పవన్ ప్లస్ జగన్..ఇది సాధ్యమేనా?

పవన్ జనసేన, వామపక్షాలతో కలిసి మహా కూటమి ఏర్పాటు చేస్తే తప్ప, తెలుగుదేశం పార్టీని 2019 లో ఓడించడం అసాధ్యమని వైకాపా నేత వైఎస్ జగన్ కు రాజకీయ సలహాదారు ప్రశాంత్ ఓ నివేదిక అందించారట. బీహార్ లో కూటమి విజయం సాధించింది. యుపిలో విఫలమయింది. కానీ తెలుగునాట కూడా కూటమి ఏర్పాటే అవశ్యమని ఆ నివేదిక సారాంశమట.

దీంతో పవన్ తో చర్చలకు జగన్ ఉత్తరకోస్తా కాపు నాయకుడిని పురమాయించారట. ఇంకెవరు? బొత్స సత్యనారాయణే అయి వుంటారని జనం ఎలాగూ అనుకుంటారు. నిజానికి ఈ నివేదిక అన్న వార్త నిజమేనా? బాబును ఓడించడం అసాధ్యం అన్నది క్లియర్ చేయడానికి 'రచించిన' నివేదిక నా? అన్నదీ అనుమానమే.

కానీ మహా కూటమి అన్నది తెలుగునాట సాధ్యమేనా? పైగా జగన్-పవన్ కలవడం అన్నది కూడా కాస్త అసాధ్యమైన వ్యవహారమే. భావసారూప్యం వున్న వామపక్షాలే ఓ దరికి రావడంలేదు. పైగా పవన్ కళ్యాణ్ మోడీకి దూరంగా వున్నట్లు కనిపిస్తున్నారు కానీ, తెలుగుదేశం పార్టీకి కాదు. అందువల్ల జగన్ కు ఆయన దగ్గర కావడం అన్నది అనుమానమే.

ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పవన్ పై విమర్శల దాడి అన్నది ఎప్పుడూ చేయలేదు. ఒకటి రెండు సార్లు ఒకరిద్దరు నాయకులు హడావుడి చేయడం తప్ప. అదే కనుక జగన్ వైపు పవన్ వెళ్తే ఈ దాడి ఓ రేంజ్ లో వుంటుంది. జగన్ కు సదా అంటిస్తూ వస్తున్న అవినీతి మరకను పవన్ కు పూసే ప్రయత్నం జరుగుతుంది. దానికి జంకి అయినా పవన్ అటు వెళ్లరు.

పైగా రెండు అధికార వాంఛనీయ శక్తులు ఓ ఒరలో చేరడం అన్నది అసాధ్యం. అందుకే ఈసారి పవన్ తేదేపాతో కలుస్తారా? అన్న విషయంలో ఇప్పటికీ చిన్న సందేహాలు వినవస్తూనే వున్నాయి. బహుశా ప్రశాంత్ నివేదిక అన్నది కూడా ఈ పథకం ప్రకారం బయటకు వచ్చిందో, బయట 'రచించిందో' కూడా కావచ్చు.

ఎందుకంటే ఈ నివేదిక ప్రకారం తేదేపాను ఓడించాలి అంటే, పవన్, వామపక్షాలు, జగన్ కలవాలి. పవన్-జగన్-వామపక్షాలు-కాంగ్రెస్ కలవాలి. ఇది పూర్తిగా అసాధ్యం. కాంగ్రెస్ తో కలవకుండానే జగన్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటూ ఇప్పటికీ బదనామ్ చేస్తోంది తెలుగుదేశం. ఇక కలిస్తే ఏమన్నా వుందా? అలాగే పవన్ ను అవినీతి పార్టీతో మిలాఖత్ అయ్యాడని ఏకేయరూ? అందువల్ల ఇది సాధ్యమయ్యే పని కాదు.

అదే సమయంలో వామపక్షాలను కూడా అన్ని ఉపాయాలు ఉపయోగించి, జగన్ కు దూరంగా వుంచే యత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తోందని వినికిడి. దీనికి ఆ పార్టీ అనుకూల మీడియా యథాశక్తి సాయం చేస్తోంది. ఎలాగైనా వామపక్షాలను జనసేన దరికి చేర్చాలని ప్రయత్నం జరుగుతోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా జనసేన రాజకీయాలు చేస్తోందట.

అందువల్ల వామపక్షాలు అటు మొగ్గే అవకాశం వుందట. అసలు రాజకీయ కార్యకలాపాలే చేపట్టకుండా, కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్న పార్టీ జనసేన అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాంటి వ్యవహారాన్ని భిన్నంగా ప్రొజెక్ట్ చేసే పని చేపడుతున్నారంటే దాని వెనుక వైనం ఏమై వుంటుంది అనుకోవాలి?

ఈ నివేదిక బయటకు రావడం వెనుక లేదా వెల్లడించడం వెనుక పరమార్థం ఒకటే కనిపిస్తోంది. తెలుగునాట ప్రతిపక్షాలు ముక్కులు ముక్కలుగా వున్నాయి. ఇవన్నీ కలిసి అధికార వ్యతిరేక ఓటును చీలుస్తాయి. దీంతో చంద్రబాబు సునాయాసంగా మళ్లీ అధికారం అందుకుంటారు.

కానీ ఒక్క చిన్న లాజిక్ అధికార వ్యతిరేక ఓటు బలంగా కనుక వుంటే, జనాలు జగన్ నో, పవన్ నో, కాంగ్రెస్ నో ఆల్టర్ నేటివ్ గా ఎంచుకుంటారు. ఎవరైతే అధికారం ఏర్పాటుచేయగలరని ప్రజలు నమ్ముతారో? అధికార వ్యతిరేక ఓట్లు అన్నీ అక్కడకు చేరతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? నివేదక చెప్పకుండానే పలితం సాధించేస్తుంది.

Show comments