దేశాలు పట్టుకొని తిరగాల్సిందేనా?

ఒకచోట కుదురుగా ఉండకుండా ఎప్పుడూ తిరిగేవాళ్లను 'వీడికి కాళ్లలో చక్రాలున్నాయిరా' అంటుంటారు. హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పేవారు వేళ్ల మీద ఉన్న చక్రాలను చూసి కొందరిని 'లోక సంచారి' అని చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వేళ్లలో ఎన్ని చక్రాలున్నాయో తెలియదుగాని కాళ్లలో మాత్రం చక్రాలున్నాయని చెప్పొచ్చు. అవి కూడా విమాన చక్రాలు. ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ఆయన ఏదో ఒక కారణంతో విదేశీ పర్యటనలు చేస్తూనేవున్నారు. 

రాజధాని నగరాల అధ్యయనం కోసం, పెట్టుబడుల కోసం తిరుగుతూనే ఉన్నారు. మళ్లీ రేపటి నుంచి (9వ తేదీ) 13వ తేదీ వరకు రష్యా, కజక్‌స్తాన్‌ మొదలైన దేశాలకు వెళుతున్నారు. ఆయన ప్రధాన అజెండా పెట్టుబడుల సేకరణ. అమరావతి ప్రాంతంలో భూసేకరణ. విదేశాల్లో పెట్టుబడుల సేకరణ. ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పుల సేకరణ. గతంలో రాజధాని నిర్మాణం కోసమని ప్రజల నుంచి కూడా విరాళాలు సేకరించారు. రాజధాని నిర్మాణానికి ఇక 2,500 కోట్లకు మించి నయాపైసా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బల్లగుద్ది చెప్పింది. 

ఇప్పటివరకు ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని నిలదీస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించినా చంద్రబాబు ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రాజధాని నిర్మాణం పెద్ద సవాలుగా మారింది. కొంతలో కొంతైనా కట్టి చూపిస్తేగాని వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి అవకాశం ఉండదు. ప్రపంచంలోని పది అత్యుత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలపాలంటే, కళ్లు చెదిరే అద్భుత నగరం నిర్మించాలంటే లక్షల కోట్లు కావాలి. ఉపాధి కల్పనకు పరిశ్రమలు కావాలి. ఇంకా ఎన్నెన్నో అవసరం. 

ఈ అవసరాలు తీరాలంటే విదేశీ పెట్టబడులు తప్ప గత్యంతరం లేని పరిస్థితి. అందుకే మళ్లీ పెట్టేబేడా సర్దుకొని విదేశాలకు బయలుదేరుతున్నారు. బాబు విదేశీ పర్యటనల మీద ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈయన మరో నరేంద్ర మోదీ మాదిరి తయారయ్యారని అంటున్నారు. అత్యధిక విదేశీ పర్యటనలతో మోదీ ఇప్పటికే రికార్డు సృష్టించారు. ఆయన పర్యటనల అజెండా కూడా పెట్టుబడిదారులను ఆహ్వానించడమే. మోదీ తరువాత విదేశీ పర్యటనల్లో చంద్రబాబుదే రికార్డని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మొన్నీమధ్య చైనాలో ఐదు రోజులు పర్యటించారు. 

అక్కడి నుంచి 58 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఉక్కు కర్మాగారం నిర్మాణానికి, పెద్ద ఎరువుల ఫ్యాక్టరీ ఏర్పాటుకు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు రష్యా, కజక్‌స్తాన్‌లతో ఏం ఒప్పందాలు కుదర్చుకుంటారో. కజక్‌స్తాన్‌ ఒకప్పటి సోవియట్‌ యూనియన్లో భాగమే. సోవియట్‌ విచ్ఛిన్నమయ్యాక అది స్వతంత్ర దేశంగా మారింది. చాలా చిన్న దేశమైన కజ్‌కు శతాబ్దాల చరిత్ర ఉంది. రష్యా, చైనా దీని సరిహద్దు దేశాలు. గతంలో ప్రధాని మోదీ ఈ దేశాన్ని సందర్శించారు. దాని రాజధాని ఆస్తానా నగరాన్ని చూసి డంగైపోయిన మోదీ ఆ నగరాన్ని తప్పక సందర్శించాల్సిందిగా బాబుకు ఇదివరకే సలహా ఇచ్చారట. 

అప్పట్లో బాబు రాజధాని నిర్మాణం కోసం విదేశీ నగరాలను అధ్యయనం చేస్తుండటంతో కజక్‌ రాజధాని చూడాల్సిందిగా మోదీ చెప్పారు. ఆ నగరంలో నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుందట. బాబుకు విదేశీ నగరాల మోజు ఉంది కాబట్టి కజక్‌ రాజధానిని చూశాక అమరావతిని ఆ విధంగా నిర్మిస్తానని అంటారేమో....! ఏ దేశాన్ని సందర్శిస్తే ఆ దేశంలా చేస్తామని చెప్పడం బాబుకు అలవాటు. కజక్‌ రాజధాని అందాలు చూశాక ఆ దేశాన్ని కూడా అమరావతి నిర్మాణంలో భాగస్వామిగా చేసి కొన్ని నిర్మాణాలు అప్పగిస్తారేమో...! 

ఏది ఏమైనా పెట్టుబడుల కోసం చంద్రబాబు కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. తెలుగువారి రాజధాని అమరావతికి విదేశీ హంగులు కల్పిస్తున్నారు. విదేశీ పెట్టుబడుల కారణంగా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నా విదేశీ కంపెనీలకు మాత్రం బాగుపడే రోజులొచ్చాయి. 

Show comments