నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక విషయంలో తన టాలెంట్ ను అంతా ప్రయోగించేస్తోంది భూమా అఖిలప్రియ. నిన్న ఏకంగా జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడిన ఈమె.. జగన్ కు బుద్ధి చెప్పండి.. అంటూ పిలుపునిచ్చేసిన ఈ రాజకీయ నేత, ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలో వ్యూహాత్మకంగా మాట్లాడేసింది. నంద్యాల బై పోల్స్ లో పవన్ మద్దతు తమకే అన్నట్టుగా అఖిల చెప్పుకొచ్చింది. ఇక్కడ రాజకీయాన్ని గాక.. ‘కుటుంబం’ అంటూ అఖిల మాట్లాడింది.
పవన్ మద్దతు తమ కుటుంబానికే ఉంటుందని అఖిల చెప్పుకొచ్చింది. రాజకీయంగా పవన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు కాబట్టి.. ఇక్కడ అఖిలప్రియ కుటుంబాన్ని తెరపైకి తెచ్చింది. తమ కుటుంబంపై పవన్ కు సానుభూతి అన్నట్టుగా అఖిల మాట్లాడింది. మరి ఈ సానుభూతి ఇప్పుడే వచ్చిందా? లేక ముందునుంచి ఉందో.. అఖిల చెప్పలేదు. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికల ముందు అఖిల తల్లి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కల్యాణ్ కానీ ఎలాంటి సానుభూతి చూపలేదు.
నంద్యాల ఎన్నిక ఆగడానికి వీల్లేదని.. అభ్యర్థి మరణించినా కూడా ఎన్నిక జరగాల్సిందే అని అప్పట్లో వీళ్లు ఎన్నికల కమిషన్ దగ్గర వాదించారు. ఒకవైపు ఈసీ దగ్గర ఆ వాదన వినిపించి.. మరోవైపు నియోజకవర్గంలో మాత్రం, శోభకు ఓటేస్తే ప్రయోజనంలేదు.. టీడీపీకి ఓటు వేయండి అని ప్రచారం చేసింది టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి. శోభ ఎలాగూ మరణించింది కాబట్టి.. టీడీపీకి ఓటు వేయాలని టీడీపీ వాళ్లు వాదించారు. మరి అప్పట్లో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఎక్కడా సానుభూతి తెలియజేయలేదు. కనీసం ఆళ్లగడ్డలో అయినా భూమా కుటుంబాన్ని గెలిపించమని పిలుపునివ్వలేదు. పాపం శోభా నాగిరెడ్డి కొన్నాళ్లు పాటు ప్రజారాజ్యంలో కూడా పనిచేశారు.
భూమా నాగిరెడ్డి రాయలసీమ అంతా తిరిగి చిరంజీవి పార్టీ తరపున జెండాలు కట్టాడు. అయినప్పటికీ అప్పట్లో భూమా ఫ్యామిలీపై పవన్ కల్యాణ్ సానుభూతి ఏమీ చూపలేదు. ఇప్పుడు మాత్రం.. పవన్ సానుభూతి చూపుతాడని అఖిల చెప్పుకొస్తోంది. మరి పవన్ సానుభూతికి ఎంత ప్రతిఫలం దక్కుతుందో చూడాలి. నిన్న మీడియా ముందుకు వచ్చినప్పుడేమో రాబోయే రెండు మూడు రోజుల్లో నంద్యాల బై పోల్స్ విషయంలో స్పందిస్తానని పవన్ చెప్పాడు. ఎలాగూ ఆ లోపు నామినేషన్ గడువు ముగుస్తుంది.