, బీజేపీతో కలిసి తన రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆందోళన చంద్రబాబులో సుస్పష్టంగా కన్పిస్తోంది. ఆ ఆందోళనలోంచే, లోకమంతా ఆయనకీ, ఆయన అనుచరగణానికీ 'పచ్చ'గా కన్పిస్తోంది మరి.!

Show comments