మేనిఫెస్టో రుచి చూపించిన యువనేత...!

దేశంలోని ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనబడుతోంది. అన్ని పార్టీల నాయకులు ఎన్నికల మాటలే మాట్లాడుతున్నారు. పార్టీల అధినేతలు తమ నాయకులను అప్రమత్తం చేస్తున్నారు. అనేక జాగ్రత్తలు చెబుతున్నారు. జనంలోకి వెళ్లాలని గట్టిగా ఆదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో జరిగిన వైఎస్సార్‌సీపీ రెండు రోజుల ప్లీనరీలో అధినేత వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారానికి తెర తీశారు.

అప్పుడే ఎన్నికల ప్రచారమా? అని కొందరు ఆశ్చర్యపోవచ్చు. కాలం మారిపోయింది. ఎన్నిలకు ఇంకా సమయముందికదా అని మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ కూర్చుంటే ఎదుటివారు ఒక అడుగు ముందుకేయవచ్చు. ఆ అవకాశం వారికెందుకివ్వాలి అనుకున్నారేమో జగన్‌. అందుకే అధికారంలోకి వస్తే తానేం చేయబోతాడో ప్రకటించారు. తన పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండబోతున్నదో రుచి చూపించారు.

ఇది పూర్తిస్థాయి వంటకం కాదు. కాని తాను అధికారంలోకి వస్తే రుచిగా, శుచిగా భోజనం పెడతానని, 'సంక్షేమం' మసాలా దట్టించిన కూరలు మహా రుచిగా ఉంటాయని జగన్‌ నమూనాగా కొన్ని చెప్పారు. సంక్షేమం అంటే ఏమిటి? ఎవరైనా మొదట చెప్పేది పెన్షన్ల గురించే. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వగైరాలకు పెన్షన్లు ఇవ్వడం. అవిస్తే  ప్రజల జీవితాలు సగం మేరకు బాగుపడినట్లేనని నాయకుల భావన.

జగన్‌ కూడా సంక్షేమంలో పెన్షన్ల గురించి చెప్పారు. తాను అధికారంలోకి వస్తే నెలకు రెండువేల రూపాయల పెన్షన్‌ ఇస్తానన్నారు. డ్వాక్రా మహిళలకు నాలుగు విడతలుగా ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలను బడులకు పంపే కుటుంబాలకు నెలకు 500 ఇస్తామన్నారు. దీని తరువాత చదువు చెప్పించే కుటుంబాలకు 750 రూపాయలు ఇస్తామన్నారు.

ప్రతి పేదవాడికీ ఇల్లు కట్టిస్తామన్నారు. ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న చిన్నసన్నకారు రైతులకు 50 వేల ఆర్థికసాయం చేస్తామన్నారు. వారికి ప్రతి ఏటా మే నెలలో 12,500 ఇస్తామన్నారు. 'వైఎస్‌ఆర్‌ భరోసా' పథకం అమలు చేస్తామన్నారు. ఈ పథకాన్ని ఎంతమందికి వర్తింపచేస్తారో, ఎంత ఖర్చవుతుందో కూడా జగన్‌ చెప్పేశారు. వైఎస్సార్‌ భరోసా పథకాన్ని 66 లక్షల మంది రైతులకు అమలు చేస్తారు. ఇందుకోసం 33 వేల కోట్లు ఖర్చు చేస్తారు. రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామన్నారు. ఇదండీ మానిఫెస్టోలోని కొన్ని ఐటమ్స్‌.

జగన్‌ అధికారంలోకి వస్తే ఏం చేయగలడు? అని ప్రశ్నించుకుంటున్న ప్రజలకు తానేం చేయగలనో చెప్పారు. దీన్నిబట్టి జనం ఇప్పటినుంచే ఆలోచించడం మొదలుపెడతారు. ముందుముందు ఇంకా అనేక అంశాలు చెబుతారు. వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల చాలాకాలం తరువాత పబ్లిగ్గా మాట్లాడటం ప్లీనరీలో విశేషం. షర్మిల ఘాటుగానే మాట్లాడింది. ఇక..పాదయాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని జగన్‌ అనుకున్నారు. పాదయాత్ర ద్వారానే తండ్రి వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యారు.

గత ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత పాదయాత్ర చేశారు. జగన్‌ సోదరి షర్మిల పాదయాత్ర చేసింది. ఆమె పాదయాత్ర ద్వారా పార్టీ అధికారంలోకి రాలేకపోయినా  పార్టీ ఉనికిని కాపాడింది. ఆమె ఆడకూతురైనా సత్తా చాటుకుందని చాలామంది ప్రశంసించారు. పాదయాత్రలో రికార్డు సృష్టించింది. దేశంలో కొమ్ములు తిరిగిన ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు. టెక్నాలజీ ఎంతగా పెరిగినా కొన్ని సెంటిమెంట్లు, సంప్రదాయాలు వదులుకోవడం సాధ్యం కావడంలేదు. అలాంటివాటిల్లో పాదయాత్ర ఒకటి. జగన్‌ పాదయాత్రకు బాబు సర్కారు అనుమతి ఇస్తుందా?

Show comments