టచ్‌ చేశావ్‌ ఎన్టీఆర్‌.!

జూనియర్‌ ఎన్టీఆర్‌ టచ్‌ చేశాడు. తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్‌ అయినా అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోవడం సహజమే. వారి ఆనందాన్ని నీరుగార్చలేక, ఆ ఆనందం హద్దులు దాటుతున్నా భరించేస్తుంటారు చాలామంది హీరోలు. చాలా తక్కువమంది మాత్రమే, అభిమానుల్ని వారించే యత్నం చేస్తుంటారు. అది కాస్తా అప్పుడప్పుడూ వివాదాస్పదమవుతుంటుంది. 

ఇక, జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం తన అభిమానుల్ని సున్నితంగా హెచ్చరించేశాడు 'జనతా గ్యారేజ్‌' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతోంటే అభిమానులు యధావిధిగా అల్లరి చేశారు. దాంతో ఎన్టీఆర్‌ కొంత అసహనానికి గురయ్యాడు. దయచేసి, దర్శకుడు సినిమా కోసం పడ్డ కష్టం గురించి చెప్పనివ్వండి.. అంటూ అభిమానుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. 

నిజమే మరి, సినిమా గురించి కొరటాల శివ గొప్పలు చెప్పడంలేదు, సినిమా కోసం తామెంత కష్టపడిందీ చెప్పుకొచ్చాడు. సినిమాకి సంబంధించి పనిచేసిన ఒక్కో టెక్నీషియన్‌నీ అభినందిస్తూ, వారి నుంచి తాను నేర్చుకున్నదేమిటో చెబుతున్నాడు. చాలా అరుదుగానే చూస్తుంటాం ఇలాంటి సందర్భాన్ని. కొరటాల శివ నిత్య విద్యార్థి. మిగతా వారిలా కాదు. ప్రతి ఒక్కరినుంచీ ఏదో ఒకటి నేర్చుకుంటాడు. సీనియర్‌ టెక్నీషియన్లతో పనిచేసి, తాను గడించిన అనుభవం గురించి కొరటాల శివ చెబుతోంటే, అది వినేందుకు ఎన్టీఆర్‌ కనబర్చిన శ్రద్ధ అభినందనీయం. 

ఆడియో ఫంక్షన్‌ కావొచ్చు, ఇంకేదైనా కావొచ్చు.. సినిమా గురించి మాట్లాడుకునే అవకాశం కోసం ఆ సినిమా యూనిట్‌ ఎదురుచూసే సందర్భమది. అభిమానులు అరుపులు కేకలతో, ఆ సందర్భానికి వున్న ప్రాముఖ్యతని తగ్గించేసి, అసందర్భంగా మార్చేయడమే అన్ని వివాదాలకీ కారణం. ఆ హీరో ఈ హీరో అన్న తేడాల్లేవు.. హీరోలందరూ ఇదే ఫాలో అయితే మంచిదేమో.! Readmore!

Show comments