ఎమ్బీయస్‌ : హరియాణా జాట్‌ ఆందోళన తర్వాత...

తుని సంఘటనలో అరెస్టు చేసినవారిని విడిచిపెట్టాలనే డిమాండుతో ముద్రగడ మళ్లీ కాపులను రెచ్చగొట్టే ప్రయత్నంలో పడ్డారు. వ్యవహారం ముదిరిన కొద్దీ యింకెన్ని రైళ్లు, బస్సులు తగలబడతాయో తెలియదు. ఆయన బాబుతో 'గతంలో యిలాటివి మీరు చేయించలేదా?' అని వాదించవచ్చు. అవి రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన బలప్రదర్శన. ఇప్పుడు ఒక కులం కేంద్రంగా జరుగుతున్న ఆందోళన. ఈ సందర్భంగా చేస్తున్న ప్రకటనలు, వితండవాదనలు ఆ కులానికి మేలు చేయబోతాయో, కీడు చేయబోతాయో తరచి చూసుకోవడానికి హరియాణాలో జాట్‌ ఉదంతంతో పోల్చి చూసుకోవాలి. గత ఫిబ్రవరిలో జాట్ల ద్వారా జరిగిన హింసాకాండకు, కాపుల ప్రస్తుత ఆందోళనకు పోలిక లేదు. కానీ తుని ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించకుండా వదిలితే అలాటివి యింకెన్ని జరుగుతాయో, క్రమేపీ ఏ రూపం తీసుకుంటాయో తెలియదు. తోటకూరనాడే చెప్పకపోయావా అన్నట్లు హింస ద్వారా సాధించేది ఏమీ లేదని కాపు కార్యకర్తలకు నచ్చచెప్పడానికి కాపు నాయకులు హరియాణా కథ చెప్పి తీరాలి.

ఫిబ్రవరిలో 7 నుండి 22 వరకు జరిగిన హింసాకాండపై హరియాణా ప్రభుత్వం నియమించిన ప్రకాశ్‌ సింగ్‌ కమిటీ 414 పేజీల నివేదికను  మే 13న సమర్పించగా కొంత తర్జనభర్జనల తర్వాత ప్రభుత్వం దాన్ని మే 31న విడుదల చేసింది. గతంలో యుపి, నాగాలాండ్‌లలో డిజిపిగా చేసిన ప్రకాశ్‌ తన నివేదికలో ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాడు.  పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారని, ఆర్మీని పిలిపించినా దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదని ఎత్తి చూపాడు. ఆయన నివేదిక ప్రకారం - 30 మంది చనిపోయారు, రూ. 20 వేల కోట్ల ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. 75 యిళ్లు, 1196 దుకాణాలు, 23 పెట్రోలు పంపులు, 371 వాహనాలు దగ్ధమయ్యాయి. 30 స్కూళ్లపై, 53 హోటళ్లు, ధాబాలపై, 29 పోలీసు స్టేషన్లపై దాడులు జరిగాయి. 7232 చెట్లు కొట్టేసి 449 చోట్ల అడ్డంకులు కల్పించారు. ఈ విధ్వంసం జరగనిచ్చినందుకు నివేదిక దృష్టిలో దోషులు - 80 మంది హరియాణా ప్రభుత్వోద్యోగులు, 59 పోలీసు అధికారులు, 21 మంది సివిల్‌ ఎడ్మినిస్ట్రేటర్స్‌, హోం సెక్రటరీ పికె దాస్‌తో సహా 5గురు ఐయేయస్‌లు, డిజిపి యశ్‌పాల్‌ సింగ్‌తో సహా 5గురు ఐపిఎస్‌లు! 

ప్రభుత్వం చేతకానితనానికి అందరూ దుమ్మెత్తిపోయడంతో బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించింది. కోటి రూ.ల లోపు నష్టం కలిగినవారికి ప్రభుత్వ ఖజానా నుండే డబ్బు చెల్లించారు. అయినా బాధితులు శాంతించటం లేదు. ఎందుకంటే ప్రభుత్వం అధికారులను దండిస్తానంటోంది కానీ తమపై హింస జరిపిన జాట్లపై చర్య తీసుకోవడం లేదు. ఆనాటి ఘటనలపై 2,124 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైతే అరెస్టు చేసినది కేవలం 593 మందినే! వారిపై కేసులు ఎంత బలహీనంగా పెట్టారంటే వారిలో 305 మంది యిప్పటికే బెయిలుపై బయటకు వచ్చేశారు. ''గోహానాలో మా అన్నయ్య నడిపే హోండా ఏజన్సీ షాపుపై దాడి చేసి అనేక స్కూటర్లు ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయినవాళ్లు దర్జాగా వాటి మీద వూళ్లోనే తిరుగుతున్నారు. కానీ పోలీసులు పట్టుకోవటం లేదు.'' అంటాడు ఒకతను. ''వాళ్లను జైలుకి పంపి, శిక్షించేదాకా మాకు ధైర్యం చిక్కదు. అందుకనే నష్టపరిహారం చేతికి వచ్చినా మేం మళ్లీ దుకాణాలు తెరవటం లేదు. మాలో కొంతమంది యితర ప్రాంతాలకు తరలిపోతున్నాం కూడా.'' అన్నారు కొందరు. రోహటక్‌లో రియల్‌ ఎస్టేటు ధరలు 60%కు పడిపోయాయి.

''అత్యధిక సంఖ్యలో దోపిడీలు ఎప్పుడు జరిగాయో తెలుసా? ఫిబ్రవరి 20 న కర్ఫ్యూ విధించి పోలీసులు మమ్మల్ని అటువైపు రాకుండా చేసినపుడు యీ జాట్‌ ఆందోళనకారులు మా దుకాణాలపై పడి దోచుకున్నారు. అది కూడా వాళ్లు బ్రాహ్మణులు, పంజాబీలు, సైనీలు, బనియాల షాపులనే గుర్తు పెట్టుకుని దోచుకున్నారు. కనబడిదనల్లా కాజేస్తే అది సంఘవ్యతిరేక శక్తుల పని అనుకుంటాం. కానీ యిలా ఎంచిఎంచి ఎటాక్‌ చేశారంటే జాట్‌లకు మాపై వున్న ద్వేషం తెలుస్తోంది. వాళ్లు రిజర్వేషన్లు కోరినప్పుడు మేమెన్నడూ అభ్యంతర పెట్టలేదు. ఈ దౌర్జన్యకారులకు ఏ శిక్షా పడలేదు. ఏ బెరుకూ లేకుండా కాలరెత్తుకుని తిరుగుతున్నారు. మమ్మల్ని నాశనం చేసినవారి మధ్యనే బిక్కుబిక్కు మంటూ బతకాల్సి వస్తోంది. సరుకులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసి మూణ్నెళ్లయ్యాయి. ఒక్కటైనా వెతికి యిచ్చారా? లేదే! ఇక మేం జాట్లను, యీ ప్రభుత్వాన్ని ఎలా నమ్మగలం?'' అని అడుగుతున్నారు. ''జాట్లు యిలా ప్రవర్తిస్తారని వూహించలేక, ఎదుర్కోవడానికి సన్నాహాలు చేసుకోక పోవడం చేత మేం ఫిబ్రవరిలో దెబ్బ తిన్నాం. ఈ సారి మేం తయారుగా వున్నాం. ఈ సారి మా జోలికి వస్తే మేం ప్రభుత్వ పోలీసుల గురించి చూడం. మేం చచ్చేముందు కనీసం ఒక జాట్‌నైనా చంపి చస్తాం.'' అంటున్నారు కొందరు పంజాబీ దుకాణదారులు.  

ఈ హింసాత్మక ఆందోళన కారణంగా హరియాణా సమాజం జాట్‌-జాటేతర కులాలుగా చీలిపోయింది. జాట్‌లకు ఒక పక్క, 35 యితర కులాలు మరో పక్క మోహరించాయి. జాట్‌లకు ఉద్యోగాలు యివ్వడానికి, వారితో వ్యాపారబంధాలు పెట్టుకోవడానికి యితర కులాలు వారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. హరియాణా ఆటోకింగ్‌గా పేరు బడిన జగ్‌మోహన్‌ మిత్తల్‌కు అనేక వూళ్లల్లో మారుతి-సుజుకి షోరూములున్నాయి. రోహటక్‌లో ఢిల్లీ బైపాస్‌ రోడ్డు మీద ఫిబ్రవరి 18న ఓ షోరూము తెరిస్తే రెండు రోజులు తిరక్కుండా ఆందోళనకారులు వచ్చి దాన్ని తగలబెట్టేశారు. డెలివరీకి సిద్ధంగా వున్న 200 కార్లు, ఎస్‌యువిలు బూడిదై పోయాయి. జాట్‌లకు తను చేసిన హాని ఏమిటా అని అతను ఆలోచనలో పడ్డాడు. అతని దగ్గర 5 వేల మంది పనిచేస్తున్నారు. ఇన్నాళ్లూ వాళ్ల కులగోత్రాలు కనుక్కోలేదు. ఇప్పుడు ఆరాతీస్తే 70% మంది జాట్లు అని తేలింది. తన డ్రైవరు దగ్గర్నుంచి జాటే. అతన్ని తీసేయి, ఎందుకైనా మంచిదని స్నేహితులు సలహా యిస్తున్నారు. 

గతంలో లేని కులవిభేదాలు యిప్పుడు ముందుకు వచ్చాయి.  జాట్‌, జాటేతర విభేదాలు ఏడాదిగా ముదురుతూ వచ్చాయని ప్రకాశ్‌ సింగ్‌ నివేదిక పేర్కొంది. ఏడాదిగా వివిధ వర్గాల నాయకుల స్టేటుమెంట్లను పరిశీలించి కమిటీ యీ నిర్ధారణకు వచ్చింది. ''అఖిల భారతీయ జాట్‌ ఆరక్షణ్‌ సంఘర్ష్‌ సమితి నాయకుడు యశ్‌పాల్‌ మాలిక్‌, ఒబిసి నాయకుడు కురుక్షేత్ర ఎంపీ రాజ్‌ కుమార్‌ సైనీలు రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాలపై క్రిమినల్‌ కేసులు పెట్టడానికి కావలసినంత అవకాశం వుంది.'' అంది నివేదిక. ఆంధ్రలో కాపు ఆందోళనను హేండిల్‌ చేయడంలో ప్రభుత్వవైఫల్యం, అధికార పార్టీ వైఫల్యం కనబడుతోంది. కొందరు కాపు మంత్రులు అనవసరంగా మాట్లాడి ముద్రగడపై సానుభూతి పెంచుతున్నారు. ముద్రగడతో ఎలా వ్యవహరించాలో తెలియక గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు తబ్బిబ్బుపడ్డారు. సరైన రీతిలో వ్యవహరించకపోతే పార్టీల రాజకీయ లాభనష్టాల మాట ఎలా వున్నా సమాజం చీలిపోతుంది. హింసామార్గం పట్టి సమాజంలోని యితర వర్గాలను దూరం చేసుకుంటే కాపులు నష్టపోతారు. 

ఫిబ్రవరి ఆందోళన తర్వాత జాట్‌లకు, మరో ఐదు యితర కులాలకు బిసి (సి) కేటగిరిలో రిజర్వేషన్‌ కల్పించారు. కానీ దానికి వ్యతిరేకంగా ఎవరో పిల్‌ వేయడంతో హైకోర్టు స్టే యిచ్చింది. దాంతో జాట్లు తమ ఆందోళనను జూన్‌ 5 నుంచి మళ్లీ మొదలుపెట్టారు. 10 రోజులైనా యిప్పటివరకు శాంతియుతంగానే ధర్నాలతో, నిరాహారదీక్షలతో సరిపెడుతున్నారు. ప్రభుత్వం యీసారి 6 వేల కేంద్రబలగాలతో 14 వేల యితర రక్షణదళాలతో పరిస్థితి గమనిస్తోంది. ఈ శాంతి ఎంతకాలం వుంటుందో, గత అల్లర్లల్లో నష్టపోయినవారు కసికొద్దీ రెచ్చగొడితే జాట్లు మళ్లీ హింసామార్గం పడితే ఏమవుతుందో వూహించలేము.  

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

mbsprasad@gmail.com

Show comments