టీడీపీ.. ఈ డ్రామాలు ఎవరిని మోసం చేయడానికో!

రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవహారంలో కూడా అనుకూల మీడియాతో ఆఫ్ ది రికార్డ్ వార్తలు రాయించుకుని సంతృప్తి పడుతోంది తెలుగుదేశం పార్టీ. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరును బాబు నిరసించాడని.. పచ్చ పత్రికలు చెబుతోంటే తెలుస్తోంది. బాబుకు రక్తం మరిగిన విధానం పచ్చపత్రికలు వర్ణించి చెబితే తప్ప అర్థం కాలేదు! మీడియా ముందుకు బాబు రాలేదని కాదు.. అక్కడేమో బాబు చాలా కూల్ గా మాట్లాడారు. పార్టీ నేతల వద్ద మాత్రం బాబు రెచ్చిపోయారట!

మరి ముప్పై ఏళ్ల అనుభవజ్ఞుడు.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను కలిగిన వ్యక్తి, ప్రపంచంలోని వివిధ దేశాధి నేతలకు సన్నిహితుడు.. తనఖ్యాతిని ప్రపంచమంతా విస్తరించుకున్న వ్యక్తి.. పదమూడు జిల్లాలకు ప్రధానమంత్రి లాంటి నేత.. శ్రీమాన్ చంద్రబాబు నాయుడు తన భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్త పరుచుకులేని అశక్తుడని అర్థం చేసుకోవాలా? పచ్చ పేపర్ల రాతలను చూస్తుంటే ఈ అభిప్రాయమే కలుగుతోంది.

రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ హడావుడి ఇలా ఉంటే.. ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు ధర్నా షురూ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా  కావాలని అంటూ వీరు లోక్ సభ ఆవరణ ఈ ధర్నాను మొదలుపెట్టారు. నినాదాలు చేస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరి ప్రజలను మోసం చేయడానికి కాకపోతే.. ఈ పనులు ఎందుకు చేస్తున్నట్టు? ధర్నాకు దిగితే.. నినాదాలు చేస్తే.. ప్రత్యేక హోదా వస్తుందా? లేక ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ ఈ ధర్నాలు చేస్తారా? ప్రత్యేక హోదా అంశంపై జనాలు వేడి మీద ఉన్నారు, ఇప్పుడు వారిని సంతృప్తి పరచడానికి, తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా గురించి పోరాడుతోంది.. చూడండి.. అని చెప్పుకోవడానికి ఈ డ్రామాలు తప్ప వీటి లక్ష్యం  మరోటి కాదని వేరే చెప్పనక్కర్లేదు.

నిజంగానే ప్రత్యేక హోదా అంశంపై బాబుకు చిత్తశుద్ధి ఉంటే.. మీడియా ముందే.. కేంద్రాన్ని కడిగేసేవాడు. ప్రత్యేక హోదా అంశం గురించి కేంద్రంపై ఒత్తిడి చేయడానికి.. తమ మంత్రుల చేత రాజీనామాలు ఇప్పించే వాడు. ఎన్డీయే నుంచి వైదొలుగుతామని హెచ్చరించేవాడు. లోక్ సభలో కాకపోయినా.. రాజ్యసభ లో మిత్రుల అవసరం ఉన్న  బీజేపీ బాబు బెదిరింపులకు కచ్చితంగా భయపడేది. జీఎస్టీ బిల్లును గట్టెక్కించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్న బీజేపీ పెద్దలు.. ఇలాంటి సమయంలో బాబును ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేరు. దీంతో బాబు హెచ్చరికలకు ఫలితం ఉండేది.

అయితే హెచ్చరించే ధైర్యం మాత్రం తెలుగుదేశం అధినేతలో  ఏ కోశానా కనిపించడం లేదు. కనీసం ఈ విషయంలో ప్రధానమంత్రిని గట్టిగా అడిగే ధైర్యం కూడా లేదాయనకు. తను పీఎంను కలవలను, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లను.. అనే విషయాలను కుండబద్ధలు కొట్టినట్టుగా  చెబుతున్న తెలుగుదేశం అధినేత.. తనంటే ఏమిటో అందరికీ అర్థం అయ్యేలా చేస్తున్నాడు. ఇన్ని తెలిసిన బాబు తమ పార్టీ ఎంపీల ధర్నాను చూసి జనాలు నవ్వుకుంటారని.. దీన్ని కూడా ప్రజలు ఒక డ్రామా గా భావిస్తారని తెలుసుకోలేకపోతున్నారా?

Show comments