టీడీపీ సంబరాలు: కొంచెం ఆలోచించుకోవాలేమో!

ఫిరాయింపుదారులపై చర్యల విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు మూడు నెలల లాంగ్ టైమ్ ను ఇచ్చింది హైకోర్టు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ తెదేపా నేత రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై ఈ తరహా స్పందన రాగానే.. తెలుగుదేశం నేతలు సంబరాలు చేసుకున్నారు! ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద పటాసులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు!

ఇది చెడుపై మంచి విజయం అన్నట్టుగా తెలుగుదేశం నేతలు ఇస్తున్న బిల్డప్పులు చూస్తుంటే మానవమాత్రులు ఆశ్చర్యపోగలరు! ఒకవైపు ఏపీలో వైకాపా తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు వేసుకుంటూ పండగ చేస్తున్న పార్టీనేనా.. ఫిరాయింపుల విషయంలో కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నది? అనేది అంత ఈజీగా నమ్మలేం! ఇలాంటి డబుల్ డ్రామాలు తెలుగుదేశం పార్టీకి చాలా ఈజీ అయిపోయాయి!

అయినా.. తెలంగాణ లో ఫిరాయింపుదారుల విషయంలో అంతో ఇంతో  ఘాటైన తీర్పు రావడం తెలుగుదేశం పార్టీ కన్నా, ప్రజాస్వామ్యానికి ఆనందాన్ని ఇచ్చే అంశం. కానీ.. తెలుగు తమ్ముళ్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఈ సంబరాలు మరీ ఎక్కువై పోకూడదు అని!

ఒకవేళ తెలంగాణలో ఫిరాయింపుదారుల విషయంలో రానున్న మూడు నెలల్లో ఏదో ఒకటి తేలిందని అనుకుందాం. తెలుగుదేశం తరపున గెలిచి తెరాసలో చేరిన వారందరిపైనా అనర్హత వేటు పడిందనే అనుకుందాం! ఇక్కడ ఎన్నికలు వస్తాయి. కానీ అంతకన్నా గండం ఏమిటంటే… అనర్హత వేటు పడటం మొదలైతే అది తెలంగాణతోనే ఆగిపోకపోవచ్చు! పక్క రాష్ట్రం.. ఉమ్మడి హై కోర్టు.. ఈ తీర్పు ప్రభావం, ఏపీలోని ఫిరాయింపుదారులపై పడితే? అప్పుడు టెన్షన్ మళ్లీ తమ్ముళ్లకే!

తెలంగాణలో మాత్రం ఫిరాయింపుదారులపై వేటు పడిపోవాలి.. ఎన్నికలు రావాలి. ఏపీలో మాత్రం ఫిరాయింపుదారులను తెలుగుదేశం ప్రభుత్వం కాపాడుకొంటూ వస్తుంది. తెలంగాణ స్పీకర్ నేమో ఇష్టానుసారం తిడతారు.. ఏపీ లో తెలుగుదేశం పార్టీకి చెందిన స్పీకరేమో ఫిరాయింపు రాజకీయాలకు కాటి కాపరిలా వ్యవహరిస్తాడు. రాజకీయాల్లో ద్వంద్వ నీతిని పాటించే వాళ్లుంటారని అంటుంటారంతా.. కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా పచ్చిగా ప్రజలకు రాజకీయాల్లోని నైచ్యాన్ని అర్థం అయ్యేలా చేస్తోంది.

Show comments