జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త‌పై న‌మ్మ‌కం

సీఎం వైఎస్ జ‌గ‌న్ చెప్పింది చేస్తాడ‌నే న‌మ్మ‌కాన్ని ప్ర‌జ‌ల్లో క‌లిగించారు. ఇదే త‌మ‌కు శ్రీ‌రామ ర‌క్ష‌గా వైసీపీ భావిస్తోంది. వైసీపీ మేనిఫెస్టో విడుద‌లైన నేప‌థ్యంలో దానిపై విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ మేనిఫెస్టోలో కొత్త‌గా ఏమీ లేక‌పోవ‌డంతో, ఇక ఆ పార్టీ ప‌నై పోయింద‌ని ప్ర‌త్య‌ర్థులు తెగ సంబ‌ర‌ప‌డుతున్నారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం మ‌రోసారి అధికారంపై చాలా ధీమాగా వుంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ ముఖ్య నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేశారు. గ‌తంలో చంద్ర‌బాబునాయుడు 650 హామీలిచ్చి ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. దీనికి రాష్ట్ర ప్ర‌జ‌లే సాక్ష్య‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఐదేళ్ల‌లో రైతుల‌కు సంబంధించి రూ.87 వేల కోట్ల రుణ‌మాఫీ చేస్తాన‌ని, అలాగే బ్యాంకుల్లో త‌న‌ఖా పెట్టిన బంగారాన్ని కూడా ఇంటికి తీసుకొస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ని స‌జ్జ‌ల గుర్తు చేశారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రైతుల రుణ‌మాఫీ చేయ‌లేద‌ని, అలాగే వారి బంగారాన్ని బ్యాంకుల నుంచి ఇంటికి తీసుకురా లేద‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు చెప్పింది చేయ‌డ‌నేందుకు ఇదే నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. కానీ మేనిఫెస్టో అంటే తాము మాత్రం ప‌విత్ర గ్రంథంగా భావిస్తున్నామ‌న్నారు.

మేనిఫెస్టో అనేది ప్ర‌జ‌ల‌కు, పార్టీకి మ‌ధ్య ఒక ఒప్పందం లాంటిద‌న్నారు. ప్రామిస‌రీ నోటు లాంటిద‌ని స‌జ్జ‌ల అభిప్రాయ‌ప‌డ్డారు. అర‌చేతిలో వైకుంఠం చూపి, ఎన్నిక‌ల త‌ర్వాత చెత్త‌బుట్ట‌లో వేయాలా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ ప‌ని చంద్ర‌బాబు చేశార‌ని త‌ప్పు ప‌ట్టారు. పొరుగు రాష్ట్రంలో రైతు రుణ‌మాఫీ ఏం జ‌రుగుతున్న‌దో చూస్తున్నామ‌ని ప‌రోక్షంగా రేవంత్‌రెడ్డి స‌ర్కార్ పాల‌న‌ను గుర్తు చేశారు.

ఎంపీ ఎన్నిక‌లు ఉండ‌డంతో ఆగ‌స్టులో రైతురుణ‌మాఫీ చేస్తామ‌ని ఆ ప్ర‌భుత్వం హామీ ఇచ్చింద‌ని ఆయ‌న అన్నారు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం మేనిఫెస్టోను స‌క్ర‌మంగా అమ‌లు చేసి ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయత‌ సంపాదించింద‌న్నారు. త‌మ ధీమా కూడా ఇదే అన్నారు. మీ కుటుంబానికి మంచి జ‌రిగి వుంటేనే ఆశీస్సులు అందించాల‌ని జ‌గ‌న్ కోరుతున్నారన్నారు. ప్ర‌త్య‌ర్థులు ఎన్ని చెప్పినా ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. ఎందుకంటే గ‌తంలో వారు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేద‌న్నారు. 

Show comments