చరణ్‌, కేటీఆర్‌ 'సినిమా' స్నేహం

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, టీఆర్‌ఎస్‌ నేత - మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మధ్య 'సినీ స్నేహం' బాగానే వికసిస్తోంది. ఆ మధ్య చరణ్‌ సినిమా 'ధృవ' ఆడియో ఫంక్షన్‌లో కేటీఆర్‌ దర్శనమిచ్చిన విషయం విదితమే. ఇప్పుడు తాజాగా కేటీఆర్‌ స్నేహితుడి సినిమా ఫంక్షన్‌లో చరణ్‌ సందడి చేశాడు. దర్శకుడు పట్టాబి, కేటీఆర్‌కి చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషమిక్కడ. 

చరణ్‌ని తానే ఈ ఫంక్షన్‌కి ఆహ్వానించాననీ, పిలవగానే చరణ్‌ వస్తానని చెప్పాడనీ, ఇలాంటి చిన్న సినిమాలకు పెద్ద స్టార్స్‌ మద్దతు పలకడం అభినందనీయమని మంత్రి కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. చూస్తోంటే, ఈ సినిమాకి తెరవెనుక సంపూర్ణ సహాయ సహకారాలు కేటీఆర్‌ అందించారా.? అన్న అనుమానాలు కలిగాయి ఆయన మాటల్ని చూస్తోంటే. 

మరోపక్క, సినీ పరిశ్రమ అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. జీఎస్టీలో సినీ పరిశ్రమకు పన్ను రేటుని 28 శాతంగా నిర్ణయించారనీ, దీన్ని కమల్‌హాసన్‌ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తూ, తెలుగు సినీ పరిశ్రమతోపాటు పన్ను రేటు తగ్గింపు విషయమై కలిసొచ్చే అన్ని సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులతో కేంద్రం వద్దకు ఓ బృందాన్ని తీసుకెళ్ళేందుకు కృషి చేస్తామని కేటీఆర్‌ హామీ ఇవ్వడం గమనార్హం.

Show comments