టాలీవుడ్‌ 2017 - హాఫ్‌ ఇయర్లీ రిపోర్ట్‌

శిఖరాగ్రాన్ని చేరుకున్నాం గానీ...

'బాహుబలి' మొదటి భాగం తెలుగు సినిమా మార్కెట్‌ పరిధి ఏంటనేది చూపిస్తే, రెండేళ్ల తర్వాత వచ్చిన 'బాహుబలి 2' పరిధులని శాసించే ఆలోచనలుండాలే కానీ మన సినిమాకి ఎల్లలు లేవని చాటి చెప్పింది. అయితే ఇక్కడ చింతించాల్సిన విషయం ఏమిటంటే, ఈ రెండేళ్ల కాలంలో 'బాహుబలి' సాధించిన ఘనతని అందుకున్న మరో సినిమా రాలేదు.

ఆకాశానికి నిచ్చెన వేసే డ్యూటీ రాజమౌళి ఒక్కడిదేనన్నట్టు మిగతా వాళ్లంతా రొటీన్‌లో పడిపోయారు. రాజమౌళి మన సినిమాకి వున్న శక్తి సామర్ధ్యాలేంటనేది చూపించినపుడు ఆ స్థాయికి తగ్గ ఆలోచనలతో ఈపాటికి మరిన్ని ప్రయత్నాలు మొదలైపోయి వుండాలి.

ఒక హారర్‌ సినిమా హిట్టయితే తామరతంపరగా మరిన్ని హారర్‌ సినిమాలు, ఒక కామెడీ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయితే గుంపులు గుంపులుగా మరిన్ని కామెడీలు... ఇలా ఏ హిట్‌ ట్రెండ్‌ని అయినా హెర్డ్‌ మెంటాలటీతో ఫాలో అయిపోయే సినిమా వాళ్లు బాక్సాఫీస్‌ వద్ద విధ్వంసం చేసిన రాజమౌళి ఆలోచనల్లాంటివి ఆలోచించడానికి కూడా జంకుతున్నారు.

'మగధీర'తో అప్పటి తెలుగు సినిమా మార్కెట్‌ని రెండింతలు చేసినా, బాహుబలితో ఆ టైమ్‌కి ట్రిపుల్‌ రేంజ్‌ సాధించినా, బాహుబలి 2తో మన సినిమాకి జాతీయ రికార్డులన్నీ బద్దలు కొట్టే సత్తా వుందని చూపెట్టినా.... ఆ జోన్‌లోకి వెళ్లడానికి దర్శకులు ఉత్సాహపడడం లేదు. నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. నటులు తీరిక చేసుకోవడం లేదు.

దీంతో బాహుబలి, ఈగ, మగధీరలని మినహాయిస్తే గత పదేళ్లలో తెలుగు సినిమా సాధించిన ప్రగతి కనిపించడం లేదు. హైప్‌ పెంచుకుని త్వరగా క్యాష్‌ దండుకునే ట్రిక్కులు కనిపెట్టారు కానీ ధైర్యానికి, ప్రయత్నానికి, కష్టానికి ఎన్నో ఇంతల ఫలితం వుంటుందని, అపర కీర్తి లభిస్తుందని తెలిసినప్పటికీ అటుకేసి చూడ్డానికి సైతం ఇష్టపడడం లేదు.

ప్రయోగాలు అయిదు కోట్ల లోపు బడ్జెట్‌కే పరిమితం అవుతూ వుండగా, మధ్యమ శ్రేణి సినిమాలు సోకాల్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి, ఎగువ తరగతి సినిమాలేమో సోకాల్డ్‌ కమర్షియల్‌ ఫార్ములాకి కట్టుబడి సాగిపోతున్నాయి. రెండు వేల పదిహేడులో తెలుగు సినిమాకి సంబంధించి విప్లవాత్మక మార్పులేమీ రాలేదు. రాబోయే సినిమాల జాబితా చూస్తే అవి ఇప్పట్లో వచ్చే సూచనలూ లేవు. 'బాహుబలి' పుణ్యమా అని తెలుగు సినిమా శిఖరాగ్రాన్ని చూసింది కానీ, తర్వాత మాత్రం ఎప్పటిలానే నేల మీద, నేల విడిచి సాము చేసుకుంటూనే గడిపేస్తోంది.

భళి భళిరా బాహుబలి!

ఎన్నో అంచనాలు, మరెన్నో కోట్ల రూపాయలు, సమాధానం కోసం చూస్తోన్న 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్నలు... హైప్‌కే హైప్‌ స్పెల్లింగ్‌ నేర్పించిన 'బాహుబలి 2' అన్ని అంచనాలతోను మెప్పించింది. కమర్షియల్‌ సినిమా సూత్రం పట్టిన రాజమౌళి తన కిటుకులకి కిరీటాలు తొడిగి, తన ఆలోచనలకి గ్రాఫిక్స్‌ హంగులు జోడించి, పక్కా ఫార్ములా రివెంజ్‌ ప్లాట్‌కి కోట్ల ఖరీదు చేసే సెట్టింగులు జత చేసి... చేసిన కనికట్టుకి తెలుగు జనతే కాదు యావద్భారతావని కళ్లప్పగించేసింది... కోట్లప్పగించేసింది!

ఒక తెలుగు అనువాద చిత్రం వెళ్లి బాలీవుడ్‌ ఖాన్‌ల సినిమాల చమడాలు ఒలిచేసింది. మీ రాష్ట్రం, మా రాష్ట్రం అని తేడా లేకుండా బాక్సాఫీస్‌కి సామాజిక న్యాయాన్ని చేసేసింది. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన సంచలనాన్ని సమం చేయడానికి బాలీవుడ్‌ చైనా సాయం తీసుకోవాల్సి వచ్చింది.

చిరంజీవే 'నాన్‌-బాహుబలి'!

చరిత్ర చూడని విజయాన్ని అందుకున్న 'బాహుబలి'ని ఇప్పట్లో అందుకోవడం కష్టమని భావించి మిగతా సినిమాలు చిన్నబోకుండా ట్రేడ్‌ ఓ కొత్త పదాన్ని కనిపెట్టింది. మరీ రెండవ స్థానం కోసం పోటీ పడాలా అని నీరసపడిపోకుండా 'నాన్‌-బాహుబలి' అంటూ ఒక కొత్త మెడల్‌ తయారు చేసింది. రాజమౌళి తన ఆలోచనలకి రెక్కలు తొడగని రోజుల్లో తెలుగు సినిమాకి చిరంజీవే బాహుబలి.

చిరంజీవి టెంపరరీ రిటైర్మెంట్‌ తర్వాత ఆ బాహుబలి సింహాసనం చేతులు మారుతూ వచ్చింది. తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి రావడం రావడంతోనే 'నాన్‌-బాహుబలి' మెడల్‌ని మెడలో వేసేసుకున్నారు. బాహుబలి తర్వాత వంద కోట్ల షేర్‌ సాధించిన ఏకైక హీరోగా అవతరించారు. ఇతర రంగాల్లో చిరంజీవి స్టార్‌ అయినా కాకున్నా, తెలుగు సినిమా వరకు తానొక్కడే మెగాస్టార్‌ అని ఖైదీ నంబర్‌ 150తో ఎలుగెత్తి చాటుకున్నారు.

అన్నట్టు బాహుబలి విసిరిన సవాల్‌ని ముందుగా స్వీకరించింది, ఆ తరహా బృహత్తర ప్రయత్నానికి నడుం కడుతున్నదీ చిరంజీవి మాత్రమే. తదుపరి చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' మరో బాహుబలి అవుతుందో లేదో కానీ 'నాన్‌-బాహుబలి'తో సరిపెట్టుకోవడం నచ్చట్లేదని చెప్పకనే చెబుతోన్న తెలుగు హీరో ప్రస్తుతానికి ఆయనొక్కడే!

సాహో శాతకర్ణి!

తన ల్యాండ్‌మార్క్‌ సినిమా గుర్తుండిపోయేది కావాలనే తలంపుతో బాలకృష్ణ చేసిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆయనకి పేరు ప్రఖ్యాతులతో పాటు మరచిపోలేని విజయాన్ని కూడా సాధించిపెట్టింది. బాహుబలి మాదిరిగా ప్రేక్షకులకి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించే ఆస్కారమున్న కథావస్తువు ఉన్నప్పటికీ అంత సమయాన్ని, అంత వ్యయాన్ని ఖర్చు కానీయకుండా క్రిష్‌ కానిచ్చేయడంతో సంచలనం కావాల్సిన చిత్రం సంక్రాంతి సంబరాలకి మాత్రం పనికొచ్చింది.

సంక్రాంతికే వచ్చిన 'శతమానం భవతి' పెద్ద పండగ-ఫ్యామిలీ సినిమా... పులిహోర-పరమాన్నం అంతటి సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ అని ఇంకోసారి నిరూపించింది. ఇద్దరు అగ్ర నటుల సినిమాతో పాటుగా విడుదల చేసినప్పటికీ 'శతమానం భవతి' తన షేర్‌ తాను సాధించేసింది. ఇదొచ్చిన మూడు వారాలకి మరో దిల్‌ రాజు సినిమా వచ్చి అదీ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టేసింది. 'నేను లోకల్‌' అంటూ నాని పంచిన వినోదానికి బాక్సాఫీస్‌ నిండిపోయింది.

అబ్బాయ్‌ 'ఘాజీ' అంటూ సముద్ర గర్భంలోని పోరుతో కొత్త అనుభూతినిస్తే, బాబాయ్‌ 'గురు'వుగా బాక్సింగ్‌ రింగ్‌లో పోరీలతో పోరు చేయించి ఆకట్టేసుకున్నాడు. దగ్గుబాటి హీరోల విజయ దరహాసం తర్వాత ఈ ఏడాదికి అక్కినేని వారి తరఫున బోణీ విజయాన్ని చై తన ఖాతాలో వేసుకున్నాడు. 'రారండోయ్‌ వేడుక చేద్దాం' అంటూ కెరీర్‌లో పెద్ద హిట్‌ కొట్టి పర్సనల్‌ రికార్డు సాధించాడు.

రాజ్‌ తరుణ్‌ తన క్రెడిబులిటీని కిట్టు, అంధగాడుతో నిలబెట్టుకోగా, నిఖిల్‌ తననుంచి ఆశించే కొత్తదనాన్ని కేశవతోను అందించి పేరు నిలుపుకున్నాడు. అమీ తుమీతో నవ్వుల విందుని పంచి ఇంద్రగంటి వెర్సటైల్‌ డైరెక్టర్‌గా తన ఇమేజ్‌ కాపాడుకున్నాడు. గత వారమే విడుదలైన 'దువ్వాడ జగన్నాథమ్‌' ఓపెనింగ్స్‌తో అదరగొట్టి అల్లు అర్జున్‌ రేంజ్‌ చూపించాడు.

వాటీజ్‌ దిస్‌ మిస్టర్‌ పవర్‌స్టార్‌?

తెలుగు సినిమా చరిత్రలో యాభై కోట్ల షేర్‌ సాధించిన సినిమాలని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి ఎక్స్‌క్లూజివ్‌ క్లబ్‌లో రెండు ఫ్లాప్‌ సినిమాలని నిలబెట్టిన ఘనత మాత్రం పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌దే. తన క్రేజ్‌కి కొలమానంగా నిలుస్తూ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', 'కాటమరాయుడు' చిత్రాలు అటు హయ్యస్ట్‌ గ్రాసర్స్‌ లిస్టులోను, ఇటు బిగ్గెస్ట్‌ డిజాస్టర్స్‌ లిస్టులోను ఏకకాలంలో చేరిపోయాయి.

దాదాపు అరవై కోట్ల వసూళ్లు సాధించినప్పటికీ ఈ ఏడాది బిగ్గెస్ట్‌ ఫ్లాప్స్‌లో ఒకటిగా మిగిలిన 'కాటమరాయుడు' పవర్‌స్టార్‌ స్టార్‌ పవర్‌కి అద్దం పట్టింది. అదే సమయంలో తన స్టార్‌డమ్‌ని ఆయన ఎంత మిస్‌యూజ్‌ చేస్తున్నాడనేది కూడా చాటి చెప్పింది.

నాగార్జున-కీరవాణి-రాఘవేంద్రరావు-భారవి... ఈ చతుష్టయం నుంచి 'అన్నమయ్య'లాంటి చిరస్మరణీయ చిత్రం వస్తుందని ఆశిస్తే 'ఓం నమో వెంకటేశాయ'లాంటి చారిత్రాత్మక పరాజయం వచ్చి కొన్నవారికి షాకిచ్చింది. సినిమా బాగానే వుంది కానీ ఎందుకో ఈ చిత్రం భక్తజన కోటిని బాక్సాఫీస్‌ వైపు నడిపించలేకపోయింది. మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌కి మిస్టర్‌, సాయి ధరమ్‌ తేజ్‌కి విన్నర్‌ చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

మిస్టర్‌తో శ్రీను వైట్ల డిజాస్టర్ల హ్యాట్రిక్‌తో కెరీర్‌ని ప్రశ్నార్ధకం చేసుకుంటే, మిస్టర్‌ డిపెండబుల్‌ అనిపించుకున్న గోపిచంద్‌ మలినేనికి ఫెయిల్యూర్‌ టేస్ట్‌ చూపించింది విన్నర్‌. ఊపు మీదున్న శర్వానంద్‌కి రాధ స్పీడ్‌ బ్రేకర్‌గా మారగా, పెళ్లిచూపులతో తారాజువ్వలా ఎగసిన విజయ్‌కి ద్వారక 'తారలు' చూపించింది. మంచు ఫ్యామిలీకి ఈసారీ లక్కు కలిసిరాలేదు.

అన్నదమ్ములిద్దరి లక్కున్నోడు, గుంటూరోడు అక్క సినిమాలానే లక్ష్మీబాంబులా పేలిపోయాయి. లేడీస్‌ టైలర్‌కి సీక్వెల్‌ కుట్టిన వంశీకి, ప్లేబాయ్‌ వేషం కట్టిన అవసరాల శ్రీనుకీ పరాజయం షేక్‌హ్యాండిచ్చింది.

నెక్స్‌ట్‌ ఏంటి?

ఎప్పటిలానే వేళ్ల మీద లెక్కపెట్టేటన్ని విజయాలు, వాటికి అయిదంతలు పరాజయాలు చవిచూసిన ఈ ఏడాది ద్వితీయార్ధంలో అయినా సక్సెస్‌ పర్సంటేజ్‌ పెరుగుతుందేమో చూడాలి. అంచనాలు పెంచడానికి, ఆశల నిచ్చెన ఎక్కించడానికి ఆకర్షణీయమైన జాబితానే ఎదురు చూస్తోంది.

స్పైడర్‌, జై లవకుశ, పవన్‌25, పైసా వసూల్‌, రాజుగారి గది2, రాజా ది గ్రేట్‌ తదితర అగ్ర హీరోల సినిమాలతో పాటు నిన్ను కోరి, నేనే రాజు నేనే మంత్రి, జవాన్‌, జయ జానకీ నాయక, గౌతమ్‌ నంద తదితర ప్రామిసింగ్‌ సినిమాలు సెకండ్‌ హాఫ్‌పై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచుతున్నాయి.

- గణేష్‌ రావూరి

Show comments