ఇదే నగ్న సత్యం

బహుశా ప్రపంచంలో ఇంతకన్నా హేయమైన చర్య ఇంకొకటి వుండదు. ఎంత స్త్రీలోలుడైతే మాత్రం, నగ్నంగా అతని విగ్రహాన్ని పెడతారా.? పైగా, అది అగ్రదేశం. ప్రపంచానికి ఆదర్శమని చెప్పుకునే దేశం. 'పురుషాహంకారం' అనే బురద జల్లడం కోసం, పురుషాంగం కూడా కనిపించేలా ఆ విగ్రహాన్ని తయారుచేయించి అమెరికా వీధుల్లో పెట్టారు. సిగ్గు సిగ్గు.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది. బహుశా అది కూడా డెమోక్రాట్ల పరాజయానికి కారణం కావొచ్చు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతి కీలకమైన మార్పు డోనాల్డ్‌ ట్రంప్‌ విగ్రహంతోనే చోటుచేసుకుంది. సభ్య సమాజమంతా ఈ వ్యవహారాన్ని ఖండించింది. హిల్లరీ మద్దతుదారులే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. అక్కడినుంచే కథ పూర్తిగా మారిపోయింది. డ్యామేజీ కంట్రోల్‌.. అంటూ హిల్లరీ క్లింటన్‌ నగ్న విగ్రహాన్ని కూడా తెరపైకి తెచ్చారు కొందరు. అయితే అది కూడా హిల్లరీ కుట్ర.. అనే ఆరోపణలు తెరపైకొచ్చాయి. 

ఎలాగైతేనేం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్య విజయాన్ని అందుకున్నాడు. అలా ఇలా కాదు, బంపర్‌ మెజార్టీతో. గెలవడం సంగతి తర్వాత, రిపబ్లికన్ల అభ్యర్థిగా అయినా చివరి వరకు బరిలో నిలబడతాడా.? లేదా.? అన్న అనుమానాల్ని పటాపంచలు చేస్తూ, డోనాల్డ్‌ ట్రంప్‌ దూసుకుపోయాడు. 'ఈ విజయం అమెరికన్లది..' అంటూ విజయాన్ని అందుకున్నాక డోనాల్డ్‌ ట్రంప్‌ సగర్వంగా ప్రకటించడం గమనార్హం. 

కలిసొచ్చే అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తాననీ, అమెరికా ప్రయోజనాలకే అగ్ర ప్రాధాన్యమిస్తాననీ చెబుతూ ఈ జీవితాన్ని తనకిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలని పేర్కొన్నాడు డోనాల్డ్‌ ట్రంప్‌, గెలిచిన అనంతరం అమెరికాని ఉద్దేశించి, ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రకటిస్తూ. ఇప్పటిదాకా (మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయానికి) 288 ఎలక్ట్రోరల్‌ ఓట్లతో విజయదుంధుభి మోగించాడు ట్రంప్‌. ఇంకా కొన్ని చోట్ల రిజల్ట్‌ రావాల్సి వున్నా, విజయం అయితే ఖరారయిపోయింది.

Show comments