కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది.? 2014 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ, పార్లమెంటులో చట్టం చేసింది. తెలంగాణ రాస్ట్రాన్ని ఇవ్వాలనే చిత్తశుద్ధి వుంటే, ఓ ఆర్నెళ్ళ ముందో ఏడాది ముందో ఆ పని చేసి, విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి నష్టం లేకుండా చేసి వుండేది. కానీ, ఇక్కడా కాంగ్రెస్ ఉద్దేశ్యం వేరు.. పోతూ పోతూ వీలైనంతగా ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసెయ్యాలన్న కుట్ర అందులో దాగుంది. 'చెరపకురా చెడేవు..' అన్న మాట పెద్దలు ఊరకనే అన్లేదు. ఫలితం కాంగ్రెస్ పార్టీ అనుభవించింది.
ఇప్పుడు అదే గేమ్ ప్లాన్‌ని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నట్లున్నాయి. అదిగో అది చేశాం, ఇదిగో ఇది చేశాం.. అంటూ రెండున్నరేళ్ళు గడిపేశాయి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో వున్న టీడీపీ - బీజేపీ. రెండున్నరేళ్ళు అయినా, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం స్థాపించిన ఏ విద్యా సంస్థా పూర్తిస్థాయిలో నిర్మాణం జరుపుకోని పరిస్థితి. రెండు లక్షల పాతిక వేల కోట్ల ప్రత్యేక సాయం.. అంటూ అందులో పోలవరం ప్రాజెక్టుని హైలైట్ చేసేసి, ప్రత్యేక హోదాకి మంగళం పాడేశారు.
పోలవరం ప్రాజెక్టుని గాలికొదిలేసి, ఎంచక్కా ముఖ్యమంత్రి చంద్రబాబు 'ఎత్తిపోతల ప్రాజెక్టుల' మీద ఫోకస్ పెట్టారు. సరే, ఏదో ఒకటి.. పోలవరం కోసం నిధులైతే గట్టిగా అడగడంలేదు కదా.. అంటూ కేంద్రం, చేతులు దులిపేసుకుంటోంది. పోనీ, రాజధాని నిర్మాణమైనా ఓ కొలిక్కి వచ్చిందా.? అంటే, అక్కడా తాత్కాలిక సచివాలయంతో సరిపెట్టేశారు. పోలవరం ప్రాజెక్టుకి తాత్కాలిక ఎత్తిపోతల ప్రాజెక్టులతో చెక్ పెట్టడం, రాజధానికి తాత్కాలిక సచివాలయంతో చెక్‌పెట్టడం.. ఇదంతా పక్కా వ్యూహంతో, 'ఆంధ్రప్రదేశ్‌ని సర్వనావనం చేసే మెగా ప్రాజెక్ట్' ఏదైనా టీడీపీ, బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందా.? అన్న అనుమానాలు కలగకమానవు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీలకు నూకలు చెల్లినట్లే. అది కట్టినా, ప్రత్యేక హోదా విషయంలో ఈ రెండు పార్టీలూ ఆడిన నాటకాల పుణ్యమా అని ఓటర్లు, కాంగ్రెస్‌కి ఇచ్చిన షాక్ లాంటిదే ఇవ్వబోతున్నారన్నదీ సుస్పష్టం. అందుకేనేమో, పోతూ పోతూ తమ తమ పార్టీలని తామే పాతరేసేసుకోవాలనే కాంగ్రెస్ బాటలోనే టీడీపీ - బీజేపీ నడుస్తున్నట్లున్నాయి.. అన్నది సర్వత్రా విన్పిస్తోన్న అభిప్రాయం.
2019లో ఎటూ అధికారంలోకి రాలేమన్న ఖచ్చితమైన అభిప్రాయంతోనే చంద్రబాబు వీలైనంత త్వరగా తన పుత్రరత్నానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని తహతహలాడుతున్నారన్నట. నిజమేనా.? తెలిసి తెలిసీ, కాంగ్రెస్ బాటలో టీడీపీ - బీజేపీ పరుగుల పెట్టడమేంటట.? పైగా ఈ పరుగులు అదఃపాతాళంలోకి కావడం ఆశ్చర్యకరమే.