బాహుబలి 2 పై ముసురుకుంటున్న సందేహాలు

బాహుబలి- 2. నిస్సందేహంగా ప్రజల్లో మాంచి బజ్ సంతరించుకున్న సినిమా. టికెట్ ల కోసం జనాలు కిందా మీదా పడుతున్న సినిమా. ప్రభుత్వం చొరవ తీసుకుని, రోజుకు ఆరు ఆటలు వేసుకోవచ్చని అనుమతిచ్చిన సినిమా. తెలుగు రాష్ట్రాల్లో నూట ముఫైకోట్ల మేరకు థియేటర్ హక్కులు అమ్ముకున్న సినిమా. అయితే ఈ సినిమా పై అనేక ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. సినిమా బాగుంటుందా? బాగుండదా? అన్నది కాదు సమస్య. నిస్సందేహంగా సినిమా విజువల్ గ్రాండియర్ గా వుంటుంది. అందులో డవుట్ లేదు. సరే, ప్రథమార్థంపై వచ్చిన విమర్శలను దృష్టిలో వుంచుకుని దర్శకుడు రాజమౌళి తగు జాగ్రత్తలు తీసుకునే వుంటారు కాబట్టి, కథ, కథనాల విషయంలో కూడా అనుమానం లేదు.

కానీ..సినిమా ఏమేరకు వసూళ్లు సాగిస్తుంది. కొనుక్కున్న బయ్యర్ల సంగతి సరే,  వారి నుంచి కొనుకున్న థియేటర్ల వారు, లోకల్ చిన్న బయ్యర్లు, ఔత్సాహిక బయ్యర్లు గట్టెక్కాల్సి వుంది. ఎందుకంటే ఏరియాల వారీ కొనుక్కున్న బయ్యర్లు మరి కాస్త లాభం వేసుకునే అమ్ముతారు కానీ, కొన్న రేటుకే అయితే కాదు. ఇక్కడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం బాహుబలి 2 టోటల్ రన్ లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 160 కోట్లకు పైగా వసూళ్లు సాగించాలి. అప్పుడే ఈ సినిమా అమ్మకాల్లో పాత్ర వహించిన ప్రతి ఒక్కరు లాభం కళ్ల చూడగలిగేది. ఎందుకంటే 130 కోట్ల మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమ్మకాలు సాగించారు. ఖర్చులు 10శాతం వుంటాయి. అంటే 143 కోట్లు. అయితే చాలా మంది బయ్యర్లు మారు బేరాలకు, థియేటర్ అడ్వాన్స్ లు, లేదా ఎంజీలు, లేదా లోకల్ బయ్యర్లు, ఇలా రకరకాలుగా సొమ్మలు చేసేసుకున్నారు. అందువల్ల వాళ్లకు పెద్ద సమస్య వుండదు. కానీ ఇలా చేసుకున్న సొమ్ములు కొన్న రేట్లు, ఖర్చులు కలిపి మరి కాస్త ఎక్కువకే వుంటాయి కానీ తక్కువకు కాదు. అంటే హీనంలో హీనం 150-160 కోట్ల మేరకు అమ్మకాలు రావాలి.

ఇదిలా వుంటే బాహుబలి వన్ అన్నది అపూర్వమైన కలెక్షన్లు సాధించింది. ఇళ్లలో వున్న ముసలీ ముతక, గడచిన పదేళ్లుగా సినిమా అన్నదే చూడని వారు, డెభై ఏళ్లు దాటిన వారు ఇలా అందరూ, అంటే దాదాపు ఆంధ్ర సినిమా ప్రేక్షకులు అందరూ సినిమా చూసారు. అప్పుడు బాహుబలి వన్ కు వచ్చిన టోటల్ షేర్ 113 కోట్లు. అది కూడా ఫుల్ రన్ లో వచ్చిన షేర్. పోనీ రెండేళ్లలో లెక్కలు మారిపోయాయి అనుకున్నా, ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ ఖైదీ నెం 150 కి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ దగ్గర దగ్గర 80 కోట్లు. ఖైదీ నెంబర్ 150 మాస్ సినిమా. ఇళ్లలో ముసిలి ముతక రాలేదు, కానీ బాహబలి 2 కి వస్తారు అని అనుకుందాం. అప్పుడు కూడా బాహుబలి వన్ కు, ఖైదీ మధ్య వున్న గ్యాప్ అయిన 33 కోట్లు ఇంకా వుండనే వుంది.

ఇలాంటి నేపథ్యంలో 150-160 కోట్ల వసూళ్లు అన్నదే పెద్ద ప్రశ్న. దీనికి ఒక్కటే ఆన్సరు. విపరీతంగా రేట్లు పెంచి, ఎక్కడికక్కడ అయినకాడికి ప్రేక్షకులను దోచేసుకోవడం. ఇప్పటికే స్పెషల్ షో ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కొంత రికవరీ. అలాగే యూనిఫారమ్ రేటు. అది కూడా రెగ్యులర్ గా వుండే 150-200 కాకుండా మూడు నాలుగు వందలకు అమ్మడం ఇలాంటివే చిన్న, పట్టణాలు, ప్రాంతాల వారీ బయ్యర్లను గట్టెక్కించాల్సి వుంటుంది.

నిర్మాతల ధీమా-ఆరుషోలు

వన్ వీక్ దాటితే వేడి చల్లారితే, సినిమా వైనం తెలిసి పోతే మూడు వందలు, నాలగు వందలు పెట్టి థియెటర్ కు వెళ్లాలనుకునే పిచ్చి ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది. తగ్గిన తరువాత వెళ్ల వచ్చులే అనే వారి సంఖ్య పెరుగుతుంది. అది సినిమా చిన్న బయ్యర్లకు నష్టం కలిగిస్తుంది. అదే కనుక రోజుకు ఆరు ఆటలు, అంటే మూడు రోజుల్లో 18 ఆటలు. సగటున 500 సీట్లు థియేటర్ కు చూసుకున్నా, థియేటర్ కు 9000 టికెట్ లు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1650 థియేటర్లు వున్నాయి. అన్నింటిలో  బాహుబలి 2 షో లు వేస్తే, కోటిన్నర షోలు పడతాయి. టికెట్ వంద రూపాయిలు చూసుకున్నా, 150 కోట్లు తొలి మూడు రోజుల్లో వస్తాయి. లాంగ్ రన్ లో రెండు వందల కోట్లకు పైగానే వస్తుంది. అదీ నిర్మాతలు, బయ్యర్ల ధీమా.

కానీ..

బాహుబలి వన్ చూడని సగటు సినిమాప్రేక్షకుడు లేడు. అలాగే 60 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం మందికి బాహుబలి వన్ నచ్చలేదు. ఇది వాస్తవం. వాళ్లకు గతంలోని పాత సినిమాలతో పోల్చుకుంటే బాహుబలి నచ్చలేదు. అందువల్ల వాళ్లు ఇప్పడు వెంటనే థియేటర్ కు రారు. బాహుబలి 2 కచ్చితంగా బాగుంది అని ఇంట్లో యూత్ చెప్పిన తరువాతే థియేటర్లకు కదులుతారు. అప్పటి వరకు రారు. అందువల్ల ఆరు షోలు, మూడు రోజులు ఫుల్ రన్ అవుతాయా? అన్నది తెలియాల్సి వుంది.

పైగా ఓ చిన్న ఊరు తీసుకుందాం. రెండు థియేటర్లు వుంటాయి. రోజుకు ఆరు ఆటలు, మొత్తం 18 ఆటలు మూడు రోజులకు. మొత్తం రెండు థియేటర్లకు 36 ఆటలు. 500 సీటింగ్ కెపాసిటీ అంటే 18000 మంది చూసేస్తారు. రెండు థియేటర్లు మాత్రమే ఉండే చిన్న ఊళ్లలో 18వేలకు మించిన ప్రేక్షకులు ఎంత మంది వుంటారు?

పైగా ఫుల్స్ కాకపోతే, షేర్ పడిపోతుంది. అది కూడా సమస్యే. అదీ కాక, టైమ్ గడచిన కొద్దీ పైరసీ సమస్య ఎదురవుతుంది. టాక్ కూడా నూటికి నూరు పాళ్లు ఫేవర్ గా వుండాలి. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.

వీటన్నింటినీ అధిగమించి, 200 కోట్లకు పైగా వసూళ్లు తెలుగునాట సాధించగలిగితే. సాహోరే..బాహుబలీ అనాల్సిందే.

Show comments