మెగా వారసత్వానికి బ్రేక్ పడుతుందా?

ఏ బ్యాకప్ మాత్రమే కాదు, ఏ ఇమేజ్ కూడా లేకుండా హీరోగా పైకి వస్తే చాలా అడ్వాంటేజ్ వుంటుంది. ఇప్పటికే టాప్ లోకి వచ్చిన నాని, ఆ తరువాతి ప్లేస్ లో వున్న శర్వానంద్ లకు ఇదే అడ్వాంటేజ్. వైవిధ్యమైన, కాంటెంపరరీ యూత్ కు నచ్చే సబ్జెక్ట్ లు ఎంచుకుని చేయగలుగుతున్నారు. ఆ తరువాతి ప్లేస్ కోసం నిఖిల్, రాజ్ తరుణ్, ట్రయ్ చేస్తున్నారు. ఇంకా ఇటీవల పెళ్లి చూపులు సినిమాతో సర్రున దూసుకు వచ్చిన విజయ్ దేవరకొండ కూడా వుండనే వున్నారు. కానీ అతగాడు ద్వారక సినిమాతో అక్కర్లేని సబ్జెక్ట్ ఎంచుకుని దెబ్బతిన్నారు.

ఈవారం, ఆ తరువాత రెండు వారాలకు వస్తున్న కేశవ, అంధగాడు సినిమాలు కనుక హిట్ అయితే, నాని, శర్వానంద్ సరసన నిఖిల్, రాజ్ తరుణ్ చేరతారు. కొత్తదనం కోసం చూసే ప్రేక్షకుల కోసం కొత్తగా ఆలోచించే డైరక్టర్లు అంతా ఈ నలుగురి చుట్టూ చేరతారు.

ఇది ఒక విధంగా మెగా అప్ కమింగ్ హీరోలు సాయిధరమ్ తేజ, వరుణ్ తేజలకు ఇబ్బందికర పరిణామమే. మెగా బ్యాక్ గ్రవుండ్ తో హీరోలయ్యారు. వరుణ్ తేజ కొంత వరకు మాస్ ఇమేజ్ కు దూరంగా వుంటే, వైవిధ్యంగా ట్రయ్ చేయడానికి కిందా మీదా అవుతున్నారు. ఇప్పటి దాకా వరుణ్ చేసిన సినిమాలతో నిర్మాతలకు ఒరిగింది ఏమీ లేదు. ఇక సాయిధరమ్ తేజ పబ్లిసిటీ హడావుడితో ఒకటి రెండు హిట్ లు కొట్టాను అనిపించుకున్నారు.

మెగా హీరోలు ఇద్దరికీ ఒకటి రెండు ప్రాజెక్టులు మాత్రమే చేతిలో వున్నాయి. అవి హిట్ అయితేనే వాళ్లకు ముందుకు వెళ్లడానికి దారి దొరకుతుంది. పదికోట్ల లోపు సినిమా చేయడం అన్నది ఈ ఇద్దరు మెగా హీరోలకు సమస్య. శర్వా, నిఖిల్, రాజ్ తరుణ్, విజయ్ దేవర కొండ సినిమాలు అన్నీ పదికోట్ల లోపు బడ్జెట్ తో పూర్తయవుతాయి. నాని సినిమా కూడా మహా అయితే మరో ఒకటి రెండు కోట్ల. కానీ మెగా యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ సినిమాలు అలా కాదు. వాటికి ఇరవై కోట్లకు పైగా బడ్జెట్ అవుతోంది. ఈ విషయం గురించి మెగా హీరోలు ఆలోచించడం లేదు. దీంతో సినిమాలు బకెట్ తన్నితే, నిర్మాతలు కుదేలవుతున్నారు.

విన్నర్ ఫ్లాప్ అయితే పదికోట్లు, మిస్టర్ ఫ్లాప్ అయితే ఇరవైకోట్లు పోయాయి. అదే రాధ ఏవరేజ్ అయినా పెద్దగా లాస్ వుండదు. ఎందుకంటే ఆ సినిమా బడ్జెట్ పదికోట్ల లోపే. పైగా శర్వానంద్, నిఖిల్ లాంటి వాళ్లు అవసరమైతే సినిమా ఏరియా తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటివి అన్నీ కలిసి మెగా యంగ్ హీరోల కన్నా, మిగిలిన యంగ్ హీరోలు బెటర్ అన్న ఫీల్ ను ఇండస్ట్రీలోకి పంపుతున్నాయి.

అందుకే ఇప్పుడు నాని, శర్వా, నిఖిల్, రాజ్ తరుణ్, విజయ్ దేవర కొండ లాంటివాళ్ల కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. పైగా వీళ్లు మాస్ సబ్జెక్ట్ లు కావాలి, ఫైట్లు వుండాలి. టాప్ హీరోయిన్ లు వుండాలి.  ఇలాంటి వాటి జోలికి పోవడం లేదు.సో మెగా యంగ్ హీరోలు మారకపోతే, చిరు తరువాత పవన్ ఆ తరువాత బన్నీ కొనసాగించినట్లుగా, మెగా లెగసీ కొనసాగించే అవకాశం తగ్గిపోతుంది.

Show comments