హైజాక్‌ చేయడమే లక్ష్యమా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల దృష్టిలో కాంగ్రెస్‌కు క్రెడిబిలిటీ లేకుండా పోయిన తర్వాత... కొన్నాళ్లుగా ప్రత్యేకహోదా గురించి పాటుపడుతున్నది ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అనే భావన ప్రజల్లో ఉంది. ప్రతిపక్ష పార్టీగా వారి బలం తక్కువే అయినప్పటికీ.. ఆ బలంతో వారు చేయగలిగింది తక్కువే అయినప్పటికీ.. శక్తివంచన లేకుండా హోదాగురించి మాట్లాడుతున్నారు అనే భావన మాత్రం అందరికీ ఏర్పడింది. జగన్మోహనరెడ్డి హోదా గురించి గట్టిగా మాట్లాడుతున్నారు.. ఆయన పార్టీ వాళ్లు చేతనైనంత పోరాడుతున్నారు అని జనం నమ్ముతున్నారు. జగన్‌ ఎక్కడకు వెళ్లినా హోదా వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో ఎందుకు అవసరమో కూడా చెబుతున్నారు. 

కానీ పవన్‌ కల్యాణ్‌ హోదా మీద ప్రకటించిన పోరాటం చాలా వ్యూహాత్మకంగా సాగిపోయింది. కాస్త వ్యవధి ఇచ్చి సరైన సమయం వచ్చాక మాట్లాడాలని వేచి ఉన్నానంటూ.. తనను తాను సమర్థించుకున్న పవన్‌ కల్యాణ్‌.. ఇన్నాళ్లుగా అదే ప్రత్యేకహోదా గురించి ఆయన భాషలో 'మడమ తిప్పకుండా' పోరాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురించి కనీసం ఎందుకు ప్రస్తావించలేదు. కనీసం వామపక్షాలు, ఇతర న్యూట్రల్‌ రాజకీయ శక్తులు , సంస్థలు హోదా కోసం చేస్తున్న ప్రయత్నాల్ని కూడా పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావించలేదు. 

ఈ కోణంలోంచి చూసినప్పుడు జగన్‌కు జనం వద్ద దక్కుతున్న మంచి పేరు చూసి చంద్రబాబు మరో గత్యంతరం లేక ప్రత్యేకహోదా పాటెత్తుకున్నారు. కానీ ఆయనకు తనకంటూ బోలెడు భయాలు ఉండడంతో మోడీ వద్ద నోరెత్తలేకపోతున్నారు. జనం నమ్మడం లేదు. ఆయన గతి లేదు. కానీ.. జగన్‌కు మాత్రం కీర్తి దక్కడానికి వీల్లేదు. ఆ కీర్తిని తన్నుకుపోవడానికే, ఉద్యమాన్ని హైజాక్‌ చేయడానికే పవన్‌ కుట్ర చేసిన తరహాలో అనుమానాలు కలుగుతున్నాయి. 

ప్రత్యేకహోదా అంటే ఏమిటో.. దానివల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, యువతరం మొత్తం దానికోసం ఎందుకు పోరాడాలో.. ఇలాంటి మంచి విషయాలేమీ పవన్‌ తన అభిమానులకు చెప్పలేదు. కేవలం నేను సభలు పెడతా వచ్చేయండి.. ఏం చెబితే అది చేయండి.. విజిల్స్‌ వేస్తూ ఉండండి.. అన్నట్లుగా సాగిపోయింది. ఆయన సినిమాలు మానడం లేదు, జిల్లాకు ఓసభ పెడతారు. 13 జిల్లాల్లో సభలు పెట్టి.. మధ్యలో సినిమాలు చేసుకుంటూ.. ఆ తర్వాత రెండో దశలోకి , ఎంపీల మీద ఒత్తిడి తెచ్చే వరకు వెళ్లడానికి ఎన్ని నెలలు గడచిపోతాయో తెలీదు. ఇలాంటి అస్పష్టమైన సందేహాస్పదమైన రూట్‌ మ్యాప్‌తో పవన్‌ తన ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ప్రకటించారు.  Readmore!

ఆ నేపథ్యంలోనే.. జగన్‌ నుంచి దీనిని హైజాక్‌ చేయడానికి తప్ప.. ఆయనకు మరొక లక్ష్యం ఉన్నట్లు లేదని భావించాల్సి వస్తోంది. హోదా అడుగుతున్న వారందరినీ కలుపుకుపోయేలా తన ఉద్యమం ఉంటుందని పవన్‌ ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆయనలోని అహంకారానికి నిదర్శనం అని పలువురు భావిస్తున్నారు. 

Show comments