బోడి గుండు కన్నా, బట్ట తల నయ్యం కదా.. అలా సరిపెట్టుకోవాల్సిందే. అసలు చేతిలో ఏమీ లేకపోవడం కన్నా, ఖాళీ బొచ్చె ఉండడం కూడా బెటరే. తప్పదు, సరిపెట్టుకోవాలి. దరిద్రానికి పరాకాష్ట ఇది. దరిద్రం ప్రజలది కాదు, ప్రజల్ని అలా చూస్తున్న పాలకులది.
అసలు విషయానికొస్తే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు వచ్చారు. రెండేళ్ళ పసిబిడ్డ.. అంటూ తెలంగాణను కొనియాడారు. పసిబిడ్డ దగ్గరకు వచ్చేటప్పుడు కనీసం ఓ చాక్లెట్ అయినా తీసుకురావాలి కదా.! ఫంక్షన్ అని ఎవరన్నా పిలిస్తే చాలు, ఉత్త చేతులు ఊపుకుని వచ్చేయడం నరేంద్రమోడీకి మహా సరదా. ఇప్పుడూ ఆయన అదే చేశారు. వచ్చారు, ఉత్త గాలి మాటలు చెప్పి వెళ్ళారు. 'తెలంగాణ ప్రజలకి హైద్రాబాద్ ఎంతో ఢిల్లీ అంతే..' అంటూ, ఢిల్లీలో వున్న మా ప్రభుత్వం మీ కోసమేననే సంకేతాలు పంపారు.
టైమ్ మెషీన్‌ని కాస్త వెనక్కి తీసుకెళదాం. అది, అమరావతి శంకుస్థాన వేదిక. అక్కడ నరేంద్రమోడీ ప్రసంగిస్తున్నారు. 'ఢిల్లీ నుంచి యమునా నది నీటిని తీసుకొచ్చాను.. ఢిల్లీ నుంచి పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాను.. దానర్ధం ఢిల్లీనే ఇక్కడికి తీసుకు వచ్చినట్లు..' అంటూ నరేంద్రమోడీ చెప్పేసరికి, ముందు జనం క్లాప్స్ కొట్టారు, ఆ తర్వాత ఆలోచించి, అవాక్కయ్యారు. 'మమ్మల్ని విభజించి మీరు మా బతుకుల్ని నాశనం చేశారు.. రాజధానిని మేం నిర్మించుకుంటున్నాం.. ఆ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తే, బహుమతిగా రాజధానికి నిధులిస్తామని కూడా చెప్పకుండా.. మా నోట్లో మట్టి కొడతారా.?' అని జనం ఆవేదన చెందారు.
'మీ అమరావతి శంకుస్థాపనకు నేను వచ్చినప్పుడు అప్పట్లో నరేంద్రమోడీ తీరు నన్ను బాధించింది.. ఉత్త చేతుల్తో ఆయన వచ్చారు, నేను సాయం చేద్దామనుకున్నా చేయలేని పరిస్థితి.. దానికి నరేంద్రమోడీనే కారణం..' అని ఏపీ మీద ఆ తర్వాత ఓ సందర్భంలో సానుభూతి కురిపించిన కేసీఆర్ మీద, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సానుభూతి చూపించాలేమో.
'మాకు నీరు, మట్టి అయినా ఇచ్చారు.. మీకు అదీ ఇవ్వలేదు..' అని అక్కడి జనం, తెలంగాణ ప్రజల మీద సానుభూతి చూపించక తప్పదు. అంతే మరి, సాటి తెలుగోడి బాధ తెలుగోడికి కాక ఇంకెవరికి అర్థమవుతుంది.? ఈ ఉత్తచేతుల్తో ఊపుకొచ్చేయడమేంట్రా దేవుడా.? దేశ రాజకీయాల్లో ఇలాంటి ప్రధానిని ఎక్కడన్నా చూశామా.! ప్చ్, లేదంతే. దటీజ్ నరేంద్రమోడీ.