ఇక మీడియా కళ్లకు గంతలే

తెలుగు రాష్ట్రాల్లో వున్నన్ని పత్రికలు కానీ, చానెళ్లు కానీ, వెబ్ మ్యాగ్ జైన్లు కానీ మరే భాషలోనూ వుండవేమో? ఇక పట్టణాల వారీగా వున్న ప్రాంతీయ మీడియా సంస్థలయితే ఏకంగా వందల్లోనే. ఇంతలా మీడియా చైతన్యం వున్నా కూడా తెలుగురాష్ట్రాల్లో  జనాలకు నిఖార్సయిన, నిస్పక్షపాతమైన వార్తలు అందుతాయా అంటే అది పది శాతమే. 

మిగిలిన 90 శాతం మీడియా ప్రాంతం, కులం, పార్టీ, వ్యక్తుల వారీగా చీలిపోయి, ఎవరి ప్రయోజనాలకు కోసం అవి పనిచేసుకుంటూ పోతున్నాయి. రాష్ట్రం రెండుగా చీలిన తరువాత కూడా మీడియా పోకడ మరింత పెడదోవ పడుతోంది తప్ప వేరు కాదు. ఆంధ్రలో ఒక మాదిరిగా, తెలంగాణలో మరో మాదిరిగా మీడియా వార్తలు వండి వారుస్తోంది. ఇందుకోసం ఏ రాష్ట్రం కుంపటి ఆ రాష్ట్రానికి తయారుచేసి, ఎవరికి కావాల్సిన వంటలు వారికి వండి వారుస్తున్నారు.

నిజానికి తెలుగుదేశం అనుకూల మీడియా కేసిఆర్ పట్ల వ్యతిరేకతతో వుంటుందని రాష్ట్ర విభజన తరువాత అందరూ భావించారు. కానీ మీకు మేము మాకు మీరు అనే రీతిగా తెలంగాణలో కూడా కేసిఆర్ తో మీడియా మిలాఖత్ అయిపోయింది. కొన్ని మీడియా సంస్థలు కాస్త పోరాడినా, ఆఖరికి రాజీ మార్గమే పట్టాయి.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా బయటకు వస్తున్న వార్తలు చెబుతున్నదేమిటంటే, లీడింగ్ తెలుగు చానెళ్లలో కేసిఆర్ తో అనుబంధం వున్న బడా పారిశ్రామిక వేత్త వాటాలు కొనుగోలు చేసారని. ఇంకేముంది? ఖేల్ ఖతమ్.. దుకాణ్ బంద్. కేసిఆర్ కోసం, వందల కోట్ల డొనేషన్లు వసూలు చేస్తూ, వందల కోట్ల ప్రాజెక్టులు చేస్తున్న ఓ స్వామీజో కొసం ఓ పారిశ్రామిక వేత్త ముందు జాగ్రత్తగా రెండు చానెళ్లలో పెట్టుబడులు పెట్టారన్న వార్తలుబయటకు వచ్చాయి. అంటే ఇంక ఏమనుకోవాలి Readmore!

ఆంధ్రలో వ్యవహారం వేరు. చంద్రబాబు కానీ, ఆయన అనుచరులు కానీ నేరుగా చానెళ్లలో పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. అక్కడ చాలా వరకు మీడియాకు, తెలుగుదేశం పార్టీకి వున్న బంధం అనిర్వచనీయం..అజరామరం. అందువల్ల అక్కడ డబ్బుల ఖర్చు లేకుండానే తెలుగుదేశం పక్కన అండగా వుంటాయి మీడియా సంస్థలు.

ఇక వచ్చే ఎన్నికల్లో జనం కళ్ల ముందు సప్తవర్ణాల్లో అభివృద్ధే కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో అయినా అటు ఆంధ్రలో అయినా. ఇక లోటు పాట్లు అన్నవి పెద్దగా వినిపించే అవకాశమే వుండదు. ఎందుకంటే ఇలా పక్కకు ఒరిగిపోయిన మీడియా పదిశాత కాదు..తొంభై శాతం. అందువల్ల ప్రజల కళ్లకు మీడియా అద్దాలు తగిలించే వుంటాయి.

Show comments