మురళీమోహనా.. ఈ కామెడీ ఏందయ్యా.!

మురళీమోహన్‌ రాజమండ్రి ఎంపీ.. తెలుగుదేశం పార్టీ నాయకుడు.. తమ మిత్రపక్షాన్ని ప్రత్యేక హోదా విషయంలో ఒప్పించలేక కిందా మీదా పడుతున్న తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలకు చెందిన నేతలు తమతో కలిసొస్తే ఉద్యమిస్తామని చెబుతోంటే ఏమనుకోవాలి.? మినిమమ్‌ కామన్‌సెన్స్‌ కూడా లేకుండా మాట్లాడుతున్న ఇలాంటోళ్ళు ప్రజా ప్రతినిథులవడమే, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దురదృష్టమనుకోవాలేమో.! 

చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ కలిసొస్తే, ప్రధాని నరేంద్రమోడీ వద్దకు వెళ్ళి ప్రత్యేక హోదాపై మాట్లాడతారట. కాస్తంతన్నా ఇంగితం వుండాలి, ఇలాంటి చీప్‌ డైలాగ్స్‌ చెప్పడానికి. ముఖ్యమంత్రి చంద్రబాబుని ఢిల్లీకి తీసుకెళ్ళగలగాలి.. ఢిల్లీకి తీసుకెళ్ళి నరేంద్రమోడీతో ప్రత్యేక హోదా గురించి మాట్లాడించగలగాలి. చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు, ఏం లాభం.? ఉత్త చేతుల్తో తిరిగొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిప్పులు చెరుగుతున్న చంద్రబాబు, ఢిల్లీకి వెళితే చాలు.. బిక్కచచ్చిపోతున్నారంతే. 

'ఆంధ్రప్రదేశ్‌ సమస్య నాది.. కొంచెం సయమం ఇవ్వండి..' అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారట.. టీడీపీ ఎంపీలు అప్పటినుంచి సైలెంటయిపోయారట.. ఈ ఎంపీల బృందంలో మురళీమోహన్‌ కూడా వున్నార్లెండి. ఇప్పటికే 26 నెలల పుణ్యకాలం గడిచిపోయింది. ఇంకా ప్రత్యేక హోదా విషయంలో సమయమేంటో.! టీడీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి స్వయానా ఢిల్లీకి వెళ్ళినా నరేంద్రమోడీ లెక్కచేయట్లేదు. ఛత్‌.. ఇంత దయనీయమైన బతుకా.? మాకీ పదవులు అనవసరం.. అని రాజీనామా చేసి, ప్రధాని నరేంద్రమోడీ మొహాన కొట్టి రావాలి. కానీ, అంత ధైర్యం టీడీపీ నేతలకెక్కడిది.? 

టీడీపీలో మిగతా నేతల సంగతేమోగానీ, మురళీమోహన్‌ మరీ కామెడీ చేసేస్తుంటారు. పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యల్ని ఆహ్వానిస్తున్నారట. 'నరేంద్రమోడీని ప్రశ్నించడానికి భయమెందుకు.?' అని డైరెక్ట్‌గా చంద్రబాబునే పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించారు. 'హిందీ నేర్చుకోండయ్యా..' అంటూ మురళీమోహన్‌ సహా పలువురు టీడీపీ ఎంపీలకే క్లాస్‌ తీసుకున్నారు. 'పార్లమెంటరీ సంప్రదాయాలు పవన్‌కి తెలియదు..' అని కొందరు పవన్‌పై ఎదురుదాడి చేసి ఊరుకున్నారనుకోండి.. అది వేరే విషయం. 

మరి, మురళీమోహన్‌.. పవన్‌ చేసే విమర్శల్నీ స్వాగతిస్తున్నారనుకోవాలా.? చంద్రబాబు భయపడ్తున్నారని పవన్‌ చేసిన వ్యాఖ్యల్ని మురళీమోహన్‌ సమర్థిస్తున్నారా.? హిందీ చేతకాని ఎంపీలు.. అని పవన్‌ అన్నది నిజమేనని మురళీమోహన్‌ ఒప్పుకున్నారా.? ఇదేమన్నా సినిమా ప్రారంభోత్సవమా.. సినీ స్టార్స్‌ కాబట్టి చిరంజీవినీ, పవన్‌కళ్యాణ్‌నీ ముందెట్టడానికి.! ఎంపీగారూ కాస్త ఆలోచించండయ్యా.. సినీ మత్తు నుంచి బయటపడి, నియోజకవర్గ ప్రజలేమనుకుంటున్నారో ప్రజాప్రతినిథిగా తెలుసుకోండి.. మీ ప్రస్తుత స్థాయి ఏంటో మీకు అర్థమవుతుంది.

Show comments