కథ తెలిసినా.. పవన్ కు క్లారిటీ రాలేదా?

ప్రత్యేక హోదాపై బీజేపీ అన్యాయం చేసిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే స్పష్టంగా చెప్పారు. హోదా తప్ప మరోటి ఏపీ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. కేంద్రం పెట్టిన పాడయిన లడ్డులను తెలుగుదేశం తీసుకుంటుందా అని కూడా అనుమానం వ్యక్తం చేసారు. ఆఖరికి హోదా కోసం ఇక పోరుబాట పడతానని,  మూడు దశల్లో పోరాటం చేస్తానన్నారు. 

తొలిదశ కాకినాడ బహిరంగ సభ అని తిరుపతిలో చెప్పి దానిని కూడా పూర్తి చేశారు. ఆ మేరకు కాకినాడలో హోదా కోసం తాను పోరాడుతానని, ఉద్యమం చేస్తానని వార్నింగ్ ఇచ్చినంత పని చేసారు. కానీ అక్కడనే ఓ ట్విస్ట్ పెట్టారు. హోదా సాధనలో ఏపీలోని ప్రస్తుత రాజకీయ పార్టీలు ఫెయిల్ అయితేనే తాను రంగంలోకి దిగుతానని చెప్పారు. నిజానికి ఇక్కడే చిన్న అనుమానం. నిజంగా అన్ని పార్టీలు పోరాడి, హోదా సాధనలో ప్రజల అభిమానానికి నోచుకుంటే జనసేన పరిస్థితి ఏమిటి? 

ఏ రాజకీయ పార్టీ అయినా తాను ముందు పోరాడాలి. తను క్రెడిట్ కొట్టాలి అనుకుంటుంది కదా? మరి పవన్ ఇలా అంటున్నారంటే, ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదనుకోవాలా? సరే ఈ సంగతి అలా వుంచితే, పవన్ అంతగా హెచ్చరించిన తర్వాత కూడా కేంద్రం హోదా విషయంలో క్లియర్ గా చెప్పేసింది. ఇక హోదా లేదు, ఈ ప్యాకేజీతోనే సరిపెట్టుకోమని చెప్పింది. ఇచ్చింది తీసుకుంటాం, హోదాకోసం పోరాడుతాం అన్న చంద్రబాబు తాజాగా హోదా కన్నా ఎక్కువే ప్యాకేజీతో వస్తోంది, ఇక హోదా  అక్కర్లేదు అన్న రీతిలో మాట్లాడుతున్నారు.  

కాంగ్రెస్ పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి సక్సెస్ కాక బోల్తా పడింది. మిగిలిన వైకాపా ఏపీలో మాత్రం హోదా కావాలంటూ టీడీపీని ఇరకాటంలో పెడుతోంది. ఇంత క్లియర్ గా స్టోరీ తెలిసిపోయింది. హోదా విషయంలో టీడీపీ, బీజేపీ చేతులెత్తేశాయని, వెంకయ్య నాయుడుకు సన్మానం చేయడం ద్వారా చాలా స్పష్టమయింది. అంటే హోదా విషయంలో అందరూ ఫెయిల్ అయినట్టే. 

అంటే తాను చెప్పినట్టు పవన్ కల్యాణ్ ఇప్పుడు హోదా కోసం ఉద్యమ బాట పట్టాలి. కాని తిరుపతిలో ప్రత్యక్ష్యమై తర్వాత కాకినాడలో గొంతు వినిపించి మళ్లీ కనిపించకుండా పోయారు. అంటే మరి ఇంక పవన్ కూడా సైలెంట్ అయిపోయినట్లే అనుకోవాలా? లేక ఆయన రంకెలు అన్నీ మేకపోతు గాంభీర్యాలే అనుకోవాలా?

Show comments