అనాసక్త కథ... ఏపీ స్థాని'కత'..!

అమెరికా పాలకులు ఆహ్వానించకపోయినా తెలుగోళ్లు పోలోమంటూ అక్కడికి వెళ్లిపోయి ఉద్యోగాలు సద్యోగాలు చేసుకుంటూ దేశంకాని దేశంలో సెటిలైపోతారు. అక్రమ మార్గాల ద్వారానైనా అక్కడ తిష్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కాని మీ సొంత రాష్ట్రానికి, మీ పూర్వీకుల మూ లాలున్న ప్రాంతానికి మీరు రాండయ్యా అని అడుగు తుంటే 'మేం చచ్చినా రాము' అంటున్నారు. అమెరికా పౌరసత్వమో, మరేదో దేశం సిటిజన్‌షిప్పో తీసుకోవ డానికి ఆరాటపడే తెలుగువారు వారి మూలాలున్న ప్రాం తానికి వెళ్లడానికి పూర్తిగా నిరాకరిస్తున్నారు.

ఎందుకిలా జరుగుతోందని పాలకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ కాలంలో సొంత ప్రాంతం, సొంత రాష్ట్రం అనే ప్రేమ కంటే 'సౌకర్యంగా బతకడం' అనే కాన్సెప్టుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఏపీ స్థాని'కత' ముందుకు సాగ డంలేదు. తెలంగాణలో, ప్రధానంగా హైదరాబాదులో ఉన్న ఆంధ్రులు (ఏపీ మూలాలు ఉన్నవారు) 2017 జూన్‌ 2వ తేదీలోగా ఏపీలో స్థిరపడితే వారికి 'స్థానికత ' (నేటివిటీ) ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటిం చింది. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్రపతి చేత ఉత్తర్వులు జారీ చేయించింది. కాని స్పందన శూన్యం.

రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచి మూడేళ్లలోపు (2017 జూన్‌ 2వ తేదీ) ఆంధ్రాలో స్థానికత పొందడానికిగాను ప్రభుత్వం 2014లోనే ఉత్తర్వులిచ్చినా గత ఏడాది (2016) మధ్యలో ఆ ఉత్తర్వులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఏప్రిల్‌ నాటికి 830 మంది స్థానికత తీసుకోగా మే నెలలో ఇప్పటివరకు 20 మంది మాత్రమే పెరి గారు. అంటే 850 మందన్నమాట. ఏపీ పాలకులను ఇది చాలా ఆశ్చర్యపరుస్తోంది. స్థానికత ఇచ్చే గడువు జూన్‌ 2వ తేదీతో ముగుస్తున్నందున ఏం చేయాలా? అని ప్రభు త్వం తర్జనభర్జన పడుతోంది. హైదరాబాదులో ఉన్నవారు ఏపీకి రావడానికి ఇంకా అవకాశం ఇవ్వాలనుకుంటే గడు వును మరికొంత కాలం పొడిగించాలి. ప్రస్తుత గడువు ముగిసేలోగా పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.

చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇతరత్రా అనేక విషయాలపై దృష్టి సారించినా స్థానికతను పట్టించుకోలేదు. పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి తర్వాత చూసుకుందాంలే అనుకున్నారు. కాని ఓటుకు నోటు కేసు కారణంగా పరిపాలనను ఆదర బాదరగా ఏపీకి తరలించిన తరువాత హైదరాబాదు నుంచి తరలిపోయే ఉద్యోగులు ఏపీలో తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని గగ్గోలు పెట్టారు. దీంతో గత ఏడాది మధ్యలో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయించారు. అంటే రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తరువాత ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నమాట.ఈ ఉత్తర్వుల ప్రకారం పక్కా తెలంగా ణవారు కూడా తమకు ఇష్టమైతే ఆంధ్రాలో స్థిరపడొచ్చు. వారు వెళ్లరనుకోండి. అది వేరే విషయం.

Readmore!

స్థానికత తీసుకోవడమనేది ఐచ్ఛిక విషయం. ఏపీకి వెళ్లి స్థానికత తీసుకుంటే వారి పిల్లలు లోకల్‌ అవుతారు కాబట్టి విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుంది. హైదరాబాదులోనే ఉండిపోయిన ఆంధ్రులు నాన్‌ లోకల్‌ అవుతారు. గత మూడేళ్లలో కనీసం వెయ్యి మంది కూడా ఆంధ్రాకు వెళ్లి స్థిరపడటానికి ఆసక్తి చూప లేదని అర్థమవుతోంది. 1947లో దేశం భారత్‌-పాకి స్తాన్‌గా విడిపోయినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఇటు నుంచి అటు వెళ్లారు. అటు నుంచి ఇటు వచ్చారు. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు తక్కువ. కాబట్టి కిక్కిరిసిపో యిన రైళ్లలో, ఎడ్ల బండ్ల మీద, కాలి నడకన ఇష్టమైన దేశాలకు వెళ్లారు. కొందరు ప్రముఖుల పుస్తకాల్లో ఈ ఘటనలు చదువుతుంటే మనసు భారమై ఆనాటి పరిస్థితి ఇంత భయంకరంగా ఉందా అనిపిస్తుంది.

కాని అంతటి భావోద్వేగాలు, సెంటిమెంటు ఇప్పుడు లేవు. హైదరాబా దులో స్థిరపడిన ఆంధ్రులకు ఆంధ్రాలోని తమ ప్రాంతాలపట్ల ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ అక్కడికెళ్లి ఏం చేయాలి? అనే ప్రశ్న వేసుకుంటున్నారు. హైదరాబాదులా సకల సౌకర్యాలతో, ఉపాధి అవకాశాలతో, విద్యా కేంద్రాలతో, అత్యాధునిక ఆస్పత్రులు వగైరా సౌకర్యాలతో ఉన్న నగరం ఆంధ్రాలో లేదు. అసలు రాజధానే లేదు.

కొన్ని తరాల కిందట హైదరాబాదులో, తెలంగాణ జిల్లాల్లో స్థిరపడినవారిలో చాలామంది ఆంధ్రాలో ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్నారు. ఎప్పుడో వచ్చి స్థిరపడిన పెద్దవారికి సొంత రాష్ట్రంపై మమకారం ఉన్నా హైదరా బాదులోనే పుట్టి పెరిగి, ఇక్కడే చదవుకొని, ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి ఆంధ్రా మీద అసలు మోజు ఉండే అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా వెళ్లారు. కాని ప్రయివేటు కంపెనీల్లో పనిచేసేవారికి, వ్యాపారులకు ఆంధ్రాకు వెళ్లి స్థిరపడాల్సిన అవసరం ఏముంటుంది? దేశం విడిపోయినప్పుడు సెంటిమెంట్‌ పనిచేసింది.

కాని ఇప్పుడు ఉపాధి ఎక్కడ ఉంటే అదే మన సొంత రాష్ట్రమనే భావన ఉంది. మెరుగైన జీవితమే ఇప్పటి ప్రజల లక్ష్యం. దశాబ్దాలుగా హైదరాబాదులో పని చేసిన ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు భారమైన హృదయాలతో రాజధాని ప్రాంతానికి (అమరావతి) తరలివెళ్లారు. ఉద్యోగినులు తమ తోటి తెలంగాణ ఉద్యోగినులను కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి పరిస్థితీ ఇదే.

ఉద్యమం సమయంలో రెండు ప్రాంతాల ఉద్యోగులు హోరాహోరీగా పోరాడినా విభజన తరువాత అదంతా ముగిసిపోయిన కథ. రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య సహజంగా ఉన్నా స్నేహభావం, ప్రేమాభిమానాలు చనిపోలేదు. అందుకే ఆంధ్రా ఉద్యోగులు బస్సుల్లో, రైళ్లలో ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిపోతుంటే తెలంగాణవారు కన్నీటితో వీడ్కోలు పలికారు. హైదరాబాదులోని ఆంధ్రా ఉద్యోగులు రాజధాని ప్రాంతానికి తరలడానికి ఎన్ని మల్లగుల్లాలు పడ్డారో, ఎంత తర్జనభర్జన జరిగిందో, ప్రభుత్వానికి ఎన్ని షరతులు పెట్టారో, ఎన్ని రాయితీలు, సౌకర్యాలు డిమాండ్‌ చేశారో తెలిసిందే.

చాలామంది ఉద్యోగుల పిల్లలు నగరంలో పుట్టి పెరిగి, చదువుకున్నవారే. ఇంకా చదువుకుంటున్నవారున్నారు. చదవులు ముగించినవారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆం ధ్రాకు తరలివెళ్లిన ఉద్యోగుల్లో అనేకమందికి హైదరాబాదులో సొంత ఇళ్లున్నాయి. ఇళ్ల స్థలాలు, ఇతర ఆస్తిపాస్తు లున్నాయి. వివాహాల రీత్యా సంబంధబాంధవ్యాలున్నాయి. నగరంతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధం తెంచుకోవడం సులభం కాదు. ఇందుకు ఇంకా కొన్ని తరాలు పడు తుంది. రాష్ట్రం విడిపోయి మూడేళ్లు దాటిన తరువాత కూడా ఆంధ్రా నుంచి వేలాదిమంది ఉపాధి కోసం హైదరాబాదుకు వస్తూనే ఉన్నారు.

ఈ నగరం తెలంగాణ రాజధాని అనే భావన లేదు. ఈమధ్య సినీ ప్రముఖులు కొందరిని సినిమా పరిశ్రమ ఆంధ్రాకు తరలిపోతుందా? అని అడిగినప్పుడు అది జరిగేది కాదన్నారు. ఆంధ్రాలో భవిష్యత్తులో సినిమా పరిశ్రమ అభివృద్ధి అవుతుండొచ్చు. కాని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి స్థిరపడటం సాధ్యం కాదనే అభిప్రాయం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే హైదరాబాదును వదిలిపెట్టలేదు. పాత ఇల్లు కూలగొట్టి కోట్లు ఖర్చు చేసి ఇంధ్రభవనం నిర్మించారు. హైదరాబాదులో ఇల్లు నిర్మించుకోవడంపై చూపిన ఆసక్తి ఆంధ్రాలో (రాజధాని ప్రాంతంలో) ఇల్లు కట్టుకోవడానికి చూపించలేదు. ఆయనకే లేని ఆసక్తి ప్రజలకు ఎందుకు ఉంటుంది?

-నాగ్‌ మేడేపల్లి

Show comments

Related Stories :