అత్యంత దయనీయమైన స్థితిలో అఖిలప్రియ..

ఆమెకేంటి.. మంత్రిపదవి దక్కింది అనే వాళ్లు ఉండొచ్చు. విస్తరణ రోజున మిగతా మంత్రులతో పోలిస్తే.. అఖిలప్రియే ఎక్కువ ఆనందంగా కనిపించి ఉండొచ్చు.. ట్రెండీ ట్రెండీగా ఉన్న యూత్‌ఫుల్‌ ఫ్రెండ్స్‌తో ఆమె దిగిన సెల్ఫీలు.. జనాల్లోకి ఒకరకమైన ఇండికేషన్లను పంపించాయి. పైకైతే ఇంత ఆనందంగా కనిపిస్తున్నా.. భూమా అఖిలప్రియ ఇప్పుడు అత్యంత దయనీయమైన స్థితిలోనే ఉంది. మంత్రిగా ఆమెను నియమించారు కానీ.. చంద్రబాబు దగ్గర మంత్రులకు ఉండే పవర్స్‌ ఏమిటో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు.

ఉపముఖ్యమంత్రి హోదాలో ఉండి.. రాజకీయంగా ఎన్నో డక్కామొక్కీలు తిన్న వ్యక్తే.. తట్టుకోలేకపోతున్నాడు. తన శాఖలో చెంచాను కూడా కదిలించలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి వాతావరణం మధ్య అఖిలప్రియ మంత్రిగా నిలదొక్కుకుంటుందని, కనీసం తన ప్రాపకాన్ని అయినా నిలబెట్టుకుంటుందని అనుకోవడానికి మించిన అపోహ ఇంకోటి లేదు. మంత్రిపదవిని ఇచ్చామంటే.. ఇచ్చాం అన్నట్టుగా ఉండబోతోంది కథ.

ఆమె రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడని మంత్రిపదవిని పక్కన పెట్టి చూస్తే.. అఖిలప్రియ ఇప్పుడు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఆమె కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తే వ్యక్తిగతంగా అయినా, రాజకీయంగా అయినా.. జాలి చూపాల్సి ఉంటుంది. తనను కంటికి రెప్పలా కాచుకున్న తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారామె. ఈ విషయంలో సామాన్యజనాలకు అఖిలపై జాలి ఉంటుంది కానీ.. రాజకీయానికి కాదు. మరి ఆ రాజకీయాన్ని ఎదుర్కొనడానికి తగిన వయసు కానీ, అనుభవం కానీ, బలగం కానీ.. అఖిలప్రియకు లేవు పాపం. కనీసం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఉండుంటే.. రాజకీయ పోరాటానికి శక్తి ఉండేది. పదవొచ్చింది.. శక్తి ఉంటుందనుకోవడం పొరపాటు. అది కూడా చాలా తాత్కాలిక కాలమైన పదవి.

ఈ పదవి మీద కాదు కానీ అఖిలప్రియ రాజకీయ భవిష్యత్తు కేవలం ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రజలు ఆమె మీద చూపే సానుభూతి మీదే ఆధారపడి ఉంది. నంద్యాల నియోజకవర్గాన్ని ఎలాగూ భూమా ఫ్యామిలీ మరిచిపోవాల్సిందే ఇక. తెలుగుదేశం పార్టీ ఆ మేరకు స్కెచ్‌ వేసిందనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు ఎలాగూ టీడీపీకి ఆళ్లగడ్డలో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి.. అఖిలకు అవకాశం దక్కుతుంది. అప్పటి వరకూ అక్కడ తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఈమెపై ఉండే సానుభూతి మీదే భవితవ్యం ఆధారపడి ఉంది. నంద్యాల ఉప ఎన్నికతోనే తెలుగుదేశంలో ఈమెకు ఇకపై ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఉంటుందో మరింత స్పష్టత వస్తుంది.

Show comments