'గ్యాంగ్‌స్టర్ నయీం బాధితుల కన్నా నట్టికుమార్ బాధితులే ఎక్కువగా వుంటారు.. స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తే నట్టికుమార్ బాగోతం బయటపడ్తుంది..' అంటూ సినీ నిర్మాత నట్టికుమార్‌పై, మరో నిర్మాత సి.కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. నట్టికుమార్ జీవితం అంతా బ్లాక్‌మెయిల్, బ్లూ ఫిలింస్‌తోనే నిండిపోయిందని కళ్యాణ్ ఆరోపించారు. సినీ పరిశ్రమను పీడిస్తోన్న పైరసీ భూతం వెనుక నట్టికుమార్ వున్నాడనీ, నట్టికుమార్ తనయుడే ఈ రాకెట్‌ని నడుపుతున్నాడనీ, గతంలో పలుమార్లు ఈ విషయమై నట్టికుమార్‌ని హెచ్చరించామన్నారు సి.కళ్యాణ్.
సినీ పరిశ్రమపై నట్టికుమార్ ఆరోపణలు చేయడం, గ్యాంగ్‌స్టర్ నయీంతో టాలీవుడ్ ప్రముఖులకు సంబందాలున్నాయని నట్టికుమార్ ఆరోపించడం తెల్సిన విషయాలే. తమపై నట్టికుమార్ ఆరోపణలు చేయడాన్ని టాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొచ్చి, నట్టికుమార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. మరోపక్క, నట్టికుమార్ పబ్లిసిటీ స్టంట్లు కూడా బయటపడ్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఓ థియేటర్ విషయంలో నట్టికుమార్ చేసిన ఆరోపణలు ఉత్తదేనని తేలిపోయింది. దాంతో, నట్టికుమార్ నుంచి 'సౌండ్ ఆఫ్' అయిపోయింది. నట్టికుమార్ సైలెంటవడంతో, టాలీవుడ్ నుంచి ఇప్పుడాయనపై విమర్శలు ఎడా పెడా దూసుకొచ్చేస్తున్నాయి. నయీంతో సంబంధాలపై ఆరోపణలు చేస్తున్న నట్టికుమార్, ఆ వివరాల్ని 'సిట్'కి అందించాలని డిమాండ్ చేస్తున్న నిర్మాత సి.కళ్యాణ్, ఈ విషయంలో తామే సిట్‌ని ఆశ్రయిస్తామని చెబుతుండడం గమనార్హం.
మిగతా ఆరోపణలెలా వున్నా, బ్లూ ఫిలింస్ ఆరోపణలు నట్టికుమార్‌పై సి.కళ్యాణ్ చేస్తుండడం విశేషం. పైగా, ఫ్యాక్షనిస్ట్ మద్దెలచెరువు సూరిని హత్యచేసిన భానుతో లింకులున్నాయని అప్పట్లో సి.కళ్యాణ్‌పై ఆరోపణలొచ్చాయి. నట్టికుమార్ మాటల్లో నిజమెంతో, సి.కళ్యాణ్ ఆరోపణల్లో నిజమెంతోగానీ, ఇలాంటోళ్ళు టాలీవుడ్‌లో పెద్దలుగా, ప్రముఖులుగా, నిర్మాతలుగా చెలామణీ అవుతుండడం బహుశా తెలుగు సినీ పరిశ్రమ దౌర్భాగ్యమేమో.!