తెలంగాణ పోల్ చిత్రం: 'ఒవైసీ' రేటు 25 లక్షలేనా.!

మజ్లిస్‌ పార్టీ పేరు చెప్పగానే, 'అధికార పార్టీకి అంటకాగే పార్టీ' అన్న అభిప్రాయం చాలా గట్టిగా వుంది చాలామందిలో. అధికారం ఏ పార్టీ చేతిలో వుంటే, ఆ పార్టీతో అత్యంత సన్నిహితంగా మెలగడం మజ్లిస్‌ పార్టీకి అలవాటు. అధికారం పంచుకోకపోయినా, పంచుకున్నట్లే వ్యవహరించడమెలాగో మజ్లిస్‌కి తెలిసినంతగా ఇంకే పార్టీకీ తెలియదేమో. తెలంగాణలో ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్‌కి బయట నుంచి మద్దతిస్తున్న పార్టీగా మజ్లిస్‌ వ్యవహరిస్తున్న విషయం విదితమే.

ఈ ఎన్నికల తర్వాత మజ్లిస్‌ తీరు ఎలా వుంటుంది.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ప్రస్తుతానికైతే టీఆర్‌ఎస్‌ని గెలిపించాలంటూ తాము పోటీచేయని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేకించి ప్రచారం చేస్తున్నారు మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. నిర్మల్‌లో ప్రచారానికి రావొద్దంటూ కాంగ్రెస్‌ పార్టీ తనకు పాతికలక్షల లంచం ఇవ్వజూపిందన్నది అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన తాజా ఆరోపణ. ఇప్పుడీ ఆరోపణకు జాతీయ స్థాయిలో బోల్డంత పొలిటికల్‌ మైలేజ్‌ వచ్చేసింది.

నేషనల్‌ మీడియాకి 'అసదుద్దీన్‌' స్టేట్‌మెంట్స్‌ అంటే భలే పసందుగా అన్పిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఇప్పటికైతే మజ్లిస్‌, టీఆర్‌ఎస్‌తో స్నేహం చేస్తోందిగానీ, ఈక్వేషన్స్‌ తారుమారై మహాకూటమి అధికారంలోకి వస్తే, ఆ కూటమికి మజ్లిస్‌ మద్దతివ్వదన్న గ్యారంటీ ఏముంది.?

ఆ సంగతి పక్కన పెడితే, మరీ అసదుద్దీన్‌ ఒవైసీ రేటు పాతిక లక్షలేనా.? పాతిక లక్షలిస్తే, తాము చెప్పినట్లు అసద్‌ వ్యవహరిస్తారని కాంగ్రెస్‌ అనుకుంటుందా.? లేదంటే, అసదుద్దీన్‌ తన రేటు పాతిక లక్షలంటూ ప్రచారం చేసుకున్నారా.? కాంగ్రెస్‌ పార్టీకి అలాగని సంకేతాలు పంపారా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

అన్నట్టు, గతంతో పోల్చితే మజ్లిస్‌ ఈసారి తెలంగాణలో తక్కువ స్థానాల్లో పోటీచేస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాలకే మజ్లిస్‌ పరిమితమవడం పట్ల, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రచించిన బలమైన వ్యూహమే కారణమన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments