సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడానికి ఎందుకంతగా నిర్మాతలు తపించిపోతారో ఈ సంక్రాంతి ఇంకోసారి చూపించింది. ఈ సంక్రాంతికి విడుదలైన నాలుగు చిత్రాల్లో మూడు విజయవంతమయ్యాయి. ఖైదీ నంబర్ 150 ఘన విజయాన్ని అందుకుని వారం రోజుల్లోనే డెబ్బయ్ అయిదు కోట్లకి పైగా షేర్ సాధించింది.
ఖైదీ స్థాయిలో సంచలనం కాకపోయినా, గౌతమిపుత్ర శాతకర్ణి కూడా విడుదలైన నాటి నుంచీ అదరగొట్టింది. బాలకృష్ణ చిత్రాల్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని మొదటి వారంలో నలభై రెండు కోట్ల షేర్ సంపాదించింది. శతమానం భవతి కూడా ఈ పెద్ద సినిమాలతో పోటీలో ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. పెట్టుబడిని నాలుగు రోజుల్లోనే రాబట్టుకుని భారీగా లాభాలు మూటగట్టుకుంటోంది.
ఈ చిత్రాలతో పాటే విడుదలైన ఆర్. నారాయణమూర్తి చిత్రం హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్యకి ఆదరణ కరవైంది. థియేటర్ల కొరతని కారణంగా చూపిస్తున్నప్పటికీ విడుదలైన థియేటర్లలో కూడా అద్దె రాబట్టుకోలేకపోయింది. ఈవారం కొత్త సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో సంక్రాంతి చిత్రాలకి ఈ వీకెండ్ కూడా కలిసి వస్తుంది.