ఆడబిడ్డలు.. అదరగొట్టేస్తున్నారు..!!

-రాజకీయం, సామాజికం, క్రీడ ఎక్కడా తిరుగులేదు

-అదరగొట్టేస్తున్న మహిళా లోకం

-తెలుగునాట మహిళల జోరు మరింత ఎక్కువ!

-ప్రముఖ కుటుంబాల నుంచి ప్రోత్సాహం

-ఆహ్వానించదగ్గ వైఖరి, అభినందించాల్సిన సమయం

మహిళల గురించి మాట్లాడుకోవడం అంటే.. అదేదో మహిళా దినోత్సవం సందర్భంగా చేయాల్సిన ముచ్చటే కాదు. ఏదో ఏడాదికి ఒకసారి వారి గురించి కొన్ని పడిగట్టు పదాలను ఉపయోగించి మాట్లాడేయడం కాదు. మహిళలకంటూ ఒకరోజు ఉంది కాబట్టి.. ఆ రోజున వారి గురించి మాట్లాడటం ధర్మం అన్నట్టుగా వ్యవహరించడం కాదు.. అనునిత్యం తమ గురించి మాట్లాడాల్సిన అవసరాన్ని సృష్టిస్తున్నారు నేటి మహిళలు.

తాము సాధిస్తున్న ప్రగతితో, నమోదు చేస్తున్న విజయాలతో వీరు వార్తల్లో నిలుస్తున్నారు. వావ్‌.. అనిపిస్తున్నారు. మహిళల సక్సెస్‌ల గురించి మాట్లాడటం అంటే మహిళాదినోత్సవం రోజున ఏడాదికి ఒకరోజు కాకుండా.. అనునిత్యం ఏదో ఒకటి సాధిస్తూ, ఎప్పుడూ వారి గురించి మాట్లాడుకునేలా చేయడమే వీరి ప్రత్యేకత.

ఒకరని కాదు, కొందరని కాదు.. అనేకమంది. ఒకరంగంలో అనికాదు, ఒక తీరున అనికాదు... అనేక రంగాల్లో.. అదరగొట్టేస్తున్నారు. రాజకీయం, సామాజికం, ఆర్థికం.. ఇలా ప్రతి రంగంలోనూ నేడు బోలెడన్ని సక్సెస్‌ స్టోరీలు కనిపిస్తున్నాయి. ఎంతంగా అంటే.. అలాంటి సక్సెస్‌ స్టోరీలు రొటీన్‌ అయిపోయాయి! ఒకరో ఇద్దరో ఏదో సాధిస్తున్నారంటే.. వారు ప్రత్యేకం అనుకోవచ్చు కానీ.. అనేకమంది అనేక రకాలుగా సక్సెస్‌లను నమోదు చేస్తూ ఉన్నారు. దీంతో అంతా 'ప్రత్యేకమే' అవుతున్నారు.

తెలుగునాట ఆడబిడ్డల హవా..!

రాజకీయ నేతల భార్యలో, కూతుళ్లో, కోడళ్లో కుటుంబం తరపున రంగంలోకి దిగడం కొత్తేమీ కాదు. సదరు రాజకీయ నేతలు మరణించినప్పుడో, బతికి ఉండి కూడా పదవిని చేపట్టలేని సమయంలోనో.. ఆపత్కాలంగా వాళ్లు తమ ఇంటి మహిళా మణులను రంగంలోకి దింపుతూ రావడం ఇండియాలో దశాబ్దాల నుంచి జరుగుతూ ఉన్నదే. అయితే అప్పట్లో కేవలం ఆపదకాలంలో మాత్రమే.. ఆడవాళ్లు తెరపైకి వచ్చేవాళ్లు. అంతటికే వారి పాత్ర పరిమితం అయ్యేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రముఖుల ఇళ్లల్లో ఆడ, మగ పెద్ద తేడాలేదు. అవసరంతో నిమిత్తం లేకుండా.. అవకాశాలను చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు సత్తా చాటుకుంటూ ఉన్నారు. 

పరస్పర వైరుధ్యభావాలతో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రత్యర్థులుగా చలామణి అవుతున్న కుటుంబాలు.. తెలుగునాట ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. ఇలాంటి కుటుంబాల నుంచినే ఇప్పుడు మహిళల హవా ఎక్కువగా ఉంది. తమ ఇంటి ఆడవాళ్లకు ప్రముఖమైన స్థానం ఇచ్చి గౌరవిస్తున్నారు తెలుగు ప్రముఖులు. తెలుగునాట ఆడవాళ్ల రాణింపు వెనుక వాళ్ల ప్రతిభ ఎంత ఉందో.. వారి కుటుంభాల ప్రోత్సాహం కూడా అదే స్థాయిలో ఉంది. కేవలం తమ రంగంలో రాణించడమే కాదు.. సమాజంతో ఇంటరాక్ట్‌ కావడంలో కూడా తెలుగు మహిళామణులు ముందున్నారు.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భార్య వైఎస్‌ భారతి 'సాక్షి' చైర్మన్‌గా ఉన్నారు. రాజకీయ పార్టీని స్థాపించిన సమయం వరకూ జగన్‌ ఆ హోదాలో ఉండేవారు. సొంత పార్టీ పెట్టాకా.. ఆ హోదాను భార్యకు అప్పగించారు. మొదట్లో సాక్షి చైర్మన్‌గా కేవలం పేరు వరకే భారతి ఉండేవారు. పనులు అన్నీ జగన్‌ స్థాయిలోనే నడిచేవి. అయితే క్రమంగా పరిస్థితులు మారాయి. ఆ మీడియా గ్రూప్‌లోకి ఆమె డైరెక్ట్‌ ఎంట్రీ ఇచ్చారు.

పనుల్లో జోక్యం మొదలైంది. నిర్ణయాలు తీసుకోవడం మొదలైంది. దీంతో కొంతమంది యాక్టివ్‌ వ్యక్తులు అక్కడ నుంచి తప్పుకున్నారు.. భారతీ సీఎండీ చైర్లో కూర్చున్నారు. వారానికి ఐదురోజులు ఆఫీసుకు రావడం మొదలైంది.. సాక్షిని కొత్త రూట్లో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆమె భావించారు. అందుకు తగ్గట్టుగా ఎక్సలెన్స్‌ అవార్డులు, పత్రిక విషయంలో కొన్ని రకాల మార్పు చేర్పులు.. వంటి వాటి ద్వారా భారతి తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అత్యంత భారీ పెట్టుబడితో పెట్టిన సాక్షి మీడియా బ్రేక్‌ ఈవెన్‌ (లాభనష్టాలు)లేని దశకు వచ్చింది భారతి చైర్మన్‌ అయ్యాకే. బ్రేక్‌ ఈవెన్‌ దశ నుంచి 'సాక్షి' పత్రిక లాభాల బాట పట్టింది కూడా భారతి ఆధ్వర్యంలోనే. వాస్తవానికి 'సాక్షి' ఆది నుంచి పొందిన ఆదరణకు(ఈ పేపర్‌ను కొనేది కేవలం వైఎస్‌ అభిమానులే అని కొంతమంది వాదించవచ్చుగాక) అదెప్పుడో లాభాల బాట పట్టాల్సింది. అయితే అంతర్గతంగా, మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ తీరువల్ల ఆ పత్రిక లాభాల దారిని పట్టలేకపోయింది.

కానీ భారతి చైర్మన్‌ అయ్యాకా.. పరిస్థితి మారింది. పరిస్థితిని చాలా దగ్గర నుంచి గమనించారామె. ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో నిఘా ఎక్కువ అయ్యింది. ఇదే సమయంలో పత్రిక నేచర్లో కూడా చాలా మార్పు తీసుకురాగలిగారు. అదనపు ఖర్చులు తగ్గిపోయాయి. అదే సమయంలో ఉద్యోగులతో సఖ్యతగా నడుచుకోసాగారు. మహిళా దినోత్సవం వస్తే.. సాక్షిలో స్వీపర్‌ పనిచేసే ఆడవాళ్లు కూడా భారతీతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటారు. అదీ జగన్‌ భార్య నిరాడంబరత. కేవలం రాజకీయం అనే.. ఇమేజ్‌ను కలిగిన సాక్షి మీడియావర్గం ఎంతోకొంత మార్చడానికి భారతి శతథా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొంత మార్చింది కూడా.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి కూడా వ్యాపారస్తురాలిగా సత్తా చాటుతున్నారు. ఈమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అంతలోపు వ్యాపారరంగంలో కొత్త కొత్త ఐడియాలతో తమ హెరిటేజ్‌ సంస్థను డెవలప్‌ చేస్తానని బ్రహ్మణి చెబుతున్నారు, ప్రత్యక్ష ఎన్నికల వైపు వచ్చే ఆలోచన లేదంటున్నారు. కానీ బ్రహ్మణిపై తెలుగుదేశం పార్టీ వాళ్లకు చాలా ఆశలే ఉన్నాయి.

లోకేష్‌ కన్నా బ్రహ్మణీ వస్తేనే మేలేమో.. అని తెలుగుదేశం పార్టీ హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోగల ఛరిష్మా, వాక్చాతుర్యం... నేపథ్యం బ్రహ్మణికే ఉందని చాలామంది అంటారు. ఈ విషయంలో లోకేష్‌ కన్నా బ్రహ్మణే బెటర్‌ అవుతుందనేది వారి అభిప్రాయం. కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ వద్దు.. ప్రియాంక కావాలి అనే వాదన ఎలా వినిపిస్తూ ఉంటుందో, తెలుగుదేశం పార్టీకి కూడా లోకేష్‌కు బదులుగా బ్రహ్మణి వస్తే బావుంటుందనే వాదన ఉంది.

అయితే కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, ప్రియాంక రావాలనే వాదన గట్టిగా వినిపిస్తూ ఉంటుంది, టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి బ్రహ్మణి రావాలనే టోన్‌ లైట్‌గా ఉంది. కానీ ముందు ముందు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మణి పెద్దదిక్కు అయ్యే అవకాశాలు లేకపోలేదు.

వీరు మాత్రమే కాదు.. రాష్ట్రంలోని అనేక ప్రముఖ కుటుంబాల నుంచి మహిళలు వివిధరంగాల్లో రాణిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ఉపాసన కామినేని, అమల అక్కినేని, వైఎస్‌ షర్మిల, నారా భువనేశ్వరి వంటి వారు కుటుంబ నేపథ్యంతో అంది వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుని రాణిస్తున్నారు. వీరిలో ఉపాసన కామినేని హస్ఫిటల్స్‌తో పాటు అనేక రంగాల్లో మంచి వ్యాపారవేత్తగా, భర్త రామ్‌చరణ్‌ కెరీర్‌ ప్లానర్‌గా సత్తా చాటుతోంది.

తమ పుట్టింటి నేపథ్యం నుంచి వచ్చిన వ్యాపారాలను చక్కగా చేసుకొంటూ పోవడమే కాదు, భర్త చరణ్‌ కెరీర్‌ విషయంలో కూడా ఆమెకు చాలా జోక్యమే ఉందని తెలుస్తోంది. చరణ్‌ అప్పీరియన్స్‌కు సంబంధించి ఉపాసన ఆలోచనలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఎక్కువగా మీడియా ముందుకురారు, పబ్లిసిటీ కన్నా పనికే ఉపాసన ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోందని స్పష్టం అవుతోంది. ఇక బ్లూ క్రాస్‌ సోసైటీ ద్వారా అమల అక్కినేని మూగ జంతువుల బాగోగుల గురించి పాటు పడుతున్నారు. 

సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు అమల. నారా భువనేశ్వరి తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌ను చక్కగా నడిపించారు. వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల అనాధ ఆశ్రమం, ఉచిత విద్య వంటి సామాజిక సేవతో పాటు... అనేక రకాల వ్యాపార వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. 

ఇక రామోజీ కోడలు శైలజా కిరణ్‌ను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. రామోజీ కుటుంబానికి ఆమె పెద్దదిక్కు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామోజీకి వయసు మీద పడుతున్న నేపథ్యంలో.. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని శైలజ ముందుండి నడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రామోజీ పెద్దకొడుకు కిరణ్‌ ఉన్నప్పటికీ.. ఆయన పత్రిక వరకే పరిమితం అయినట్టుగా కనిపిస్తున్నారు.

అయితే శైలజ మాత్రం అటు వ్యాపార సంబంధ కార్యక్రమాలతో పాటు ఇటు సోషల్‌ యాక్టివిటీస్‌లో కూడా పాల్గొంటూ ఉంటారు. త్వరలోనే ఈమె రాజ్యసభకు నామినేట్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మహిళా వ్యాపారవేత్తగా కూడా ఈమె ప్రత్యేక ప్రాధాన్యత సంపాదించుకొంటున్నారు. ఇక ఉప రాష్ట్రపతిగా వెళ్తున్న తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు కూతురు దీపా స్వర్ణభారతి ట్రస్టు ద్వారా చాలా ప్రచారాన్నే పొందుతూ ఉన్నారు.

ఇక తెలుగు వారిలో వచ్చిన మార్పు.. తమ ఆడపిల్లలను గ్లామరస్‌ ఫీల్డ్‌లోకి పంపడానికి వెనుకాడకపోవడం, గ్లామరస్‌ ఫీల్డ్‌లోని అమ్మాయిలను తమ వారిగా చేసుకోవడానికి వెనుకాడకపోవడం. నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌ అయ్యింది. హీరోల కొడుకులు హీరోలు కావడమే కానీ, కూతుళ్లు హీరోయిన్లు అయ్యే సంప్రదాయం తెలుగనాట లేదు.

అయితే క్రమంగా ఆ పరిస్థితి మారుతోంది. నాగబాబు కూతురు, మరోవైపు రాజశేఖర్‌ కూతురు.. ఆడపిల్లల విషయంలో వారి ధోరణి మారుతోందని చెప్పడానికి ఇవి ప్రముఖ ఉదాహరణలు. అలాగే.. హీరోయిన్‌ సమంత నాగార్జునకు కోడలు అవుతోంది... ఇలాంటి మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అన్నీ ఆహ్వానించదగినవే!

ఒలింపిక్స్‌ మెడల్స్‌ నుంచి వరల్డ్‌ కప్‌ వరకూ...

గత ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియాకు అని రెండు పతకాలు దక్కితే, ఆ రెండు పతకాలూ అమ్మాయిలు తెచ్చినవి. వంద కోట్లకు పైస్థాయి జనాభా ఉన్న ఈ దేశం పరువును నిలిపింది ఇద్దరు ఆడబిడ్డలే. అందులోనూ ఆడవాళ్లకు పెద్దగా విలువ ఇవ్వని, అమ్మాయిలకు ఆటలేంటి.. అని చూసే సమాజం నుంచి అబ్బాయిలకు అయితే బోలెడంత ప్రోత్సాహం ఇచ్చే సమాజం నుంచి.. ఇద్దరు అమ్మాయిలే దేశం పరువును నిలబెట్టడం అనేది మామూలు విషయంకాదు. ఒకవైపు స్త్రీని దేవత అంటూనే, దేవతలుగా స్త్రీ రూపాలకు పూజలు చేస్తూనే.. మరోవైపు ఆడవాళ్లను అత్యంత తక్కువచేసి చూసే సమాజం మనది.

మరి అలాంటి సమాజం ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం పరువును నిలిపింది ఇద్దరు ఆడపిల్లలు. ఒలింపిక్స్‌లో వివిధ దేశాల ఆట తీరును విశ్లేషించిన ఎనలిస్టులు.. ఇండియా దగ్గరకు వచ్చేసరికి, అక్కడ అమ్మాయిలకు ప్రోత్సాహాన్ని ఇవ్వరు, తమ ఇంటి ఆడపిల్లలు ఆటలు ఆడటాన్ని చిన్నతనంగా భావిస్తారు.. అందుకే పతకాల జాబితాలో ఇండియా అంత దిగువన ఉంది.. అని ఒకేమాటలో తేల్చేశారు. గ్రామీణ భారత సమాజాన్ని చక్కగా అర్థం చేసుకున్న వాళ్లే ఈ విశ్లేషణను చేయగలరు.

అయితేనేం.. అంతో ఇంతో పరువు నిలిచింది ఆడపిల్ల ద్వారానే. తాజాగా విమెన్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరి, రన్నరప్‌గా నిలిచారు భారత మహిళలు. మరి మహిళల క్రికెట్‌ అంటూ ఒకటి ఉందని, దానికి వరల్డ్‌ కప్‌ జరుగుతుందని కూడా చాలామంది ఇండియన్స్‌కు మొన్ననే తెలిసిందంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరంలేదు. మహిళలు క్రికెట్‌ చూస్తే చూడొచ్చు కానీ, ఆడటం ఏమిటి? అనే సమాజం మనది.

అలాంటి జాతి నుంచి వెళ్లిన జట్టు రన్నరప్‌గా నిలవడం అంటే మాటలు కాదు. ఎన్నో చిన్న చూపులను, వివక్షను, ఎంతో పేదరికాన్ని ఎదుర్కొని ఆ స్థాయికి వెళ్లారు ఆ అమ్మాయిలు, పురుషుల క్రికెట్‌ జట్టుకు లభించినట్టుగా ప్రోత్సాహం లభించి ఉంటే.. టీమిండియా మహిళలు కూడా క్రికెట్‌లో ఇంకెంతో ఆధిపత్యాన్ని కొనసాగించేవాళ్లని చెప్పడానికి వెనుకాడనక్కర్లేదు.

ఆర్థిక రంగానికి దిక్సూచులు వాళ్లే...

మహిళలు మంచి మేనేజర్లు. ప్రత్యేకించి ఫైనాన్షియల్‌ మేటర్స్‌లో వాళ్ల ప్లానింగ్‌, అంచనాలు, ఖర్చులు, పొదుపులు.. చాలా గొప్పగా ఉంటాయి. దీనికి ప్రతి ఇంటి ఆర్థిక విషయాలూ సాక్షమే. చాలా ఇళ్లలో భర్తకు వచ్చే జీతానికో, సంపాదనకో అనుగుణంగా నెలవారీ ఖర్చులను ప్లాన్‌ చేసేది, ఇంటి అద్దె దగ్గర నుంచి పిల్లల చదువు వరకూ ప్రతిదాని విషయంలో కచ్చితమైన అంచనాలతో, పొదుపు విషయంలో కూడా ఒక ప్రణాళికతో కూడిన బడ్జెట్‌ను వేసేది మహిళలే.

పురుషులు సంపాదించడంలో సమర్థులు కావొచ్చు కానీ, ఈ ప్లానింగ్‌ మాత్రం గాజుల చేతులకే సాధ్యం అవుతుంది. మరి ఇలా దేశంలోని కొన్ని కోట్ల ఇళ్ల బడ్జెట్‌ రూపకల్పన చేస్తున్న మహిళామణులే.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారు.

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజ కంపెనీలకు మహిళా బాస్‌లే ఉండటాన్ని గమనించవచ్చు. ఎస్బీఐ చైర్మన్‌ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ చైర్మన్‌ చందా కొచ్చర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ శిఖాశర్మ, కొటక్‌ బ్యాంక్‌ చైర్మన్‌ శక్తి ఏకాంబరం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌, హెచ్‌ఎస్‌బీసీ హెడ్‌ నైనాలాల్‌ కిద్వాయ్‌ వంటి వారితో పాటు జేపీ మోర్గాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వంటి విదేశీ బ్యాంకుల భారత విభాగాలకు అధిపతులుగా కూడా మహిళలే ఉన్నారు.

ఓవరాల్‌గా ఇండియన్‌ బ్యాకింగ్‌ సెక్టార్‌ మొత్తం మహిళామణుల చేతుల్లోనే ఉంది. కేవలం వంటింటి బడ్జెట్‌నే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థను తమ నిర్ణయాలతో ప్రభావితం చేసే శక్తియుక్తులున్నాయని మహిళలు చాటుకుంటున్నారు. వీరి ఆధ్వర్యంలో ఆయా బ్యాంకులు ఎలాంటి కుదుపులకు లోనుకాకుండా దూసుకుపోతున్నాయి.

కార్పొరేట్‌ శక్తులూ వాళ్లే... 

బ్యాంకింగ్‌ సెక్టార్‌ను మాత్రమే కాదు, కార్పొరేట్‌ వ్యవహారాల్లో కూడా మహిళలు ప్రముఖ స్థానంలో ఉన్నారిప్పుడు. సుధా నారాయణ మూర్తి, నీతా అంబానీ, ఇంద్రనూయి వంటివాళ్లు వివిధ ఆర్థిక సామ్రాజ్యాల్లో క్రియాశీల పాత్రను పోషిస్తున్నారు. సన్‌ నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న కావేరీ కళానిధి దేశంలోనే అత్యంత ఎక్కువ జీతం తీసుకుంటున్న వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు.

బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా, హిందూస్తాన్‌ టైమ్స్‌ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ శోభనా భాటియా, అపోలో గ్రూప్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రీతారెడ్డి, ఇదే గ్రూప్‌ జాయింట్‌ మేనేజ్‌ డైరెక్టర్‌ సునీతా రెడ్డి వంటి వాళ్లు.. కార్పొరేట్‌ సంస్థల బాసులుగా అంత్యంత వేతనం తీసుకున్న వ్యక్తలు జాబితాలో ముందు వరసలో ఉన్నారు. ఈ విషయంలో మగవాళ్లకు ధీటుగా జీతాలు అందుకుంటున్నారు.

అంతర్జాతీయ స్థాయికి ఇండియన్‌ గ్లామర్‌...

ఇది వరకూ భారతీయ అమ్మాయిలు అంతర్జాతీయ స్థాయి అందాల పోటీల్లో మెరిశారు. దశాబ్దాల కిందటే విశ్వసుందరులుగా, ప్రపంచ సుందరులుగా కిరీటాలు పెట్టించుకున్నారు. అయితే ఇప్పుడు ఇండియన్‌ గర్ల్స్‌ హాలీవుడ్‌ స్థాయికి ఎదిగారు. ఐశ్వర్యరాయ్‌కు ఎప్పుడో హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశం వచ్చింది. అయితే అప్పటికి ఆమె పెట్టుకున్న పరిమితులతో ఆ అవకాశాలను వదులుకుంది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.

అందుకే.. ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే లాంటివాళ్లు దూసుకుపోతున్నారు. హాలీవుడ్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. హాలీవుడ్‌లో జెండా పాతేశారు. వీరి కెరీర్‌ అక్కడ పుంజుకుంటోంది. హాలీవుడ్‌ ఇండియన్‌ అమ్మాయిల హవాకు ఇది ప్రారంభం మాత్రమే.. ముందు ఇండియన్‌ గర్ల్స్‌ హాలీవుడ్‌ అడ్రస్‌ను మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొహమాటంతోనో, మరో ఫీలింగ్‌తోనో హాలీవుడ్‌ అవకాశాలను వదులుకునేలా లేరు భారతీయ అమ్మాయిలు. 

పురుషాధిపత్యంలోనూ ప్రత్యేకత చాటుకుంటున్నారు..

దేశంలో ఇప్పుడు రాజకీయ పరిణామాలు కొద్దిమంది వ్యక్తుల చేతిలోనే బంధీ అయిపోయాయి. నరేంద్రమోడీ, అమిత్‌ షాలు ఇద్దరే దేశ రాజకీయాన్నంతా శాసిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏ ప్రభుత్వం పడిపోవాలన్నా, ఏ ప్రభుత్వం నిలబడాలన్నా వారు అనుకుంటనే సాగుతోంది. మోడీ, షాల ముందు పెద్ద పెద్ద రాజకీయనేతలు, వఈద్ధ రాజకీయ సింహాలు కూడా బేర్‌ అంటున్నాయి.

చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీ, షాలకు దాసోహం అంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో వారితో కూడా ఢీ కొడుతున్న వారిలో మమతాబెనర్జీ లాంటివాళ్లు ముందుండటం గమనార్హం. చాలామంది ముఖ్యమంత్రులు రాజకీయ దాడికో, మరోదానికో భయపడి మోడీ, షాల దారిలోకి వెళ్లిపోతున్నారు, మీరెంతంటే అంత, మీరేదంటే అది.. అన్నట్టుగా ఉంది మగసింహాల తీరు.

అయితే మమతా దీదీ ప్రత్యేకం. కొండనే ఢీ కొట్టడానికి ఆమె వెనుకాడటంలేదు. జయలలిత కూడా మోడీకి దాసోహం అనలేదు. కడవరకూ ప్రత్యేకంగానే నిలిచింది. ప్రజామోదం పొందింది, అయితే ఆమె భౌతికంగా లేరు. కానీ.. ఆమె లేకపోయినా.. ఆమె ఫొటోలతోనో, ఆమె పేరు మీదే తమిళనాట ఇప్పటికీ పాలన నడుస్తోంది. దటీజ్‌ జయ.

ఇక మూడేళ్ల కిందట వరకూ కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియా గాంధీ దేశంలో అత్యంత ప్రభావశీల మహిళగా ఉండేవారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోవడంతో ఆమెకు ప్రాధాన్యత దక్కింది. మరి కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకోవాలంటే కావాల్సింది మహిళా శక్తే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రియాంక రావాలి.. పార్టీ మళ్లీ నిలదొక్కోగలదు అని వారు చెబుతున్నారు. యువరాజు రాహుల్‌ మీద వారికి ఆశలులేవు.. ప్రియాంక మీదే వారి ఆశలు ఎక్కువగా ఉన్నాయి. ఆ మహిళా మణే ఏదో మ్యాజిక్‌ చేయగలదనేది కాంగ్రెస్‌ నేతల ఆశ, విశ్వాసం.

ఇక అధికార పార్టీలో మహిళల హవా కొంచెం తక్కువే. విదేశాంగ శాఖను ఇచ్చిన సుష్మను స్వదేశానికి పరిమితం చేశాడు మోడీ. ఆయన ప్రపంచాన్ని చుట్టేసుకు వస్తే సుష్మ స్వాగతం పలుకుతున్నారు. అయినప్పటికీ సుష్మను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సోషల్‌ మీడియా ద్వారానే ఆమె ప్రజలతో కమ్యూనికేట్‌ అవుతుంది. తన పరిధిలోకి వచ్చే సమస్యలను పరిష్కరిస్తోంది. మరి ఇది వరకూ ఈ మాత్రం వ్యవహారాలను చక్కబెట్టిన విదేశాంగ మంత్రులులేరు.

తనుకున్న పరిమితుల్లో కూడా సుష్మ ప్రత్యేకత నిరూపించుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది మహిళలు రాజకీయంగా చాలాబాగా రాణిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటులో తమ వాణిని గట్టిగా వినిపిస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ ఎంపీగా పార్లమెంటులో తన బాణిని గట్టిగా వినిపిస్తూ మహామహుల చేత ప్రసంశలు అందుకుని ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తున్నారు. ఉద్యమ నాయకురాలిగా, రాజకీయంగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని దూసుకుపోతున్నారు కవిత.

గ్లామరస్‌ ఫీల్డ్‌లో గ్లామర్‌ను చాటుతున్నారు. గ్లామర్‌ లేని ఫీల్డ్‌కు కొత్త గ్లామర్‌ను తెస్తున్నారు.. ఇలా దేశంలో మహిళల గాలి వీస్తోంది. తగినంత ప్రోత్సాహంలేదు వారికి.. అని ముందుగానే ప్రస్తావించుకోవాల్సిన దేశంలో వాళ్లు అద్భుతాలనే సాధిస్తున్నారు. ఓవరాల్‌గా ఆడవాళ్లు అదరగొడుతున్నారు!

-ఎల్‌.విజయలక్ష్మి

Show comments