మూడోస్సారి.. నంద్యాలకు మరో టూరు!

మరోసారి నంద్యాలకు పయనం అయ్యే ఏర్పాట్లలో ఉన్నాడట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఉపఎన్నిక ఖరారు అయ్యాకా.. చంద్రబాబు నాయుడు నంద్యాల్లో రెండు సార్లు టూరేశాడు. ఆ రెండు సార్లూ బాబు గారు మాట్లాడిన మాటలు జాతీయ స్థాయిలో మార్మోగాయి. నా రోడ్ల మీద నడుస్తున్నారు, నా పెన్షన్లు తీసుకుంటున్నారు.. అంటూ బాబు మాట్లాడటం నేషనల్ మీడియా వరకూ ఎక్కింది. ఇక రెండో సారి వెళ్లినప్పుడు ఎవరో ఏదో అడిగారని.. బాబుగారు ఊగిపోయారు. 

నిలదీసిన వ్యక్తిని ఇష్టానుసారం మాట్లాడారు గౌరవనీయ ముఖ్యమంత్రి. అలాగే ముస్లింలను మతం పేరిట ఓట్లు అడగడం.. ప్రార్థనలే చేస్తారో, కన్వీన్సే చేస్తారో.. మొత్తం ఓట్లు మాకే పడాలి.. అని అనడం కూడా ప్రముఖంగా నిలిచింది. ఓవరాల్ గా నంద్యాల బై పోల్ విషయంలో అనుసరిస్తున్న ఎత్తుగడల ద్వారానైతేనేం, మాట్లాడుతున్న మాటల ద్వారానైతేనేం.. చంద్రబాబు తన మాటలతో చాలా పలుచన అయ్యారు. ముఖ్యమంత్రి స్థాయి మాటలు కాగా.. మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి మాటలు మాట్లాడారు బాబు.

మున్సిపాలిటీకి పోటీ చేసే వాళ్లు కూడా ఓట్లను అడగడంలో బాబుగారి కన్నా డిప్లొమాటిక్ గా మాట్లాడతారు... అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి బాబు నంద్యాల్లో పర్యటించనున్నట్టు సమాచారం. ఇంకా ప్రచారానికి మొత్తం పదిహేనురోజుల సమయం ఉంది. ఈ లోపు బాబు కనీసం రెండు సార్లు పర్యటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలింగ్ కు ముందు రోజు వరకూ కూడా బాబు నంద్యాల్లో ఉండేట్టుగా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

ఆగస్టు 19 నుంచి 21 వరకూ అక్కడే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అంతలోపే ఇంకోసారి బాబు నంద్యాల వెళ్లనున్నట్టు సమాచారం. ఈ వారంలోనే బాబు నంద్యాల్లో ఒక రౌండ్ పర్యటనను పూర్తి చేయనున్నారని సమాచారం. పాతిక మంది ఎమ్మెల్యేలను, అరడజను మంది మంత్రులను, ఇంకా కర్నూలు జిల్లా నేతలను నంద్యాల్లోనే మొహరింపజేసినా.. బాబుకు మాత్రం ఎవ్వరి మీదా నమ్మకం లేనట్టుగా ఉంది. అందుకే స్వయంగా మూడోసారి రంగంలోకి దిగి, ఆ తర్వాత కీలకమైన సమయంలో నాలుగో సారి పర్యటించనున్నారని తెలుస్తోంది. Readmore!

Show comments