జగన్ మరీ అంత అమాయకుడా..?

దాచేస్తే దాగే విషయం కాదు... శిల్పా మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం పట్ల కొంతమంది జగన్ పార్టీ అభిమానులు కూడా ఒకింత విస్మయంతో ఉన్నారు. నంద్యాల పరిణామాల నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి వైకాపాలోకి చేరడాన్ని వీరు అంతగా సమర్థించలేకపోతున్నారు. అంతకు మించిన విషయం  ఏమిటంటే.. రేపు శిల్పా మోహన్ రెడ్డి వైకాపా తరపున గెలిచి మళ్లీ ఫిరాయిస్తే పరిస్థితి ఏమిటి? అనేది జగన్ పార్టీ ఫ్యాన్స్ ను కుదిపేస్తున్న అంశం. 

శిల్పా మోహన్ రెడ్డికి ఫిరాయింపు అలవాటుగానే మారింది కాబట్టి.. రేపు ఎమ్మెల్యేగా గెలిచాకా జంప్ చేస్తే పరిస్థితి ఏమిటి.. అనే ఆందోళన ఉంది వీరిలో. అలాగే శిల్పా మోహన్ రెడ్డి గనుక తెలుగుదేశం పార్టీలోనే ఉండి ఉంటే.. భూమా, శిల్పా వర్గాలు కలహించుకునేవి.. అని, వారిలో బాబు ఉపఎన్నికల్లో ఎవరికి ఛాన్స్ ఇచ్చి ఉండినా, మరొకరు ఓడించడానికి యత్నించే వాళ్లు.. ఆ సమీకరణాల మధ్య వైకాపా గెలిచేది అనే వాదనా వైకాపా వాళ్ల మధ్యనే వినిపిస్తోంది. 

రాయలసీమలో.. ప్రత్యేకించి నంద్యాలలో వైకాపా తరపున అభ్యర్థి దొరకడం కష్టం కాదు. కాబట్టి శిల్పా అవసరం ఏమిటి? అనేది మరో ప్రశ్న. ఇలాంటి మేధస్సుతో జగన్ శిల్పకు ఛాన్సిస్తూ వ్యూహాత్మక తప్పిదం చేశాడని.. కొంతమంది తీర్మానించేస్తున్నారు కూడా!

ఒకవైపు నుంచి చూస్తే.. ఈ లాజిక్ లన్నీ రైటే. కానీ.. క్షేత్రస్థాయి పరిస్థితి వేరు. నంద్యాల ఉపఎన్నిక టీడీపీకి కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పీకల మీది వ్యవహారం. ఇక్కడ గనుక తెలుగుదేశం పార్టీ గెలిస్తే.. చంద్రబాబును ఆపతరం కాదు. అనుకూల మీడియా అండతో బాబు రెచ్చిపోవడం అలాగిలాగా ఉండదు. 

వాస్తవాలు మాట్లాడుకుంటే.. నంద్యాల ఉపఎన్నికల్లో ధన ప్రవాహం కట్టలు తెచ్చుకోనుంది. అధికార పార్టీకి ఆ విషయంలో తిరుగుండదు. అటు శిల్పావర్గం, ఇటు భూమావర్గం ఒకటే చోట ఉండి.. అధికారం ప్లస్ సానుభూతి కలబోస్తే.. దాన్నంతా తట్టుకుని వైకాపా గెలిచి నిలవడం అంతసులభం కాదు. వైకాపాకు బేస్ ఉండొచ్చు.. నాయకత్వ సమస్యా లేకపోవచ్చు.. కానీ, ఎన్నికల్లో డబ్బు.. అధికారం కీలకపాత్ర పోషించబోతున్నాయి. 

కర్ణాటకలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సిద్దరామయ్య సర్కారు కూడా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు వస్తే.. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది. అలా ఉంటాయి ఉప ఎన్నికల లెక్కలు. 

నంద్యాలలో శిల్పామోహన్ రెడ్డికి ఉండే ప్లస్ పాయింట్లు ఆయనకున్నాయి. శిల్పాతో పాటు ఇరవై ఐదుమంది మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ కూడా వైకాపా బాట పడుతున్నారంటే.. పరిస్థితిని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు.

ఇక ఆర్థికంగా చూస్తే.. వైకాపా తరపున ప్రతిపాదనలో వినిపించిన ఇతర అభ్యర్థుల కన్నా శిల్పా చాలా మెరుగైన క్యాండిడేట్ అవుతాడు. ఆర్థికంగా భూమా వర్గాన్ని, అధికార పార్టీని ఎదుర్కొనే దన్ను శిల్పకు కచ్చితంగా ఉంటుంది. వైకాపా సహజమైన బలానికి తోడు, శిల్పకు స్థానికంగా ఉన్న కేడర్ తోడవ్వడం నిస్సందేహంగా ప్లస్ పాయింటే.

గత ఎన్నికల్లోనే శిల్పా తెలుగుదేశం పార్టీ తరపున గెలవాల్సిన వ్యక్తి. కేవలం శోభా నాగిరెడ్డి మరణం అనే సానుభూతి మధ్యన భూమా బయటపడ్డాడు. ఆ తర్వాత భూమా వేసిన తప్పటడుగుల పుణ్యమా అని ఆయన ప్రాణాలే పోగొట్టుకున్నారు.. ప్రజల్లోనూ సానుభూతిని కోల్పోయారు. 

ఇవన్నీ గాక.. మరో వాదన ఏమిటంటే, శిల్పా మోహన్ రెడ్డిని చంద్రబాబే వైకాపాలోకి పంపాడు, తన పార్టీ తరపున గెలవలేడు.. అందుకే వైకాపాలోకి పంపి, ఆ పార్టీ తరపున గెలిచాకా.. మళ్లీ టీడీపీలోకి తీసుకుంటాడు అనేది. బహుశా ఇది పరాకాష్ట.

చంద్రబాబుకు మరీ అంత దారుణమైన స్థితి లేదనే చెప్పాలి. అలాగక రేపు నిజంగానే వైకాపా తరపున శిల్ప గెలిచి తెలుగుదేశం పార్టీలోకి పోతే.. అప్పుడు క్రెడిబులిటీ కోల్పోయేది చంద్రబాబు, శిల్పా మోహన్ రెడ్డిలు మాత్రమే. వైకాపా కోల్పోయేది ఏమీలేదు.

గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే.. జగన్ మరీ అంత అమాయకుడు కాడు. ఏ విషయాన్నీ పరిగణనలోకి తీసుకోకుండా శిల్పను చేర్చేసుకునే అవకాశాలు ఉండవు. స్పాంటినేయస్ గానే చక్కగా రియాక్ట్ అయ్యే జగన్ ఇలాంటి విషయాల్లో రాంగ్ క్యాలికుటేషన్ వేసి ఉండకపోవచ్చు. 

Show comments