పవన్ ను మర్చిపోతున్నారా?

ఒకసారి అడుగతారు..రెండు సార్లు నిలదీస్తారు. ఎన్నిసార్లయినా నిమ్మకునీరెత్తినట్లు వుంటే జనం ఇక ఇతగాడి సంగతి ఇంతే అని మర్చిపోతారు. పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇలాగే తయారవుతోంది రాను రాను. తన కున్న సినిమా చరిష్మాతో, హడావుడిగా పార్టీ పెట్టి, ఆయన చేతలే కాదు, మాటలు కూడా అర్థంకావు అనిపించుకున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీని గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించడం కోసం తప్ప, వేరే ఎజెండా లేదని జనాలకు అర్థం అయిపోయింది. అయినా కూడా ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని అన్నారు కదా, అని కీలకమైన పరిణామాలు సంభవించినపుడల్లా, పవన్ ఎక్కడా? అని చూడడం, అడగడం మామూలైంది. 

గడచిన రెండేళ్లలో ఓ రాజకీయ పార్టీ అనదగినది, ఓ పార్టీ అధ్యక్షుడు అనదగినవాడు ఎవరైనా సరే తక్షణం స్పందించాల్సిన, తన అభిప్రాయం ప్రకటించాల్సిన అవశ్యం వున్న సంఘటనలు ఎన్నో జరిగాయి. అయినా పవన్ నోటి వెంట ముత్యం ఒక్కటైనా రాలిపడితే ఒట్ట. ఇప్పుడు మరోసారి రాష్ట్ర రాజకీయాల వేడందుకున్నాయి. అటు మోడీని ఇటు బాబును వుంచుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు జనాలకు దర్శనమిచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది. అని నిజమో, నాటకమో? మొత్తానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని తేలిపోయింది. మరి ఇలాంటపుడు కూడా పవన్ ఏం మాట్లాడడం లేదు. 

అస్సలు ఆ స్పృహే వున్నట్లు కనిపించడం లేదు. ఇదీ గతంలో వున్న వ్యవహారమే. పవన్ స్టయిల్ అంతే. అయితే ఈసారి వ్యవహారం ఏమిటంటే, పవన్ మాట్లాడడం లేదు. లేదా పవన్ రావాలి, ప్రశ్నించాలి  అని ఏ మూల నుంచి ఏ విధమైన డిమాండ్ కానీ విమర్శ కానీ వినిపించకపోవడం. అంటే రాజకీయ రంగంలో పవన్ స్టయిల్ ఏమిటన్నది జనానికి అర్థం అయిపోయిందన్నమాట. పవన్ అంతేలే అనే ధోరణికి జనం వచ్చేస్తున్నారన్నమాట. ఇదే ధోరణి ఇలా మరి కొన్నాళ్లు కొనసాగితే, నిజంగా పవన్ బయటకు వచ్చి, ఏదైనా మాట్లాడబోయినా, చేయబోయినా జనం పట్టించుకోవడం మానేస్తేరేమో? ఈ విషయాన్ని ఇప్పుడు పవన్ పట్టించుకోవాల్సిన అవసరం వుంది. 

అంతే కానీ బాబును గద్దె ఎక్కించడంతోనే తన రాజకీయ అవసరం తీరిపోయింది అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. లేదూ తానేదో తన ఎత్తులు తాను లోలోపల వేసుకుంటున్నాను, మూడేళ్ల తరువాత జనం ముందుకు వచ్చి మరీ ఎన్నికల సమయంలో ప్రయోజనం కోసం పాకులాడతాను అనుకుంటే ఇప్పటి నుంచీ స్పందించాలి. ఎందుకంటే జనాన్ని ప్రతీసారి మోసగించడం కష్టం.

Show comments