'బాహుబలి'కి 'టి' షాక్‌.. ఇది నిజమా.?

'బాహుబలి' సినిమాకి తెలంగాణ షాక్‌ తప్పేలా లేదేమో.! ఎందుకంటే, ఈ సినిమాకి సంబంధించి చాలా హంగామా జరుగుతోంది. రోజుకి ఐదు ఆటల ప్రదర్శనకుగాను తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతే, అంతకు మించి 'బాహుబలి' సినిమా కోసం ప్రత్యేకంగా ఎలాంటి 'అదనపు అనుమతులు' ఇవ్వలేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. 

'అదనపు అనుమతులు' అంటే, బెనిఫిట్‌ షోలు, టిక్కెట్‌ ధరల్ని పెంచడం, కాంబో ఆఫర్ల పేరుతో ప్రేక్షకుల జేబులకు 'మల్టీప్లెక్స్‌' చిల్లులు వంటివన్నమాట. నిజానికి వీటిల్లో చాలావరకు ఎప్పటినుంచో నడుస్తున్న బాగోతాలే. కొత్తగా బాగోతం ఏంటంటే, 'కాంబో ఆఫర్‌'. ఈ ఆఫర్‌ కింద ఒక్కో టిక్కెట్‌నీ 500 నుంచి 750 వరకూ పెంచి మల్టీప్లెక్స్‌లు అమ్మేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాంబో ఆఫర్‌లో సినిమా టిక్కెట్‌తోపాటు, కూల్‌ డ్రింక్‌, పాప్‌కార్న్‌ వంటివి 'ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..' అన్నమాట.! 

బెనిఫిట్‌ షో అనేది లేకపోతే, అసలది పెద్ద సినిమా ఎలా అవుతుంది.? అనేంతలా 'బెనిఫిట్‌ షో'ల పేరుతో, అభిమానులకి క్షవరం అయిపోతోంది. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. బెనిఫిట్‌ షో టిక్కెట్ల ధరలు 200 నుంచి 2000 రూపాయల దాకా, అంతకు మించి కూడా పలికిన సందర్భాలున్నాయి. కానీ, 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాకొచ్చేసరికి అలాంటివేమీ వుండబోవట. మంత్రి తలసాని శ్రీనివాస్‌ హెచ్చరికతో, ఇప్పుడు 'బాహుబలి' బెనిఫిట్‌ షోలపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. నిజమైతే మాత్రం, అది చాలా పెద్ద షాక్‌గానే భావించాల్సి వుంటుందేమో. 

రేపు అర్థరాత్రి వరకూ కాదు, రేపు సాయంత్రం నుంచే బెనిఫిట్‌ షోలకు రంగం సిద్ధం చేసేస్తున్నారు. 'బాహుబలి'కి వున్న క్రేజ్‌ నేపథ్యంలో టిక్కెట్‌ ధరని 400 నుంచి 4 వేల దాకా పెంచేశారంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. బెనిఫిట్‌ షోల సంగతి అలా వుంచితే, తొలి రోజు టిక్కెట్‌ ధరల్ని ఫ్లాట్‌ రేట్‌ పేరుతో 500 రూపాయలదాకా అమ్మాలనే దిశగా 'కుమ్మక్కు' కూడా జరిగిపోయిందట. మరి, ఈ దోపిడీకి తెలంగాణ సర్కార్‌ అడ్డుకట్ట వేస్తుందా.? లేదంటే, ఇదంతా తూతూ మంత్రం బెదిరింపుల వ్యవహారంలా భావించాలా.? ఒక్కటి మాత్రం నిజం, అంతిమంగా ప్రేక్షకుడి జేబుకి చిల్లు పడాల్సిందే. లేకపోతే, 'బాహుబలి' పెద్ద సినిమా ఎలా అవుతుంది.?

కొసమెరుపు: తెలంగాణలో ఈ తాటాకు చప్పుళ్ళ సంగతిలా వుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, ’బాహుబలి‘ దోపిడీకి హద్దూ అదుపూ లేకుండా పోతోందట.

Show comments