ఏదైనా చెబితే నమ్మేటట్లు వుండాలి. మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు ఇటీవల మరి ఎవరి ప్రోద్బలమో, లేదా భాజపా వైపు మొగ్గుతున్న వైనమో కానీ, భలే చిత్రంగా మాట్లాడుతున్నారు.
టాలీవుడ్ లో బ్లాక్ మనీ అన్నదే లేదని ఆయన సర్టిఫికెట్ ఇస్తూ, దీనికి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలనే సర్టిఫికెట్ గా జత చేస్తున్నారు. 'అన్నయ్య చెప్పాడు..టాలీవుడ్ లో బ్లాక్ లేదట' అంటూ.
ఇది విని, తెలిసి, టాలీవుడ్ వైనాలు పరిచయం వున్నవారు భలే జోక్ అనుకుంటున్నారు. టాలీవుడ్ లో బ్లాక్ లేకుండా మొత్తం వైట్ లోనే తీసుకున్న ఒక్క హీరోను చూపించండి. పైగా నాగబాబు తన కొడుకు అంతా వైట్ లోనే తీసుకుంటున్నాడు అని చెబుతున్నాడు. ఆ తీసుకుంటున్నది ఎంతో చెబితే మరీ బెటర్.
ఎందుకంటే వరుణ్ తేజ మూడు నుంచి నాలుగు కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఇంతా ఆదాయంలో చూపిస్తున్నారా? అలాగే నాగబాబు సోదరుడు పవన్ 15 నుంచి 20 కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటున్నారు. ఆదాయపన్ను లెక్కల్లో ఎంత చూపిస్తున్నారో?
ఆ మధ్య ఓ పెద్ద సూపర్ హీరోతో పరమ డిజాస్టర్ సినిమా తీసిన నిర్మాత, వైట్ అమౌంట్ ను తన సంస్థ నుంచి చెక్ రూపంలో ఇచ్చి, బ్లాక్ అమౌంట్ ను ఓ ఫైనాన్సియర్ ద్వారా అందించారు. తరువాత సినిమా అమ్మాక, బ్లాక్ అమౌంట్ ను ఆ ఫైనాన్స్ బ్లాక్ కు బదలాయించారు.
టాలీవుడ్ కు చెందిన ఓ అగ్ర కమెడియన్ మూడు వంతులు బ్లాక్ లో, ఒక వంతు వైట్ లో తీసుకుంటారని అందరికీ తెలిసిందే. ఆ మాత్రం ఈ మాత్రం గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా కమెడియన్ రోజుకు లక్ష నుంచి లక్షన్నర తీసుకుంటారు. నెలలో పది రోజుల బిజీగావున్నా ఏడాదికి కోటిన్నరకు పైగా ఆదాయం చూపించాల్సి వుంటుంది. అప్పుడు పన్ను రూపంలో కనీసం పాతిక లక్షలకు పైగానే కట్టాల్సి వుంటుంది. మరి ఈ మేరకు కడుతున్నారా? అంటే అనుమానమే.
ఇలాంటి ఫీల్డ్ లో బ్లాక్ మనీ లేదని నాగబాబు అనడం అంటే ఎలా నమ్మగలరు ఎవరైనా? అయితే ఒకటి, టీవీ రంగంలో మాత్రం బ్లాక్ మనీ అన్నది దాదాపు లేదన్నది టాక్. ఎందకుంటే సీరియళ్లు, స్కిట్ ల నిర్మాతలు అందరికీ చెక్ ల రూపంలోనే పే చేస్తున్నారు దాదాపుగా. అందువల్ల అక్కడ ఈ వ్యవహారం చాలా వరకు తక్కువే. అది దృష్టిలో పెట్టుకునే నాగబాబు అలా అన్నారేమో?