ఢిల్లీ వెళ్ళవయ్యా జగనూ...

ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నిస్తే, 'ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు చేస్తే ఏం లాభం.? ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా చెయ్‌..' అంటుంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ. రైతుల సమస్యల నేపథ్యంలో ఆందోళనలు చేసినా అంతే.! అన్నిటికీ, ప్రతిపక్ష నేత ఢిల్లీకి వెళ్ళి ఆందోళనలు చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ ఏం చేస్తుందట.? ఇంకేం చేస్తుంది, గొప్పలు చెప్పుకుంటూ పరిపాలనను గాలికొదిలేస్తుంది.! 

అసలంటూ ప్రతిపక్షంలో వున్నప్పుడు తామేం చేశాం.? అన్న విషయం చంద్రబాబుకి గుర్తుంటే కదా.! రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చంద్రబాబు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఢిల్లీలోనూ ఆందోళనలు చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఆందోళనల్ని, దీక్షల్ని ఎలా మర్చిపోగలం.? కానీ, ఇప్పుడు అదే పని వైఎస్‌ జగన్‌ చేయకూడదంతే. 

గతం గతః అనుకుందాం. తెలంగాణలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ, రైతు సమస్యలపై చేస్తున్న ఆందోళనల మాటేమిటి.? 'ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయండి.. రైతు సమస్యలపై పోరాటం చేయండి.. పార్టీని బలోపేతం చేయండి..' అని ఇదే చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలకు ఎప్పటికప్పుడు క్లాసులు తీసుకుంటూనే వున్నారు. తెలంగాణలో టీడీపీ చేస్తే ఒప్పు, ఆంధ్రప్రదేశ్‌లో అదే పని వైఎస్సార్సీపీ చేస్తే మాత్రం అది మహా పాపం. ఔను, చంద్రబాబు రాజ్యాంగం ఇలాగే తగలడ్తుంది మరి. 

'బాహుబలి' సినిమా టిక్కెట్ల ధరల్ని పెంచుకోవడానికి, అదనంగా షోలు వేసుకోవడానికీ అనుమతులు దొరుకుతాయి. అదే, రైతులు తాము పండించిన పంటకు తగిన ధరను మాత్రం పొందకూడదు. వ్యవసాయం చేసి, రైతులు సర్వనాశనమైపోవాలి.! కానీ, విపక్షాలు ఈ దాష్టీకాన్ని మాత్రం ప్రశ్నించకూడదు. ఇదే బాబుగారి నయా రాజ్యాంగం అనుకోవాలేమో. 

జగన్‌ ఆందోళనలు చేసినంతమాత్రాన రైతులకు న్యాయం జరిగిపోతుందా.? అన్నది వేరే చర్చ. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ ఆందోళనలు చేశారు, కానీ అది రాలేదు. ఒకప్పుడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చంద్రబాబు ఆందోళనలు చేశారు, అది ఆగలేదు. విపక్షంలో వున్నప్పుడు ఎవరికైనా ప్రజా సమస్యలు గుర్తుకురావడం సహజం. అసలు విపక్షాలు ఏ ఆందోళనలూ చేపట్టకుండా ఇంట్లో కూర్చోవాలని చెప్పడమేంటట.? ఏంటో చంద్రబాబు, అపర గజినీగా మారిపోయారు. గతాన్ని మర్చిపోయినట్టు వ్యవహరిస్తున్నారు. 

అన్నిటికీ ఢిల్లీకి వెళ్లడమే కరెక్ట్‌ అయితే, అసలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎందుకట.? ఆంధ్రప్రదేశ్‌లో పాలనని కూడా ఢిల్లీకి మార్చేసి, బీజేపీకి అప్పగించే ఆలోచన ఏమైనా చంద్రబాబు చేయదలచుకుంటే, ఆ విషయమ్మీద క్లారిటీ ఇచ్చేయాలి. అప్పుడు విపక్షాలు ఢిల్లీలో ఆందోళన చేయాలా.? రాష్ట్రంలో పోరాడాలా.? అన్న విషయమై ఆలోచించుకుంటాయేమో.!

Show comments