ప్రచారం ఆమెది... పని వేరేవాళ్లది...!

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధిస్తే అది తనవల్లనే సాధ్యమైందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే కమ్‌ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పకోగలదా? తన తండ్రి స్థానాన్ని తాను తిరిగి సాధించానని ప్రచారం చేసుకోగలదా? ఉపఎన్నిక వ్యూహాల్లో, ఇతరత్రా పనుల్లో తాను కీలకపాత్ర పోషించానని గొప్పగా చెప్పగలదా?.. ఈ ప్రశ్నలకు ఒకే సమాధానం 'ఆమెకు అంత సీన్‌ లేదు' అని. నంద్యాల ఆమె తండ్రి నియోజకవర్గం. అక్కడ టీడీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆమెది. ఆమె కీలకపాత్ర పోషించకుండా ఎలా ఉంటుంది? అని సామాన్యులు అనుకోవచ్చు. కాని టీడీపీ అధినేత చంద్రబాబు అనుకోలేదు. అందుకే అక్కడ వ్యూహరచన, ఎన్నికకు సంబంధించిన అన్ని పనుల బాధ్యత 'నాన్‌ లోకల్స్‌'కు అప్పగించారు. అంటే స్థానికేతరులన్నమాట. ఎవరు వీరు? ప్రధాన బాధ్యత అంటే వ్యూహరచన, ఆర్థిక వ్యవహారాలు మొదలైనవి మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణకు అప్పగించారు. ఇతర పనులు కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు చూసుకుంటున్నారు. వీరు కాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులూ ఉన్నారనుకోండి. మరి ఇంతకూ మంత్రి అఖిలప్రియ ఏం చేస్తుంది? 

ఆమె కేవలం ప్రచారం చేస్తుంది. ముఖ్యంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్ధించాలని అధిష్టానం చెప్పింది. ఇతర వ్యవహారాల్లో ఆమె వేలు పెట్టేందుకు అవకాశంలేదు. ఇందుకు కారణాలేమిటి? నంద్యాల గ్రూపు రాజకీయాలు, తగాదాలు పెద్ద తలనొప్పిగా ఉన్నాయి. అఖిలప్రియకు అక్కడి కొందరు నాయకులతో పడదు. ఇదీకాకుండా మంత్రిగా ఆమె ట్రాక్‌ రికార్డు గొప్పగాలేదు. కొన్ని ఆరోపణలూ ఉన్నాయి. ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి కొద్దోగొప్పో విజయావకాశాలుంటే అవీ మటాస్‌ అవుతాయని అధిష్టానం భయపడింది. ఆమెకు నాయకత్వ లక్షణాలు లేకపోవడం ప్రధానలోపం. ఆమెవల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం టీడీపీ నాయకుల్లో ఉందట...!  తల్లి మరణం కారణంగా ఎమ్మెల్యే అయిన అఖిల, తండ్రి మరణంతో మంత్రి అయింది. అంటే ఆమె ప్రమేయం ఏమీ లేకుండానే కొద్ది కాలంలోనే ఎదిగిపోయింది. కాని ఇదంతా తన ప్రతిభేనని భ్రమిస్తున్న అఖిల సీనియర్‌ టీడీపీ నాయకులను సైతం ఖాతరు చేయడంలేదట...! తండ్రికి సన్నిహితులైన తలపండిన నేతలను పక్కకు పెట్టింది. చాలామందితో సత్సంబంధాలు లేవని సమాచారం. సీనియర్లను గౌరవించకపోవడమే కాకుండా ఏకవచనంతో పిలుస్తుందనే ఆరోపణలున్నాయి. మంత్రిగా పనితీరు బాగాలేదని, బాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కొందరు నాయకులు చెబుతున్నారు.

ఇలా పలు కారణాలతో అఖిలప్రియపై కోపంగా ఉన్న టీడీపీ నాయకులు పార్టీ ఓటమికి పనిచేసే అవకాశముందని బాబు భావించారేమో. అందుకే ప్రచారానికే పరిమితం చేశారు. ఎన్నికల బాధ్యత తీసుకున్న మంత్రులు అఖిలప్రియకు పడనివారి సహకారంతోనే పనులు చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని అఖిలప్రియ టీడీపీలో ఒంటరి అయిందని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. కేవలం భూమా నాగిరెడ్డి మరణించిన కారణంగానే ఆమెకు మంత్రిపదవి ఇచ్చారు తప్ప పార్టీలో ప్రాధాన్యం లేదంటున్నారు. ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోతే తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని ఈమె భీష్మ ప్రతిజ్ఞ చేసింది. కాని ఆమెకు అంత సీన్‌ లేదు. టీడీపీ ఓడిపోయినా ఆమె అందుకు బాధ్యత వహించాల్సిన అవసరంలేదు. ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించలేదు కాబట్టి ఆ బాధ్యత సీఎం చంద్రబాబు, మంత్రులు తీసుకోవాల్సిందే. 

Show comments