సరదాకి: ఓ స్త్రీ రేపు రా.!

ఎద్దు ఈనింది.. అనగానే, దూడని కట్టేయండిరా.. అన్నాడట వెనకటికి ఒకడు. అసలక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. అంతకు మించి, అక్కడ ఏమీ జరుగుతున్న వాతావరణమైతే లేదు. అయినా, అక్కడ ఏదో జరిగిపోతోందంటూ లీకేజీలు.! అసలు ఈ లీకేజీల్ని ఎవరైనా పుట్టినస్తున్నారా.? ప్రజల మూడ్‌ని తెలుసుకునేందుకు ప్రభుత్వంలో వున్నవారే ఈ మహా నాటకానికి తెరలేపారా.? అన్న ప్రశ్నలకు సమాధానమైతే దొరకడంలేదు. 

'ప్రత్యేక హోదా లేదు.. ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకోవాల్సిందే.. అయితే అది ప్రత్యేక హోదాకి మించి వుంటుంది..' అంటూ నిన్న సాయంత్రం నుంచీ పెద్ద రచ్చే జరుగుతూ వచ్చింది. వాస్తవానికి ఇదేమీ పాత విషయం కాదు. గడచిన రెండేళ్ళుగా నడుస్తున్న నాటకమే. ఏపీలో చంద్రబాబు గర్జిస్తారు.. ఢిల్లీకి వెళ్ళి పిల్లి కూతలు పెడతారు. ఇంట్లో పుల్లి.. వీధిలో పిల్లి.. అంటే ఇదే మరి.! ఆంధ్రప్రదేశ్‌లో వున్నప్పుడే చంద్రబాబుకి రక్తం మరిగిపోతుంటుంది. ఢిల్లీకి వెళితే మాత్రం, కుక్కిన పేనులా పడి వుండాల్సిందే. 

అత్యంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలూ వున్నారు. రాజకీయ జీవితంలో అత్యంత దారుణమైన ఫేజ్‌లో చంద్రబాబు వున్నారుగానీ, ఆయనకు ఆ విషయమే అర్థం కావడంలేదు. చంద్రబాబేంటీ, ఈ స్థాయిలో కేంద్రం వద్ద దేబిరించడమేంటని జనం అనుకుంటున్నారు తప్ప, ఆయనేమీ అలా ఫీల్‌ అవకపోవడం ఆశ్చర్యకరమే. 

ఇక, షరా మామూలుగానే కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ రాజకీయ రచ్చను చల్లార్చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక సహాయంపై చర్చలు జరుగుతున్నాయని పాత పాటే పాడారు. వెనకటికి, ఒకడు ఇంట్లో ఫుల్లుగా నిద్రేసేశాడు.. ఏం చేస్తున్నాడయ్యా.? అని వాకబు చేస్తే, అయ్యగారు 'మీ పని మీదే వున్నారు..' అంటూ ఇంట్లోంచి ఆయనగారి పరివారం సమాధానమిస్తుంటుంది. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం చర్చిస్తోన్న తీరు కూడా ఇలానే వుంది.  Readmore!

కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ని ఎంత హీనంగా చూస్తోందో అందరికీ అర్థమవుతున్నా చంద్రబాబుకీ, ఆయన భజనలో మునిగి తేలే పచ్చ మీడియాకీ అర్థం కావడంలేదు. చంద్రబాబు చిన్న కూత పెడితే చాలు, అది నిద్ర తాలూకు గురక అయినాసరే, గర్జించినట్లే పచ్చ మీడియాకి కన్పిస్తోంది. కేంద్రం నుంచి ఏ సంకేతాలూ లేకపోయినా, అక్కడ పరిస్థితులు అందరికీ అర్థమవుతున్నా.. వక్రీకరించేయడంలో పచ్చ మీడియా పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. 

దెయ్యం భయంతో పల్లెటూళ్ళలో 'ఓ స్త్రీ రేపు రా..' అని రాసుకుంటుంటారు తమ ఇళ్ళ తలుపుల మీద, గోడల మీద. రోజూ అప్పు కోసం వచ్చేవాడి మొహమ్మీద చెప్పలేక, 'అప్పు రేపు..' అని రాస్తుంటారు కొందరు తెలివైన వ్యాపారులు. ఆంధ్రప్రదేశ్‌కి సాయం విషయంలోనూ 'రేపు' అని ప్రతిరోజూ అనుకోవాలేమో.! 

ఈ తంతు అంతా చూస్తోంటే, అసలు ఆంధ్రప్రదేశ్‌ అనే రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమేనా.? అన్న అనుమానాలు కలగక మానవు. ప్రతిరోజూ 'రేపు' అన్న మాట వింటోంటే, ప్రతిసారీ చంద్రబాబుని కేంద్రం వెర్రి వెంగళప్పని చేస్తోంటే, ఆయనకీ రక్తం మరిగిపోవడంలేదు.. ఆయన భజనలో మునిగి తేలే పచ్చ మీడియాకీ రక్తం మరిగిపోవడంలేదు. 'చేవచచ్చిన' అన్న పదానికి పెర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ఇంకేమన్నా కావాలా.?

Show comments