నాయకురాలైంది సరే...వారసురాలవుతుందా?

తమిళనాడులో దివంగత జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల కమిషన్‌ ఉప ఎన్నిక తేదీ ప్రకటించగానే పార్టీలు అప్రమత్తమయ్యాయి. అన్ని శక్తులు కూడదీసుకొని సంసిద్ధమవుతున్నాయి. నిజానికి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం పోటీలో ఉన్న పార్టీలు రెండే. ఒకటి అధికార అన్నాడీఎంకే (శశికళ వర్గం). శశికళ వర్గం అధికారంలో ఉంది కాబట్టి అదే అసలైన అన్నాడీఎంకేగా పరిగణిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో పన్నీరుశెల్వం వర్గం అభ్యర్థి  స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాల్సిరావొచ్చు. గెలిస్తే తమదే అసలైన అన్నాడీఎంకే అని ప్రకటించుకునే అవకాశముంది. అయినప్పటికీ ఈ విషయం ఎన్నికల కమిషన్‌ తేల్చాల్సివుంటుంది. ఇక రంగంలో ఉన్న మరో పార్టీ డీఎంకే. మరొకటి ఊహించిన విషయమే అయినా ఆసక్తికరమైంది జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటం. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి తెర మీదికి వచ్చిన దీప తాను జయలలిత మేనకోడలినని, అత్త  ఆస్తిపాస్తులకు, రాజకీయానికి నిజమైన వారసురాలినని ప్రకటించుకుంది. అప్పటివరకు ఇంటికే పరిమితమైన దీప ఒక్కసారిగా వారసత్వం ఎలా ప్రకటించుకుందో...!

ఏ ధైర్యంతో ఆ పని చేసిందోగాని అత్త చనిపోగానే ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలో తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని ప్రకటించింది. అన్నట్లుగానే ఉప ఎన్నిక తేదీ ప్రకటించగానే పోటీ చేస్తున్న విషయం తెలియచేసింది. జయ చనిపోగానే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని దీప ప్రకటించగానే అన్నాడీఎంకేలోని శశికళ వ్యతిరేకులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు.  జయ మరణం వెనక అనుమానాలున్నాయని, దీని వెనక నిజాలను వెలికి తీసేందుకు తాను పోరాటం చేస్తానని చెప్పడంతో శశికళ వ్యతిరేకవర్గానికి ఓ నాయకురాలు దొరికినట్లయింది. దీప 'అమ్మ' జయలలిత పోలికల్లో ఉండటం, ఆమె రక్త సంబంధీకురాలు కావడంతో శశికళపై పోరాటం చేయడానికి ఆలంబన దొరికినట్లయింది. దీపకు క్రమంగా ప్రాచుర్యం పెరుగుతున్నట్లు మీడియాలో కథనాలొచ్చాయి. 'దీప పెరవై' పేరుతో అభిమాన సంఘం కూడా ఏర్పాటైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి దీప ఇంటికి ప్రతి రోజు తండోపపండాలుగా జనం తరలివచ్చారు. ఆమె పేరుతో  ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శశికళను వ్యతిరేకించే మీడియా దీపకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో జయ చనిపోయినప్పటినుంచి భీకరమైన హైడ్రామా జరిగి రాజకీయ సంక్షోభం సద్దుమణిగేదాకా దీప పేరు మారుమోగిపోయింది. ఒక దశలో శశికళకు సమవుజ్జీ దీప అనే అభిప్రాయం కొందరు నాయకులు వ్యక్తం చేశారు.

మేనత్త జన్మదినమైన ఫిబ్రవరి 24న రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అని అట్టహాసంగా ప్రకటించిన ఈమె చివరకు అంత సాహసం చేయలేక 'ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవై' పేరుతో రాజకీయ వేదిక (ఫోరమ్‌) పెట్టి చేతులు దులుపుకుంది. ఈమెకు పార్టీ లేదు కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సిందే. దీప విడిగా రాజకీయం చేయడం పన్నీరుశ్వెంకు ఇస్టం లేదు. ఆమెను తమ వర్గంలో కలవమని కోరారు. కాని ఆమె అంగీకరించలేదు. దీప, పన్నీరు శెల్వం వర్గం అభ్యర్థి రంగంలో ఉండటంతో ఓట్లు చీలిపోయి డీఎంకే లాభపడుతుందని ఆ పార్టీ నాయకులు ఊహిస్తున్నారు. ఆర్‌కు నగర్‌ ప్రజల్లో దీప పట్ల సానుకూలత ఉంది. ఇందుకున్న కారణం ఆమె జయలలిత వారసురాలని, ఆమె పోలికల్లో ఉంటుందని.

ఇక్కడ శశికళ పట్ల వ్యతిరేకత ఉన్నందున దీపను ఆదరిస్తారని ఒక అంచనా. ఒకవేళ దీప గెలిస్తే మాత్రం అదో సంచలనమవుతుంది. పన్నీరుశెల్వం వర్గం అభ్యర్థిగా ప్రిసీడియం ఛైర్మన్‌ ఇ.మధుసూదన్‌ను నిలబెట్టవచ్చని అనుకుంటున్నారు. శశికళ వర్గం నుంచి ఆమె అక్క కుమారుడు, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్‌ ఆశలు పెట్టుకున్నట్లుగా సమాచారం. పార్లమెంటరీ బోర్డులో శశికళ ఏం నిర్ణయిస్తుందో చూడాలి. ఆర్‌కే నగర్‌ నుంచి జయలలిత రెండుసార్లు గెలిచారు. 2015లో లక్షన్నర ఓట్ల మెజారిటీతో విజయం (ఉప ఎన్నిక) సాధించగా, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 39 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్కడ జయలలితకే ఆదరణ తగ్గిన నేపథ్యంలో ప్రస్తుత ఉప ఎన్నికలో ఎవరిని ఆదరిస్తారో...!

Show comments