ఒకే రోజు.. ఒకే అంశం గురించి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసి.. చర్చలో భాగస్వామ్యులయ్యారు మెగా బ్రదర్స్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నోట్ల మార్పిడి అంశంపై “జనసేన’’ అధినేత పవన్ పవన్ కల్యాణ్ ఒకరకంగా, పవన్ వాళ్ల అన్నయ్య.. ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు మరో రకంగా స్పందించారు. మెగా బ్రదర్స్ గా పేరు పొందిన వీళ్లు.. మెగాభిమానులకు రెండు కళ్లలాంటి వీళ్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషం.
నోట్ల మార్పిడి అంశంపై వేరే వాళ్లు రాసిన కవితను షేర్ చేసి దాని ద్వారా తన అసహనాన్ని తెలియజెప్పాడు పవన్ కల్యాణ్. ఈ వ్యవహారంతో సామాన్యుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడనే ఆవేదన దాగిన కవితను పవన్ షేర్ చేశాడు. ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో.. బీజేపీకి దూరంగా మరో అడుగు వేశాడు ‘జనసేన’ అధినేత. ఇప్పటికే ఏపీకి ప్యాకేజీ విషయంలో తెలుగుదేశం తీరును సమర్తిస్తూనే, బీజేపీ తీరుపై మాత్రం విమర్శలు చేస్తున్నాడు పవన్. ఇక నోట్ల రద్దు అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడీయన.
అయితే.. ఇదే సమయంలో పవన్ వాళ్ల అన్నయ్య నాగబాబు మాత్రం నోట్ల మార్పిడి వ్యవహారంలో మోడీకి జై కొడుతూ మీడియాకు బైట్ ఇవ్వడం ఆసక్తిదాయకంగా ఉంది.
స్వతంత్రం వచ్చాక తీసుకున్న సంచలన నిర్ణయం ఇది అని నాగబాబు అన్నారు. ఈ విషయంలో ప్రజలు అసహనం వ్యక్తం చేయడం సమంజసం కాదు అని వ్యాఖ్యానించిన నాగబాబు.. రాజకీయ పార్టీలు మోడీపై విమర్శలు చేయడం సరికాదని కూడా అన్నాడు. ఏతావాతా.. నోట్ల మార్పిడి వ్యవహారాన్ని ఏ మాత్రం తప్పుపట్టడానికి లేదు, ఈ విషయాన్ని అంతా స్వాగతించాల్సిందే అని నాగబాబు స్పష్టం చేశాడు!
అభిమానులు అంతా ఒకటిగా చూసుకునే.. అన్నదమ్ముల మధ్య ఇలాంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం విశేషం. అయితే నాగబాబు ది ఒకరకంగా అనూహ్యమైన స్పందనే!
ఎందుకంటే.. ఈయన అన్ని సమకాలీన అంశాల గురించి స్పందించే వ్యక్తీ కాదు, ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలోనూ లేడు.. అయినప్పటికీ ఈ అంశంపై స్పందించాడంటే, బీజేపీ నేతలు..ఈ మెగాబ్రదర్ ను ఏమైనా దువ్వుతున్నారా? పవన్ తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో.. నాగబాబును కమలం నేతలు ఎంకరేజ్ చేస్తున్నారా? అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి!
ఇక ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి స్పందించలేదిప్పటి వరకూ. కాంగ్రెస్ పార్టీ విధానం మేరకు అయితే.. నోట్ల మార్పిడికి వ్యతిరేకమే. అయితే వ్యక్తిగతంగా చిరంజీవి ఏమనుకుంటున్నారో!