ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ చిరపరిచితుడైన హైపర్ ఆది ఒక ఇంటివాడయ్యాడు. కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారంలో మునిగి ఉన్న ఆది, ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, చాలా పరిమిత సంఖ్యలో ఆహ్వానించిన అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
నిజానికి తమ ప్రేమను ఇరు వర్గాలకు చెందిన పెద్దలు అంగీకరించక పోవడంతోనే.. ఆది రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. సన్నిహిత మిత్రులు మినహా అతిథులు ఎవ్వరూ లేకుండా పెళ్లి చేసుకోవడానికి అదే కారణం అని తెలుస్తోంది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి లీక్ కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఈ ఫోటో ఒకటి గ్రేటాంధ్రకు ఎక్స్ క్లూజివ్ గా చిక్కింది.
ఒంగోలు జిల్లాకు చెందిన ఆది చాన్నాళ్లుగా సినిమా టీవీ రంగంలో నటుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం మొదలైన తర్వాత.. ఆదికి హఠాత్తుగా గుర్తింపు వచ్చింది. జబర్దస్త్ లో ఆది వేసే పంచ్ లు అతనికి బుల్లితెర నవ్వుల నటుడిగా మంచి గుర్తింపు ఇచ్చాయి. ఆది బుల్లితెర కార్యక్రమాలు, కామెడీ షోలతోనే క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు.
కొన్నాళ్లుగా ఆది పీకల్లోతు ప్రేమలో పడినట్లుగా తెలుస్తోంది. ఆది ప్రేమించిన అమ్మాయి వివరాలు మాత్రం బయటకు రాలేదు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఇరువర్గాల పెద్దలు మాత్రం అంగీకరించలేదు. దాంతో కనీసం జబర్దస్త్ కార్యక్రమ నిర్వాహకులు, తన టీమ్ లోని సహనటులకు కూడా తెలియకుండా.. పెళ్లి చేసుకున్నట్లుగా అనుకుంటున్నారు. త్వరలోనే టీవీ రంగంలోని ప్రముఖులకు, సహ నటులకు ఆది రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని సన్నిహితుల ద్వారా తెలిసింది.