వర్మ ‘ఎన్టీఆర్ బయోపిక్’కు అన్నీ అపశకునాలే!

నందమూరి తారక రామారావు అంటే తెలుగుజాతి గౌరవించుకునే వ్యక్తి. ఒక వ్యక్తి ఉత్థాన పతనాలకు, జీవితంలో ఉండగల అన్నిరకాల పార్శ్వాలకు ఎన్టీఆర్ జీవితం ప్రబల తార్కాణం. ఎన్నో మలుపులు పుష్కలంగా ఉండే ఆయన జీవితాన్ని తెరకెక్కించడం, దాన్ని వెండితెర వేదికగా మళ్లీ ప్రజలకు సమగ్రంగా చెప్పాలనే ప్రయత్నం.. ఎవ్వరికైనా సాహసమే అవుతుంది. అయితే నందమూరి బాలకృష్ణ అలాంటి సాహసానికి పూనుకున్నారు.

వంద చిత్రాలు పూర్తి చేసిన సందర్భంలో తాను, ఎన్టీఆర్ బయోపిక్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఎన్టీఆర్ పాత్రను తానే చేయబోతున్నట్లు కూడా ప్రకటించేశాడు. దానికి సంబంధించిన ఎన్టీఆర్ జీవిత విశేషాలను పూసగుచ్చి కథకు అవసరమైన ఇన్‌పుట్స్ తయారు చేయడానికి, ఎన్టీఆర్ కు సన్నిహితంగా మెలిగిన కొందరితో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసేశారు బాలకృష్ణ. అయితే ఆ చిత్రం ఎవరి దర్శకత్వంలో రూపొందబోతున్నదనే సంగతి మాత్రం ఆయన నోటమ్మట బయటకు రాలేదు.

ఈ చిత్రానికి చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. భావోద్వేగ చిత్రాలను ఎమోషన్ చెడకుండా తెరకెక్కిస్తాడనే పేరున్న చంద్రసిద్ధార్థ్ ఈ చిత్రం చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అలాగే కొత్త దర్శకుడికి అప్పగించే ఆలోచనా ఉన్నదన్నట్లుగా పుకార్లు వచ్చాయి. రాంగోపాల్ వర్మ కూడా తన శిష్యుడైన పూరిజగన్నాధ్ ద్వారా ప్రపోజల్ పంపి, ఎన్టీఆర్ బయోపిక్ ను తాను చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్టు కూడా పుకార్లువచ్చాయి.

అయితే స్వయంగా బాలకృష్ణ నోటినుంచి ప్రకటన వస్తే తప్ప.. దేనినీ అధికారికంగా పరిగణించడానికి వీల్లేని పరిస్థితి. అయితే.. రాంగోపాల్ వర్మ మాత్రం.. తాను బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ చేయబోతున్నట్లుగా ప్రకటించేసి... టాలీవుడ్ లో ఒక కొత్త సంచలనానికి తెరతీశారు. అయితే రోజు గడిచేసరికెల్లా.. వర్మ ప్రకటనకు, తద్వారా ప్రపోజల్ కు అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి.

వర్మ చేసిన ఇటీవలి చిత్రాలన్నీ ఘోరంగా దెబ్బతినడం ఒక ఎత్తు. జయాపజయాల విషయం ఒక్కటే కాకపోయినా... ఇటీవలి కాలంలో ఆయన చేసిన అనేక చిత్రాలు... డైరక్షన్ అనే క్రాఫ్ట్ మీద ఆయనకున్న అపారమైన పట్టు (ప్యాషన్) సన్నగిల్లిపోయిందేమో అనే అనుమానాల్ని కూడా అందరిలో కలిగించాయి. ఇలాంటి నేపథ్యంలో తెలుగుజాతికే అపురూపమైన ఎన్టీఆర్ బయోపిక్ లాంటి కథను వర్మ తాను చేయబోతున్నానని ప్రకటించినప్పుడు అందరిలో సంచలనం పుట్టడం సహజమే!

అయితే వర్మ ప్రపోజల్ కు తొలిరోజు నుంచి అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ను అద్భుతంగా స్తుతిస్తూ వర్మ ఒక చిన్న ప్రసంగాన్ని , ఒక పెద్ద పాటను విడుదల చేశారు. దీనికి పెద్ద పాజిటివ్ స్పందన ఎక్కడా లభించలేదు. దీనిద్వారా వర్మ చేయబోతున్నాడనే సంగతి తెలిసి ఆశ్చర్యపోయినవారే ఎక్కువ. 
అయితే ఎన్టీఆర్ చివరిదశలో ఆయన భార్య లక్ష్మీపార్వతి, వర్మ ప్రతిపాదనపై చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. వర్మ ఆ చిత్రానికి న్యాయం చేయలేరని అన్నారు.

ఆమె ఒక్కటే కాదు.. సోషల్ మీడియాలో కూడా ‘ఇలాంటి చిత్రం చేయడం రామూ వల్ల కాదనే’లా చాలా పోస్టింగుల్ హల్చల్ చేశాయి. చాలా టీవీ ఛానళ్లు... రాంగోపాల్ వర్మ , ఎన్టీఆర్ బయోపిక్ కు న్యాయం చేయడం అసాధ్యం అంటూ ప్రత్యేక బులెటిన్లను ప్రసారం చేశాయి. వంగవీటి మోహన రంగాను మించిన కథ తన జీవితంలోనే తనకు ఎదురుకాలేదనే ప్రకటనలతో అప్పట్లో ఆ చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ.. దాన్ని ఎంత పేలవంగా భ్రష్టు పట్టించాడో.. అలాంటి దర్శకుడి చేతుల్లో పడి ఎన్టీఆర్ జీవితం ఎంత భ్రష్టు పట్టిపోతుందో అని టీవీ ఛానెళ్లు అనుమానాలు వ్యక్తం చేశాయి.

మరో వైపు నందమూరి ఫ్యాన్స్ అందరికీ రాంగోపాల్ వర్మ ప్రకటన పెద్ద షాక్ అనే చెప్పాలి. రామూ చేతిలో ఈ చిత్రం బతుకు ఎలా తెల్లారుతుందోనని అంతా అసంతృప్తికి గురవుతున్న వారే! ఒక దర్శకుడు ఈ చిత్రాన్ని చేస్తున్నాడంటే.. ఫ్యాన్స్ లో కొందరికైనా ‘సూటబుల్ దర్శకుడే’ అనే భావన కలగాలి. కానీ వర్మ ప్రకటన చూడగానే.. ‘ఇక సినిమా నాశనమైనట్లే’ అని ఫ్యాన్స్ అందరిలో ఒక ఆందోళన మొదలైందంటే.. అతిశయోక్తి కాదు.

అయితే బాలకృష్ణ స్వయంగా ప్రకటన చేసేదాకా ఏదీ ఫైనలైజ్ అయినట్లు కాదు! బాలయ్యతో భేటీ కావడానికి వర్మ ప్రయత్నిస్తున్నారు. అయితే తానుగా బయోపిక్ విషయంలో ప్రకటన చేసేముందు.. ఫ్యాన్స్ లోను, జనాభిప్రాయంలోను వెల్లువెత్తుతున్న అపశకునాలను, సంకేతాలను ఆయన పట్టించుకుంటారో లేదో చూడాలి.

Show comments