ఐయామ్ సారీ.. తప్పు నాదే : మంచు విష్ణు

ఆచారి అమెరికా యాత్ర సినిమా షూటింగ్ లో మంచు విష్ణు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మలేషియాలో ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ మంచు విష్ణు గాయపడ్డాడు. 5రోజుల బెడ్ రెస్ట్ తర్వాత ఓ వీడియో సందేశం పెట్టాడు మంచు విష్ణు.  

"అమ్మ, నాన్న, విన్నీ, అక్క, తమ్ముడు.. వీళ్లందరికీ సారీ చెబుతున్నాను. ఎందుకంటే ఓ చిన్న జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల వీళ్లందరూ చాలా బాధపడ్డారు. వాళ్లతో సహా ఎంతోమంది నా స్నేహితులు, అభిమానులు కంగారు పడ్డారు. వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నాను". మంచు విష్ణు వీడియో సందేశమిది. త్వరలోనే ఆ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేస్తానంటున్నాడు మంచు విష్ణు. 

"మీకు ఓ 2-3 రోజుల్లో ఆ యాక్సిడెంట్ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. అది చూస్తే మీకు అర్థమౌతుంది. అందులో నా తప్పు ఏం లేదు. అసలు యాక్షన్ సన్నివేశాల విషయంలో నేను తీసుకునే ముందుజాగ్రత్తలు చూసి చాలామంది నన్ను ఎగతాళి చేస్తుంటారు. అంత కేర్ తీసుకుంటాను. కానీ ఈ యాక్సిడెంట్ ఇలా అవుతుందని ఊహించలేదు".

యాక్సిడెంట్ లో మంచు విష్ణు మోకాలికి దెబ్బ తగిలింది. చేతికి, మోచేయికి చిన్నచిన్న గాయాలయ్యాయి. భుజంలో ఓ ఎముకకు గట్టి దెబ్బ తగిలింది. భుజానికి సర్జరీ అవసరం అవుతుందో లేదో 2-3రోజుల్లో డాక్టర్లు  చెబుతారు.

Show comments